న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ తగిన సానుకూల గణాంకాలను చూస్తోంది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 5.6 శాతంగా (2022 ఫిబ్రవరితో పోల్చి) నమోదయ్యింది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కలు వెల్లడించాయి.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతం పెరిగింది. అంటే 2022 ఇదే నెలతో పోల్చితే ఈ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.66 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 15 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 6 శాతం ఎగువనే కొనసాగుతోంది.
కూరగాయల ధరలు కూల్...
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత గణాంకాల ప్రకారం మార్చిలో కూరగాయలు, ప్రొటీన్ రిచ్ ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. కూరగాయల ధరలు 8.51 శాతం తగ్గాయి (2022 ఇదే నెలతో పోల్చి). ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరలు 7.86 శాతం దిగిరాగా, చేపల ధర 1.42 శాతం దిగివచ్చింది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం భారీగా 18.2 శాతం ఎగశాయి. తృణ ధాన్యాలు–ఉత్పత్తుల ధరలు 15.27 శాతం ఎగశాయి. పండ్ల ధరలు కూడా పెరిగాయి. ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.95 శాతం వద్ద ఉంటే, మార్చిలో 4.79 శాతానికి తగ్గింది. 2022 ఇదే నెల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు 7.68 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment