పరిశ్రమలు పుంజుకున్నాయ్...
* మే నెలలో పారిశ్రామికోత్పత్తి 3.4 % అప్
* వరుసగా2 నెలల క్షీణత తర్వాత వృద్ధి బాటలోకి
* 13 నెలల గరిష్టస్థాయి ఇది...
* మైనస్ నుంచి ప్లస్‌లోకి తయారీ, మైనింగ్..
* విద్యుత్, యంత్రపరికరాల మెరుగైన పనితీరు...
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు వస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎగుమతులు చాన్నాళ్ల తర్వాత మళ్లీ రెండంకెల వృద్ధిని నమోదుచేయగా... ఇప్పుడు పారిశ్రామికోత్పత్తి కూడా మెరుగైన స్థాయిలో పుంజుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ జోరందుకుంటుందన్న విశ్వాసాన్ని పెంచుతున్నాయి. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా శాంతిస్తుండటం రానున్న రోజుల్లో ప్రగతి పురోగతికి బాటలు వేసేలా చేస్తోంది.
న్యూఢిల్లీ: తీవ్ర నైరాశ్యంలో ఉన్న పారిశ్రామిక రంగం ఎట్టకేలకు మళ్లీ శక్తికూడగట్టుకుంది. వరుసగా రెండు నెలల తిరోగమనం నుంచి కోలుకొని వృద్ధి బాటలోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పాదకత సూచీ(ఐఐపీ) 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. ఇది 13 నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. అంతక్రితం 2013 మార్చిలో 3.5 శాతం ఐఐపీ రేటు నమోదైంది. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాలు క్షీణత నుంచి ప్రగతి బాటలోకి రావడమే కాకుండా... యంత్రపరికరాలు, విద్యుత్ రంగాలు మెరుగైన వృద్ధి సాధించడంతో మొత్తం పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత పుంజుకోవడానికి దోహదం చేసింది.
గతేడాది ఏప్రిల్ నెలలో ఐఐపీ 1.5 శాతం వృద్ధిని సాధించగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనస్ 1.8 శాతం, మార్చిలో మైనస్ 0.5 శాతం చొప్పున కుంగిన సంగతి తెలిసిందే. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్‌ఓ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వరుసగా తిరోగమనం(మైనస్)లోనే ఉన్న పారిశ్రామిక ఉత్పాదకత.. ఆ తర్వాత జనవరిలో కాస్త మెరుగుపడి వృద్ధిబాటలో వచ్చింది. అయితే, మళ్లీ ఫిబ్రవరి, మార్చిలో మైనస్‌లోకి జారిపోవడంతో పరిస్థితి ఆందోళకరంగా మార్చింది. అయితే, తిరిగి ఏప్రిల్‌లో వృద్ధి బాటలోకి రావడమేకాకుండా... మెరుగైన ప్రగతి నమోదుకావడం సానుకూలాంశం. కాగా, ఏప్రిల్‌లో తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్‌లలో 14 విభాగాలు వృద్ది పథంలో ఉండటం గమనార్హం.
రంగాల వారీగా పరిస్థితి ఇదీ..
తయారీ రంగం: మొత్తం పారిశ్రామిక ఉత్పాదకత(ఐఐపీ)లో దాదాపు 75 శాతం వెయిటేజీ ఉండే ఈ రంగం ఏప్రిల్‌లో 2.6 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది మార్చిలో మైనస్ 1.2 శాతం క్షీణించగా... క్రితం ఏడాది ఏప్రిల్‌లో 1.8 శాతం వృద్ధి నమోదైంది.
మైనింగ్: మార్చిలో మైనస్ 0.4 శాతం క్షీణత నుంచి ఏప్రిల్‌లో వృద్ధి బాటలోకి వచ్చి 1.2 శాతం పుంజుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్‌లో ఈ రంగం మైనస్ 3.4 శాతం క్షీణించింది.యంత్ర పరికరాలు: డిమాండ్‌కు కొలమానంగా భావించే ఈ రంగం వృద్ధి రేటు ఏప్రిల్‌లో ఏకంగా 15.7 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో మైనస్ 0.3 శాతం తిరోగమనంలో ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చిలో మైనస్ 12.5 శాతం క్షీణతలో ఉంది. అంటే క్రితం నెలతో పోలిస్తే అత్యంత వేగంగా పుంజుకున్నట్లు లెక్క.
విద్యుత్: గతేడాది ఏప్రిల్‌లో 4.3 శాతం వృద్ధిని నమోదు చేసిన ఈ రంగం ఈ ఏడాది ఇదే నెలలో 11.9 శాతం వృద్ధి రేటును సాధించింది. మార్చిలో ఈ వృద్ధి 5.4 శాతంగా ఉంది.కన్సూమర్ గూడ్స్: మిగతా రంగాలకు భిన్నంగా ఏప్రిల్ నెలలో మైనస్ 5.1 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో 1.7 శాతం వృద్ధిచెందగా.. ఈ ఏడాది మార్చిలో ఈ రంగంఉత్పాదకత మైనస్ 0.9 శాతం క్షీణించింది.కన్సూమర్ డ్యూరబుల్స్: ఈ రంగం ఉత్పాదకత క్షీణత గతేడాది ఏప్రిల్‌లో మైనస్ 9.6% కాగా, ఈ ఏడాది ఇదే నెలలో మైనస్ 7.6 %గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో ఈ రేటు మైనస్ 11.8 శాతం.
సానుకూల పరిణామమిది: కార్పొరేట్లు
ఐఐపీలో కీలకమైన మైనింగ్, తయారీ, విద్యుత్ ఈ మూడు రంగాలూ వృద్ధి బాటలో పయనించడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామమని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగం, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచాలంటే(ఫీల్ గుడ్ ఫ్యాక్టర్) మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు వేగవంతమైన, వృద్ధికి ఊతమిచ్చే విధానాలను తక్షణం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి కొన్ని భారీ సంస్కరణలు, విధానపరమైన చర్యలను ఆశిస్తున్నట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా చెప్పారు.