రికవరీ బాటలో పరిశ్రమలు..
న్యూఢిల్లీ: పరిశ్రమలు మే నెలలో సానుకూల ఫలితాన్ని అందించాయి. ఆర్థికాభివృద్ధికి సంకేతాలను ఇస్తూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.7 శాతం వృద్ధి సాధించింది. ఇది 19 నెలల గరిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ యేడాది జనవరి నుంచీ చూస్తే, మొదటి నెలలో స్వల్ప వృద్ధి 1.1 శాతం నమోదుకాగా, అటు తర్వాత రెండు నెలల్లో (ఫిబ్రవరిలో 2 శాతం క్షీణత, మార్చిలో 0.5 శాతం క్షీణత) అసలు వృద్ధి చోటు చేసుకోలేదు. ఏప్రిల్‌లో వృద్ధి రేటు 3.4 శాతం నమోదుకాగా, మేలో ఇది మరింత పెరగడం సానుకూలాంశం. కాగా 2013 మే నెలలో ఐఐపీలో అసలు వృద్ధి లేదు. ఆ నెలలో మైనస్ 2.5 (క్షీణత) నమోదయ్యింది.
2 నెలల్లో వృద్ధి 4 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (2014-15, ఏప్రిల్-మే) చూస్తే వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. 2013-14ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో -0.5 శాతంగా నమోదయ్యింది.
కీలక రంగాలను చూస్తే...
తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి వృద్ధి బాటకు మళ్లింది. ఈ రేటు -3.2 శాతం నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలూ ఏప్రిల్-మేలోనూ ఇదే పరిస్థితి నమోదయ్యింది. 0.7 క్షీణత నుంచి ఈ రంగం 3.7 శాతం వృద్ధికి మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
మైనింగ్: ఈ రంగం ఉత్పత్తి 2013 మేతో పోల్చితే 2014 మేలో క్షీణత నుంచి బైట పడింది. -5.9 శాతం నుంచి 2.7 శాతం వృద్ధి బాటలోకి మళ్లింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది.
విద్యుత్: ఉత్పత్తి వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. రెండు నెలల్లో వృద్ధి భారీగా 5.3 శాతం నుంచి 9 శాతానికి ఎగసింది.
క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు చిహ్నంగా ఉన్న ఈ రంగం ఉత్పత్తి 2013 మేలో అసలు వృద్ధి లేకపోగా 3.7 శాతం క్షీణించింది. అయితే 2014 మేలో ఈ రంగం 4.5 శాతం వృద్ధికి మళ్లింది. ఏప్రిల్-మే నెలల్లో సైతం ఉత్పత్తి -2.1 శాతం (క్షీణత) నుంచి 9.3 శాతం వృద్ధికి మళ్లింది.
వినియోగ వస్తువులు: ఈ రంగం ఉత్పత్తి 18.3 శాతం క్షీణ బాటలోంచి 3.2 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే ఏప్రిల్-మే నెలల్లో క్షీణత కొనసాగుతోంది. అయితే ఈ క్షీణత - 14 శాతం నుంచి - 2.5 శాతానికి మెరుగుపడింది.
విశ్వాసం పెరుగుతోంది...: పారిశ్రామిక ప్రతినిధులు
తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక ఉత్పత్తిలో క్షీణత ధోరణి ముగిసినట్లేనని, ఉత్పత్తి రికవరీ బాట పట్టిందని పేర్కొనేలా గణాంకాలు ఉన్నాయన్నారు. ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా వ్యాఖ్యానిస్తూ, తయారీ రంగం వృద్ధిని నమోదుచేసుకున్నప్పటికీ, బేస్ ఎఫెక్ట్‌నూ (తాజా గణాంకాలకు గత ఏడాది మేలో క్షీణతను ప్రాతిపదికగా తీసుకోవడం) ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
అయితే తయారీ రంగంలోని మెజారిటీ విభాగాలు సానుకూలతలో ఉండడం హర్షణీయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పారిశ్రామికోత్పత్తి గణాంకాల్లో సానుకూల ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.5 శాతాన్ని అధిగమించడానికి ఈ సానుకూల పరిస్థితి దోహదపడుతుందని కూడా కపూర్ అభిప్రాయపడ్డారు.