న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి.
2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు
2021–22 వృద్ధి అంచనాలను ఎన్‌ఎస్‌ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి.
2022–23లో 7 శాతంగా అంచనా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్‌ఎస్‌ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం.
4.4 శాతం వృద్ధి ఎలా అంటే..
ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది.
కీలక రంగాల తీరిది...
► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం.
► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది.
► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది.
► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది.
► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది.
2022–23పై అంచనాలు ఓకే
మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది.
– వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
తగ్గిన వృద్ధి వేగం
Published Wed, Mar 1 2023 12:14 AM | Last Updated on Wed, Mar 1 2023 4:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment