Economic slowdown
-
మేలో నియామకాల్లో క్షీణత
ముంబై: ఉద్యోగ నియామకాల పట్ల కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది. అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆర్థిక వృద్ధి నిదానించడంతో వ్యయాలు తగ్గించుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం నియామకాలు తగ్గడానికి కారణమని ఈ నివేదిక అభిప్రాయపడింది. నైపుణ్యాల అంతరం ఉండడంతో, అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించడం కంపెనీలకు సవాలుగా మారినట్టు పేర్కొంది. విప్లవాత్మక టెక్నాలజీల పాత్రను కూడా ప్రస్తావించింది. ఇవి పరిశ్రమలు, ఉద్యోగ స్వరూపాలను మార్చివేస్తున్నట్టు తెలిపింది. ఆటోమేషన్ తదితర టెక్నాలజీల ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతున్నట్టు వివరించింది. కొత్త నైపుణ్యాలతోనే రాణింపు..: ‘‘ప్రస్తుత నియామక ధోరణలు భారత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సవాళ్లకు నిదర్శనం. ఈ సవాళ్ల మధ్య ఉద్యోగార్థులకు అవకాశాలను అందించే వృద్ధి విభాగాలు కూడా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో షిప్పింగ్/మెరైన్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు, రిటైల్, రవాణా, పర్యాటక విభాగాల్లో నియామకాలు పెరిగాయి. సమీప కాలానికి సవాళ్లతో కనిపిస్తున్నా, ఆర్థిక వృద్ధి బలపడితే అన్ని రంగాల్లోనూ నియామకాలు తిరిగి పుంజుకుంటాయి. నేడు డిమాండ్ ఉన్న నైపుణ్యాలు, భవిష్యత్తులోనూ రాణిస్తాయని చెప్పలేం. కనుక ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, నూతన నైపుణ్యాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీశ తెలిపారు. ఆన్లైన్లో వివిధ ని యామక పోర్టళ్లలోని వివరాల ఆధారంగా నెలవారీగా ఈ నివేదికను ఫౌండిట్ విడుదల చేస్తుంటుంది. హైదరాబాద్‌లోనూ డౌన్ హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ/ఎన్సీఆర్ పట్టణాల్లో మే నెలలో నియామకాలు, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 –16 శాతం తక్కువగా నమోదైనట్టు ఫౌండిట్ తెలిపింది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరగ్గా, బెంగళూరులో 24 శాతం తగ్గాయి. -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఆర్థిక మందగమనం: జ్యుయల్లరీ ఎగుమతులు డౌన్
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జూలైలో స్వల్పంగా తగ్గాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశం ఈ కాలంలో రూ.24,914 కోట్ల (3,130 మిలియన్ డాలర్లు) విలువైన రత్నాలు, ఆభరణాలను ఎగుమతి చేసింది. జీజేఈపీసీ నివేదిక ప్రకారం 2021 ఇదే నెల్లో ఈ విలువ రూ.25,158 కోట్లు (3,376 మిలియన్ డాలర్లు). ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో వీటి ఎగుమతుల పరిమాణం 11 శాతం పెరిగి 1,03,931 కోట్లకు (13,368 మిలియన్ డాలర్లు) చేరింది. కాగా ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ స్థూల ఎగుమతులు 8 శాతం పెరిగి రూ.15,388 కోట్లకు (1,933.32 మిలియన్ డాలర్లు) ఎగశాయి. ఇక ఏప్రిల్–జూలై మధ్య వెండి ఆభరణాల ఎగుమతుల విలువ తొలి అంచనాల ప్రకారం 30 శాతం పెరిగి రూ.8,232 కోట్లకు (1,058 మిలియన్ డాలర్లు) ఎగసింది. -
రెండు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్‌లుక్‌ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్‌గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.., ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి. భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్‌మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్‌డాక్ 4.7%, ఎస్అండ్పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి. అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం. ► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది. రూ‘పాయె’! 77.65కి రికార్డు పతనం ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్‌సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్‌లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
కారు.. పల్లె‘టూరు’!
కరోనా వైరస్ వాహన విక్రయాలను కాటేసింది. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. కరోనా కల్లోలం, ఆర్థిక మందగమనం సెగ పెద్దగా తాకని గ్రామీణ మార్కెట్లు తమను గట్టెక్కిస్తాయని వాహన కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆ ఆశలను గ్రామీణ మార్కెట్లు నెరవేర్చాయి. భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. పల్లె మార్కెట్ల దన్నుతో వాహన రంగం పుంజుకుంది. గ్రామీణ మార్కెట్లలో మరింత పుంజుకోవడానికి కంపెనీలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలపై ‘సాక్షి బిజినెస్’ స్పెషల్ స్టోరీ.... కరోనా మహమ్మారి వాహన రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. లాక్డౌన్ కారణంగా టూ వీలర్లు, కార్ల అమ్మకాలు అసలే జరగలేదు. మే నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. గత పదేళ్లలో వాహన విక్రయాలకు సంబంధించి అత్యంత అధ్వానమైన నెల ఇదే. లాక్డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించిన తర్వాత అమ్మకాలు పెంచుకోవడానికి వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాయి. కరోనా కల్లోలం కారణంగా పట్టణ మార్కెట్, పట్టణాల ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి. అయితే గ్రామాల్లో కరోనా కల్లోలం పెద్దగా లేకపోవడం, గ్రామీణ ఆర్థిక స్థితిగతులపై కరోనా కల్లోలం ప్రభావం స్వల్పంగానే ఉండటంతో వాహన కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి పల్లెబాట పట్టాయి. గ్రామీణులను ఆకర్షించడానికి మొబైల్ షోరూమ్స్ ఏర్పాటు చేశాయి. రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నాయి. ఫలించిన ప్రయత్నాలు... ఆరు నెలల కాలంలో ఈ ప్రయత్నాలు ఫలించాయి. వాహన విక్రయాలు మెల్లమెల్లగా రికవరీ అయ్యాయి. పండుగల సీజన్లో బాగా పుంజుకున్నాయి. గ్రామీణ మార్కెట్ల దన్నుతోనే వాహన విక్రయాలు కళకళలాడాయి. వాహన కంపెనీలకు భవిష్యత్తుపై భరోసాను కూడా గ్రామీణ మార్కెట్లే ఇచ్చాయి. ఇక ఇప్పుడు పట్టణ మార్కెట్లు కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. వెయ్యి కొత్త షోరూమ్‌లు... ఆర్థిక మందగమనం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటంతో దాదాపు 300కు పైగా వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. పులి మీద పుట్రలా ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కల్లోలం కూడా జత అయింది. దీనికి లాక్డౌన్ ఆంక్షలు తోడయ్యాయి. ఫలితంగా పరిస్థితులు మరింత అస్తవ్యస్తం కావాలి. అంటే మరిన్ని షోరూమ్‌లు మూతపడాల్సి ఉంది. కానీ లాక్డౌన్ ఆంక్షలు సడలిన తర్వాత వాహన కంపెనీలు కొత్తగా వెయ్యికి పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను ప్రారంభించాయి. వీటిల్లో అధిక భాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి, కొత్త కొత్త మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడానికి టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు ఆయా గ్రూప్కంపెనీల తోడ్పాటు ఇతోధికంగా ఉపయోగపడింది. టాటా మోటార్స్ కంపెనీ తన ఇతర గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేసింది. వీటన్నిటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో టాటా మోటార్స్ వాటా 5% పెరిగి 43 శాతానికి, మహీంద్రా వాటా 6% పెరిగి 53 శాతానికి చేరాయి. మొబైల్, చిన్న షోరూమ్‌లు... టాటా మోటార్స్ కంపెనీ మొబైల్ షోరూమ్స్‌ను ఏర్పాటు చేసింది. తక్కువ వ్యయాలతోనే వీటిని ఏర్పాటు చేసి, గ్రామీణులకు టెస్ట్ డ్రైవ్ అవకాశాన్ని కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు వేగంగా విక్రయానంతర సేవలందించే నిమిత్తం వాహన కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ ఒకడుగు ముందుకు వేసి జిప్ సర్వీస్ పేరుతో బైక్‌ల ద్వారా ఈ సేవలందిస్తోంది. పట్టణాల్లోని షోరూమ్‌ల్లో నాలుగో వంతు ఉండేలా చిన్న చిన్న షోరూమ్స్‌ను వాహన కంపెనీలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మకాలు పుంజుకోవడానికి ఇవి బాగానే తోడ్పడ్డాయి. వాహన కంపెనీలు స్టూడియో స్టోర్స్, షోరూమ్ లైట్, ఎమర్జింగ్ మార్కెట్ అవుట్‌లెట్స్, స్మార్ట్ షోరూమ్ పేర్లతో చిన్న షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. కియా కంపెనీ స్మార్ట్ అవుట్లెట్ పేరుతో చిన్ని చిన్న కార్ల షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. డిజిటల్ జోరు... కరోనా కల్లోలం కారణంగా ప్రజలు బయటకు రావడం తగ్గింది. దీంతో కార్ల కంపెనీల షోరూమ్స్ వెలవెలపోతున్నాయి. దీనిని అధిగమించడానికి హ్యుందాయ్ కంపెనీ ‘క్లిక్ టు బై’ పేరుతో డిజిటల్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. కారు కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారుడు షోరూమ్‌కు వెళ్లకుండానే క్లిక్ టు బై డిజిటల్ షోరూమ్‌లో నచ్చిన కారును ఎంచుకొని హోమ్ డెలివరీ పొందవచ్చు. కొత్తగా మన మార్కెట్లోకి వచ్చిన కియా మోటార్స్, ఎమ్జీ మోటార్ కంపెనీలు డిజిటల్ షోరూమ్‌ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. వినూత్నమైన స్కీమ్‌లు... ఆర్థిక మందగమనం, కరోనా కల్లోలం కారణంగా పట్టణాల్లో వాహన విక్రయాలు కుదేలయ్యాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడంతో అమ్మకాల కోసం వాహన కంపెనీలు కొత్త దారులు వెదుకుతున్నాయి. ఆదాయాలు పడిపోవడంతో చాలామంది వాహనాలు కొనలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి సబ్స్క్రిప్షన్, లేదా లీజు ద్వారా వాహన వాడకం తదితర ఆకర్షణీయ స్కీమ్‌లను వాహన కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఉద్యోగం పోయిన పక్షంలో ఈఎమ్ఐల చెల్లింపుల్లో వెసులుబాటును ఇవ్వడం వంటి వినూత్నమైన స్కీమ్‌లను వాహన కంపెనీలు అందిస్తున్నాయి. వాహన కంపెనీల పల్లెబాట ఇలా ► మహీంద్రా: ఫార్మ్ ఎక్విప్మెంట్ డివిజన్‌తో కలసి 475 కొత్త అవుట్‌లెట్స్ ఏర్పాటు. ► టాటా మోటార్స్: గ్రూప్ కంపెనీలతో కలిసి జాయింట్ మార్కెటింగ్ వ్యూహం అమలు. ► మారుతీ సుజుకీ: 12,500 రెసిడెంట్ డీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం. ► హ్యుందాయ్: కొత్త విధానంలో షోరూమ్‌ల ఏర్పాటు, బైక్‌ల ద్వారా విక్రయానంతర సేవలు అందిస్తోంది. ► కియా మోటార్స్, ఎమ్జీ మోటార్: డిజిటల్ షోరూమ్‌ల ఏర్పాటు, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత. ► టయోటా కిర్లోస్కర్: కొత్తగా వంద సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటు. కొత్త ఏడాదిలో ధరలకు రెక్కలు..! ముంబై: కొత్త ఏడాదిలో కారు కొనడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులకు ఏడాది ప్రారంభంలోనే నిరాశ ఎదురుకానుంది. పలు కార్ల కంపెనీలు జనవరి 1 నుంచి తమ మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించడం ఇందుకు కారణం. ఆటో రంగంలో తలెత్తిన సంక్షోభంతో పాటు కోవిడ్ ప్రేరేపిత లాక్‌డౌన్‌తో 2020లో కార్ల అమ్మకాలు, ఎగుమతులు భారీగా తగ్గిపోవడంతో వాహన కంపెనీలు తప్పనిసరిగా ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతీ సుజుకీ...: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ‘‘గత ఏడాది కాలంగా కార్ల తయారీ వ్యయాలు పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమర్లు ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది’’ అని కంపెనీ ఎక్చ్సేంజీలకు వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయం మోడల్ ప్రాతిపదికన మారుతుందని మారుతీ సుజుకీ పేర్కొంది. అదే దారిలో ఫోర్డ్ ఇండియా కూడా... మారుతీ సుజుకీ దారిలోనే ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కూడా వచ్చే జనవరి 1 నుంచి తన అన్ని రకాల మోడళ్లపై ధరలను ఒకశాతం నుంచి 3% వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఆయా మోడళ్లను బట్టి ఈ పెంపు రూ.5వేల నుంచి రూ. 35 వేలు దాకా ఉండొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే 2020 ఏడాది ముగిసే లోపు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధరల సెగలు తగలవని వినయ్ వివరించారు. -
ఈ ఏడాది మీ వేతన పెంపు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో 2020లో సగటు వేతన పెంపు పదేళ్ల కనిష్టస్ధాయిలో 9.1 శాతానికే పరిమితమవుతుందని ప్రముఖ ప్రొషెషనల్ సేవల సంస్థ ఏఓన్ పీఎల్సీ వార్షిక వేతన పెంపు సర్వే వెల్లడించింది. 2018, 2019లో కంపెనీలు వరుసగా సగటున 9.5, 9.3 శాతం మేర వేతనాలను పెంచాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కుదిపివేసిన క్రమలో ఆ ఏడాది సగటు వేతన పెంపు 6.6 శాతమే. ఇక 2020లో సగటు వేతన పెంపు స్వల్పమేనని సర్వే వ్యాఖ్యానించింది. అయితే వేతన పెంపు కనిష్టంగా ఉన్నప్పటికీ పలు కంపెనీలు పది శాతం కంటే అధికంగా ఇంక్రిమెంట్లు ఇవ్వనుండటం ఊరట ఇవ్వనుంది. 2020లో రెండంకెల వేతన వృద్ధిని చేపడతామని 39 శాతం కంపెనీలు వెల్లడించాయని సర్వే తెలిపింది. 2012 నుంచి 2016 వరకూ వేతనాలు రెండంకెల వృద్ధి సాధించాయని, ఇటీవల సంవత్సరాల్లో 9 శాతానికి తగ్గాయని సర్వే తెలిపింది. 20 రంగాలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించి శాలరీ ట్రెండ్స్‌ను పసిగట్టింది. తయారీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో వేతన పెంపు అధికంగా ఉంటుందని వెల్లడించింది. చదవండి : జీతాలతో పనేముంది? -
నిస్సారమైన బడ్జెట్: రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా చప్పగా, నిస్సారంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో ఏమీ లేదని పెదవి విరిచారు. దేశంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్యను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే.. మాటలే తప్ప చేతలు చేతకాని ప్రభుత్వమని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పన్ను శ్లాబుల్లో గారడీ చేశారని, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అసలైన పరిష్కార మార్గాలు చూపలేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ బడ్జెట్లో యువతకు ఉద్యోగం కల్పించేందుకు ఎలాంటి వాస్తవికత, వ్యూహాత్మకమైన భావన ఏమీ కన్పించట్లేదు’అని పేర్కొన్నారు. ‘ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెబుతున్నట్లు.. కొత్త సీసాలో పాత సారాయి పోసినట్లు ఉంది’అని ఆరోపించారు. ‘చాలా ఎక్కువ సేపు చదివిన బడ్జెట్ మాత్రమే కాదు.. అత్యంత నిస్తేజమైన బడ్జెట్ ఇది’అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎద్దేవా చేశారు. ‘అచ్ఛే దిన్’ను కేంద్రం ఎలా వదిలిపెట్టిందో.. ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూడా గాలికొదిలేసిందని ట్విట్టర్లో దుయ్యబట్టారు. పన్ను చెల్లింపుదారులను ఆరేళ్లుగా పీడించుకుని తిన్న కేంద్ర ప్రభుత్వం.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన విషయాన్ని ఇప్పుడు గుర్తించినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు బడ్జెట్ మొత్తంలో ఉద్యోగాల గురించి ఎక్కడా ఒక్క పదం కూడా లేకపోవడం గర్హనీయమని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. -
‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు. మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు. 26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు. -
పసిడి.. డిమాండ్ ఢమాల్!
న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం– నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు. 2019లో 690 టన్నులకు పడింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, డిమాండ్ 598 టన్నుల నుంచి 544 టన్నులకు దిగింది. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 10 శాతం తగ్గి 162.4 టన్నుల నుంచి 146 టన్నులు చేరింది. ► 2019 అక్టోబర్ 25న వచ్చిన దంతేరాస్‌లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. దేశీయంగా పసిడి ధరల తీవ్రత, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు దీనికి కారణం. ► అయితే విలువ పరంగా మాత్రం భారత్ పసిడి డిమాండ్ రూ.2,11,860 కోట్ల నుంచి రూ.2,17,770 కోట్లకు పెరగడం గమనార్హం. ► చైనా తర్వాత పసిడి డిమాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో 2020లో ఈ మెటల్ డిమాండ్ 700 నుంచి 800 టన్నుల మధ్య ఉండవచ్చన్నది అంచనా. ప్రభుత్వం తీసుకునే పలు చర్యలతో ఆర్థిక వృద్ధి పుంజుకునే అవకాశాలు ఉండడం దీనికి కారణం. ► 2019 ప్రారంభంలో ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే, సంవత్సరం చివరకు వచ్చే సరికి రూ.39,000పైన ముగిసింది. ఒక దశలో రూ.40,000 మార్క్‌ను దాటడం కూడా గమనార్హం. ► బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్క్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం జనవరిలో నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్ మార్క్ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అంశాలు పసిడిని దేశంలో మరింత విశ్వసనీయ మెటల్‌గా పెంపొందిస్తాయి. ► అయితే పసిడికి స్వల్పకాలంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పరిశ్రమలో లాభాలు తగ్గడం, పన్నుల అనిశ్చితి వంటివి ఇందులో ఉన్నాయి. ► 2019లో దేశ పసిడి దిగుమతులు స్మగ్లింగ్‌సహా 14% తగ్గి 756 టన్నుల నుంచి 647 టన్నులకు పడింది. స్మగ్లింగ్ 115–120 టన్నులు ఉంటుందని అంచనా. 2020లో డిమాండ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు. ► కస్టమ్స్ సుంకం ప్రస్తుతం 12.5 శాతం ఉంటే ఇది 10 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ► దేశ పసిడి డిమాండ్‌లో 60 శాతంపైగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం గమనార్హం. ఇక్కడ ఆభరణాలను సాంప్రదాయక సంపదగా భావిస్తుండడం దీనికి కారణం. ప్రస్తుతం దేశంలో రూ. 40వేల పైనే... పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముంౖ»ñ æసహా దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.40,000పైనే కొనసాగుతోంది. గురువారం ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో ధర రూ.210 పెరిగి రూ.41,790కి చేరింది. న్యూఢిల్లీలో రూ.400 ఎగసి రూ.41,524కు చేరింది. అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా సమీప కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, చైనా కరోనా వైరస్ నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా పసిడివైపు ఇన్వెస్టర్లు చూస్తుండడం గమనార్హం. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు ఒకానొకదశలో 10 డాలర్లు పెరిగి 1,580 డాలర్లను తాకింది. -
ఒకే జీఎస్టీ రేటు ఉండాలి..
అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరసి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్ తిరిగి గాడినపడాలని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్లో ప్రకటించబోయే ఉద్దీపనలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను శ్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ► ఎఫ్ఎంసీజీ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిపడ నగదు లభ్యత లేక చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సంప్రదాయ వ్యాపారాలు బలహీనపడుతున్నాయి. ► పంటలకు సరైన ధర, వ్యవసాయేతర ఆదాయాలు తగ్గడం వంటి అంశాల్లో ప్రభుత్వ మద్దతు కొరవడి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ నిరుత్సాహపరుస్తోంది. ► భారతావనిలో వినియోగం పరంగా సుమారు 75% గ్రామీణ ప్రాంతమే. ఈ నేపథ్యంలో పంటలకు మద్ధతు ధర, ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల టర్నోవర్ మెరుగవుతుంది. ► ద్రవ్య సరఫరాను పెంచే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. అయితే డిమాండ్ లేకపోవడంతో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మందగమనం నుంచి గట్టెక్కడానికి ఖర్చుచేయతగ్గ ఆదాయం పెరగాలంటే పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. ► విక్రయాలు తిరిగి పుంజుకుంటే ఎఫ్ఎంసీజీ కంపెనీలు సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు చేస్తాయి. నియామకాలను చేపడతాయి. ► వేతనాలు అధికమైతే సేవింగ్స్ పెరుగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలను తేవాలి. పలు రంగాల్లో ఉద్దీపనలు ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే వాతావరణం కల్పించాలి. ► జీఎస్టీ రేట్లను తగ్గించాలి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులన్నింటికీ ఒకే పన్ను రేటును అమలు చేయాలి. తయారీపై ప్రణాళికగా వెళ్లేందుకు కంపెనీలకు మార్గం ఏర్పడుతుంది. తయారీ పెరిగితే కింది స్థాయిలో తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు అధికమవుతాయి. ► ఈ–కామర్స్ కంపెనీల కారణంగా సాధారణ బిస్కట్లు, చవక తృణధాన్యాలు, గింజల అమ్మకాలు లేకుండాపోయాయి. వ్యాపారాలు గాడినపడేందుకు చిన్న కిరాణా వర్తకులు, ఎఫ్ఎంసీజీ దుకాణదారులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. ► మందగమనం నుంచి గట్టెక్కాలంటే వినియోగం పెరగాలి. కార్పొరేట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, పన్ను ఆదాయం తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయంపైనా ఆ మేరకు ప్రభావం చూపుతోంది. సెంటిమెంటు బలపడడానికి, పన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సమతులంగా వ్యవహరించాలి. బడ్జెట్‌పైనే ఆశలన్నీ..! కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆర్థిక మందగమనం, నిరుద్యోగంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపులు, ప్రాధమ్యాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడం మాత్రమే కాదు, దేశ యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ శాతం పెరిగిపోయి 6.1 శాతంగా నమోదైంది. అలాగే ఉన్న ఉద్యోగులికిచ్చే వేతనాలు కూడా అరకొరగానే ఉంటున్నాయి. అసలే వృద్ధి రేటు తక్కువగా ఉన్న ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అలాగే కొత్త పెట్టుబడులతో కోల్డ్ స్టోరేజీలు, ఆహారశుద్ధి పరిశ్రమలు, లాజిస్టిక్ క్లస్టర్ల ఏర్పాటుతో గ్రామీణ నిరుద్యోగాన్ని కొంత తగ్గించే అవకాశం ఉంది. పట్టణాలు, నగరాలలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. రియల్టీ రంగం, నిర్మాణ రంగాలకు ప్రోత్సాహకాలు అందివ్వడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మన దేశానికి వరంగా మారిన విద్యావంతులైన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించడం ద్వారా వృద్ధి రేటు సాధించడంతోపాటు గణనీయంగా ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ శాతాన్ని తగ్గించవచ్చు. – శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్ గ్రూప్ -
రైల్వే చార్జీల హేతుబద్ధీకరణ
న్యూఢిల్లీ: ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను హేతుబద్ధీకరించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వై.కె.యాదవ్ గురువారం వెల్లడించారు. అయితే, ఛార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన విషయమని విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు. సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణికులను రైల్వే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం కారణంగా రైల్వే ఆదాయంలో తగ్గుదల నమోదవడం తెల్సిందే. రైల్వే నిర్వహణకు ఐదు విభాగాలు రైల్వేలలో ఇకపై యూపీఎస్సీ తరహాలో ఐదు ప్రత్యేక విభాగాలకు నియామకాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగానే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్) కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని అందులో విజయం సాధించిన వారు ఐదు విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఐదు ప్రత్యేక విభాగాల్లో నాలుగు సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్ వంటి ఇంజినీరింగ్ సేవలు కాగా, మిగిలిన నాన్ టెక్నికల్ విభాగం కింద అకౌంట్స్, పర్సనెల్, ట్రాఫిక్ వంటివి ఉంటాయని చెప్పారు. చివరి విభాగంలో ఉద్యోగం కోసం హ్యుమానిటీస్ చదువుకున్న వారూ అర్హులేనని, అందరికీ ఒకేసారి పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఇకపై రైల్వేల సీఈవోగా ఉంటారు. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారే ఈ పదవి చేపట్టనున్నారు. సీనియారిటీకి ఢోకా లేదు: పీయూష్ గోయెల్ రైల్వేలోని వివిధ విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల అధికారుల సీనియారిటీకి ఇబ్బంది కలగబోదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగా రైల్వే బోర్డులో సభ్యులయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. -
భారత్‌లో ఆర్థిక మందగమనం
వాషింగ్టన్: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► నిజానికి భారత్ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. ► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది. ► బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది. ► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. ► వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది. ► బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి. ► ప్రస్తుతం 2019–20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే. ► భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం. ► కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్‌లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం. ► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. -
జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ) కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ‘భారత్: 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనం’ అన్న అంశంపై ఎఫ్ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు. -
పన్ను ఎగవేతదారులను పట్టుకోండి: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే, ఈ వివరాలు వారి వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నుల్లో ప్రతిఫలించకపోవడం.. అటువంటి సమాచారం జీఎస్టీ, ఆదాయపన్ను విభాగాల మధ్య పంపిణీ చేసుకోవడంపై ఇందులో చర్చించారు. ఈ తరహా పన్నుల ఎగవేతదారులను గుర్తించేందుకు సమాచారాన్ని జీఎస్టీ విభాగం ఆదాయపన్ను శాఖతో పంచుకోవాలని పాండే కోరారు. -
ఐటీ కొలువుల వెలుగులు
సాక్షి ప్రతినిధి, అమరావతి: ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త. దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పటికీ.. ఐటీ రంగంలో మాత్రం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు లాభిస్తుందని పేర్కొంటున్నారు. దేశ విదేశాల్లో ఐటీ, డిజిటలైజేషన్‌పై వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వివిధ ఐటీ కంపెనీలు 1.8 లక్షల మందిని ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు అంచనా. అందుకు అనుగుణంగా వ్యాపారమూ పెరిగిందని ఐటీ పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. 2020–21 ఆరి్థక సంవత్సరంలో ఉద్యోగాల సంఖ్యలో కనీసం 10 శాతం వృద్ధి ఉంటుందని, వచ్చే సంవత్సరం భారత ఐటీ కంపెనీలు కనీసం 2 లక్షల మందిని కొలువుల్లోకి తీసుకుంటాయని నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. టాప్–5 కంపెనీల్లోనే 40 శాతం నియామకాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్ర దేశంలో టాప్–5 కంపెనీలు. దేశంలోని మొత్తం నియామకాల్లో 40 శాతం ఈ 5 కంపెనీల్లోనే ఉంటాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో ఈ 5 కంపెనీల్లో 64,442 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎంట్రీ స్థాయిలోనే ఉద్యోగాల్లో చేరారు. మిడిల్–సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల అవసరం పెద్దగా ఉండదని నియామక సంస్థలు చెబుతున్నాయి. రానున్న ఆరి్థక సంవత్సరంలో కనీసం 80 వేల ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు ఈ 5 కంపెనీల్లో వస్తాయని అంచనా వేస్తున్నారు. నియామకాల్లో టీసీఎస్ టాప్ అత్యధిక మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్న కంపెనీల్లో టీసీఎస్ సంస్థ తొలిస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలో 30 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరుగుతుందని నియామక సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది భారీగా రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలున్నాయని టీసీఎస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. పెరగనున్న క్యాంపస్ రిక్రూట్మెంట్లు దేశంలో జరిగే మొత్తం ఐటీ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా కనీసం 20 శాతం ఉంటుందని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఈ మేరకు క్యాంపస్ రిక్రూంట్‌మెంట్లు పెరుగుతాయన్నారు. టాప్ కాలేజీలకే కాకుండా.. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలలకు సైతం వెళ్లి నియామకాలు చేపట్టాలనే యోచన ఉందన్నారు. కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా డిగ్రీ విద్యార్థులనూ ఉద్యోగాల్లో చేర్చుకోనున్నామని వివరించారు. ఐటీ ఒక్కటే ప్రత్నామ్నాయం.. కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉత్పత్తి రంగంలోని కంపెనీలు నియామకాలు తగ్గించాయి. ఫలితంగా ప్రత్యామ్నాయాల కోసం విద్యార్థులు అన్వేíÙస్తారు. వారి ముందు ఉన్న ప్రత్యామ్నాయం ఐటీ రంగం. ఐటీ కంపెనీలకు సైతం కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. ఈ రంగంలో నియామకాలు పెరగడం వారికి కొంత ఊరట. ఐటీ రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం. – మహేష్ పెరి, చైర్మన్, ‘కెరీర్ 360’ ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది ఐటీ రంగంలో బాగా నైపుణ్యం ఉన్న సిబ్బంది భారత్‌లో సులభంగా దొరుకుతారు. అందువల్ల వివిధ గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు మన దేశంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లలో చాలా కంపెనీలు ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఫలితంగా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఎంట్రీ స్థాయిలో ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగాల అవసరం కొంత తక్కువగానే ఉంటుంది’’ – కల్పన, హెచ్ఆర్ హెడ్, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ -
మందగమన భయాలతో నష్టాలు
ఆర్థిక మందగమన భయాలతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత వృద్ధి మందగించగలదన్న వివిధ సంస్థల నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు పతనమై 40,284 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,885 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, ఇంధన, ఎఫ్ఎమ్సీజీ, వాహన షేర్లు క్షీణించాయి. 320 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య కొనసాగినా, ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 135 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 320 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ పూర్తికావడం, ఈ వారంలో ప్రధానమైన ఈవెంట్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. కీలక వడ్డీ రేటును చైనా తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావంతో మన దగ్గర నష్టాలకు కళ్లెం పడిందని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్తలు రావడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. లాభాల్లో టెలికం షేర్లు... ఏ టెలికం కంపెనీని మూతపడనివ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభయం ఇవ్వడంతో టెలికం షేర్లు పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 7 శాతం లాభంతో 21 నెలల గరిష్ట స్థాయి, రూ.420ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.409 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా 22 శాతం లాభంతో రూ.4.47కు చేరింది. n యెస్ బ్యాంక్ 4% నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన షేర్ ఇదే. n గ్లెన్ మార్క్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ ‘అమ్మెచ్చు’ నుంచి ‘కొనొచ్చు’కు అప్‌గ్రేడ్ చేసింది. దీంతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్ 21% లాభంతో రూ.365 వద్ద ముగిసింది. n స్టాక్ మార్కెట్ నష్టపోయినా 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. -
అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ఆయన మాట్లాడారు. అయితే, జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సభా నిబంధనలు, నియమాల మేరకు అన్ని అంశాలపై చర్చించేందుకు, మాట్లాడేందుకు అన్ని పక్షాలకు అవకాశం కల్పిస్తామని, వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందని ప్రధాని అన్నారని అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ,అమిత్‌షా, గులాంనబీ ఆజాద్, విజయసాయిరెడ్డి తదితరులు ఫరూక్ అబ్దుల్లాపై హామీ ఇవ్వని ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం నిర్బంధించిన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాను ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఫరూక్‌ను నిర్బంధించడంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎంపీ హస్నైన్ మసూదీ ప్రస్తావించారు. ఫరూక్‌ను పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉందని మసూదీ పేర్కొన్నారు. ‘కశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సభలో ఈ అంశంపై పట్టుబడతాం’ అని ఆయన తెలిపారు. ‘ఒక పార్లమెంట్ సభ్యుడిని చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారు? ఫరూక్ అబ్దుల్లాతోపాటు జైల్లో ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కూడా పార్లమెంట్ సమావేశాలకు అనుమతించాలి’అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయన్నారు. స్టాండింగ్ కమిటీలకు పంపకుండానే అన్ని బిల్లులను ఆమోదించేలా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అన్ని అంశాలపై చర్చకు అవకాశమిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో మాత్రం మరోవిధంగా వ్యవహరిస్తుందని ఆజాద్ ఆరోపించారు. అయితే, ఫరూక్ అబ్దుల్లా విడుదలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో కోత, వ్యవసాయ సంక్షోభంపై తప్పనిసరిగా చర్చించాలని సభలో కోరతామని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని పాశ్వాన్ ప్రస్తావించారు. హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి థావర్‌చంద్ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్, ప్రతిపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధురి, గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నేత ఆనంద్ శర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వి.విజయసాయి రెడ్డి, టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, సమాజ్ వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సహా 27 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో ఈసారి ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెరిగిన బలం, అయోధ్య వివాదంపై ఇటీవలి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు బీజేపీలో విశ్వాసం పెంచాయి. ఎన్డీయే కూటమి ‘ఉమ్మడి కుటుంబం’ పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. మోదీ సహా హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఈ కూటమిని ఉమ్మడి కుటుంబంగా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నట్లే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయన్నారు. ఈ చిన్న సమస్యల వల్ల కుటుంబం దెబ్బతినే పరిస్థితి రాకూడదన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సభ్య పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ప్రత్యేకంగా కన్వీనర్ లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్జేపీ, అప్నాదళ్, జేడీయూ వంటి పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఎన్డీయేలో సరైన సమన్వయం ఉంటే మహారాష్ట్రలో బీజేపీ–శివసేనల మధ్య ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయేదని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. ఎంపీల గైర్హాజరు ఆందోళనకరం: వెంకయ్య న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు ఎంపీలు గైర్హాజరవుతుండ టంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీల ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవల సమావేశం కాగా 28 మందికి గాను నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అందులో కమిటీ సభ్యుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన ఏకైక ఎంపీ గౌతమ్ గంభీర్ ఆ భేటీకి రాకుండా ఇండోర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేస్తూ కనిపించారు’అని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హిందూ వివాహ, విడాకుల చట్టం–1952 మొదలుకొని ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు–2019 వరకు, 1953లో ధోతీలపై అదనపు ఎౖMð్సజ్ పన్ను నుంచి 2017లో జీఎస్టీ అమల్లోకి తేవడం వరకు రాజ్యసభ పయనం సుదీర్ఘంగా సాగిందని వెంకయ్య అన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని రూ.250 వెండి నాణెం, పోస్టల్‌స్టాంపును విడుదల చేయనున్నామ న్నారు. కాగా, రాజ్యాంగం ఆమోదం పొంది70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందన్నారు. అరుదైన సందర్భం.. 67 ఏళ్ల రాజ్యసభ చరిత్రలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సందర్భాన్ని ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్ 1952’ పుస్తకం వివరించింది. ‘మే 8, 1991న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరుగుతోంది. అధికార, విపక్షాలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో సభ డెప్యూటీ చైర్మన్‌గా ఉన్న ఎంఏ బేబీ విపక్షాలకు అనుకూలంగా ఓటేశారు’ అని వివరించింది. పౌరసత్వ బిల్లు సహా 35 బిల్లులు నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది. పౌరసత్వ బిల్లులో ఏముంది? 1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చిన హిందు, బౌద్ధ, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ మతాలకు చెందిన వారిని భారత పౌరులుగా గుర్తించేందుకు వీలు కల్పించేందుకు పౌరసత్వ సవరణ బిల్లులో వీలు కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గింపు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్ డేటా ప్రొటెక్షన్) బిల్లు, అన్ని రకాలైన వివక్ష నుంచి ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు, ఎలక్ట్రానిక్ సిగరెట్స్‌పై నిషేధం బిల్లు, జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టీగా కాంగ్రెస్ చీఫ్‌కు ఉన్న హోదాను రద్దు చేయడంతోపాటు ఆ ట్రస్ట్ సభ్యులను తొలగించే అధికారాలను ప్రభుత్వానికి కల్పించే బిల్లు ఉన్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో పార్లమెంట్ భవనం -
పరిశ్రమలు.. రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు అద్దం పట్టింది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం– 2019 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –4.3 శాతం క్షీణించింది. అంటే 2018 సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే (అప్పట్లో 4.6 శాతం వృద్ధిరేటు) పారిశ్రామిక ఉత్పత్తి అసలు పెరక్కపోగా –4.3 శాతం క్షీణించిందన్నమాట. ఇంత తీవ్ర స్థాయి క్షీణత గడచిన ఎనిమిదేళ్లలో ఎన్నడూ నమోదుకాలేదు. 2011 అక్టోబర్‌లో ఐఐపీ 5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అటు తర్వాత ఇంత తీవ్ర ప్రతికూల గణాంకం రావడం ఇదే తొలిసారి. ఆగస్టులో కూడా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణతనే (–1.4 శాతం) నమోదుచేసుకోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం. భారీ యంత్రపరికరాల ఉత్పత్తిని సూచించే క్యాపిటల్ గూడ్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి దీర్ఘకాలిక వినియోగ ఉత్పత్తులుసహా కీలకమైన తయారీ, మౌలికం, నిర్మాణం ఉత్పత్తుల్లోనూ సెప్టెంబర్‌లో ‘మైనస్’ ఫలితం వచ్చింది. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► తయారీ: సూచీలో దాదాపు 60 శాతంపైగా వాటా కలిగిన తయారీ రంగం ఉత్పత్తిలో –3.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగంలో 4.8 శాతం వృద్ధి నెలకొంది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 క్షీణతను నమోదుచేసుకున్నాయి. మోటార్ వాహనాలు ప్రత్యేకించి భారీ, మధ్యస్థాయి వాహన ఉత్పత్తి విభాగంలో –24.8 శాతం క్షీణత నమోదయితే, –23.6 శాతం క్షీణతతో తరువాతి స్థానంలో ఫర్నిచర్ ఉంది. ► విద్యుత్: ఈ విభాగంలో 8.2 శాతం ఉత్పత్తి వృద్ధి రేటు –2.6 క్షీణతలోకి జారింది. ► మైనింగ్: గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ 0.1 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019 సెప్టెంబర్‌లో వృద్ధిలేకపోగా –8.5 శాతం క్షీణత వచ్చింది. ► క్యాపిటల్ గూడ్స్: ఈ విభాగం ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా – 20.7 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఉత్పత్తి –9.9 శాతం క్షీణించింది. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా – 0.4 శాతం క్షీణత రావడం గమనార్హం. ► మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లో కూడా 6.4 శాతం క్షీణత నమోదయ్యింది. త్రైమాసికంగా –0.4 శాతం క్షీణత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో పారిశ్రామిక ఉత్పత్తి – 0.4 శాతం క్షీణించింది. మొదటి త్రైమాసికంలో 3 శాతం వృద్ధి రేటు రాగా, 2018–19 రెండవ త్రైమాసికంలో 5.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే, దాదాపు నిశ్చలంగా 1.3%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 5.2 శాతం. క్యూ2 జీడీపీపై ప్రతికూల ప్రభావం? ఏప్రిల్–జూన్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికంలోనైనా (జూలై–సెప్టెంబర్) కొంత మెరుగైన ఫలితం వస్తుందన్న ఆశలపై తాజా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు నీళ్లు జల్లుతున్నాయి. నవంబర్ 29న జూలై– సెప్టెంబర్ జీడీపీ డేటా వెలువడనుంది. -
మోదీ ‘రియల్’ బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడించారు. రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్సీఎల్టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికీ ఏఐఎఫ్ ద్వారా నిధులివ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సీతారామన్ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉ న్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్ ఫండ్స్ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. కొనుగోలుదారులకు ఉపశమనం ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్ పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది. – అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్ చైర్మన్ సమస్యకు పరిష్కారం ఇళ్ల కొనుగోలుదారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం తో పాటు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. తొలుత ప్రకటన(సెప్టెంబర్ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్పీఏ లేదా ఎన్సీఎల్టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ -
కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్సెప్ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, సుర్జేవాలా, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎల్డీ నేతలు హాజరయ్యారు. ఇది మా విజయమే: కాంగ్రెస్ ఆర్సీఈపీలో చేరబోవడం లేదని భారత్ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు. -
కూలుతున్న కొలువులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అక్టోబర్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ట స్ధాయిలో 8.5 శాతానికి ఎగబాకిందని తాజా సర్వే బాంబు పేల్చింది. అక్టోబర్‌లో నమోదైన నిరుద్యోగ రేటు ఆగస్ట్ 2016 నుంచి ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన నివేదిక పేర్కొంది. డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తున్నా ఉద్యోగాలు తగ్గిపోవడం దేశ ఆర్థిక వృద్ధిపై స్లోడౌన్ ప్రభావమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో దేశ మౌలిక ఉత్పాదన గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 5.2 శాతం మేర పతనమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిది కోర్ ఇండస్ర్టీస్‌లో ఏడింటిలో ఉత్పత్తి తగ్గడం మందగమన ప్రభావంపై గుబులు రేపుతోంది. మరోవైపు 2011-12 నుంచి 2017-18 మధ్య భారత ఉపాథి రంగంలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని సెంటర్ ఆప్ సస్టెయినబుల్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన పరిశోధనా పత్రం పేర్కొంది. పైన ఉదహరించిన కాలంలో దేశంలో మొత్తం ఉపాధి 90 లక్షల మేర పడిపోయిందని, దేశ చరిత్రలో ఈస్ధాయిలో ఉద్యోగాలు తగ్గుముఖ పట్టం ఇదే తొలిసారని పరిశోధనా పత్రాన్ని రూపొందించిన సంతోష్ మల్హోత్రా, జయతి కె పరిద ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, దినసరి కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని వివరించారు. -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
షాకింగ్ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనలో పడవేస్తుండగా తాజాగా ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్ సహా పలు రంగాల్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతం తగ్గిందని ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో విద్యుత్ ఉత్పత్తి 7.6 శాతం పెరగ్గా తాజాగా విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం పడిపోయింది. మైనింగ్ రంగం కేవలం 0.1 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇక ఐఐపీలో 77 శాతం వాటా ఉండే తయారీ రంగం ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.2 శాతం మేర కుదేలైంది. ఈ కీలక రంగం గత ఏడాది ఇదే నెలలో 5.2 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు గత ఏడాది ఆగస్ట్‌లో 5.3 శాతం నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో 2.4 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధి గణాంకాలను సోమవారం వెల్లడించనున్నట్టు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలను చూడనుందని తెలిపారు. 2019, 2020 వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ వచ్చే వారంలో విడుదల కానుందని పేర్కొన్న ఆమె, ఈ అవుట్‌లుక్‌లో వృద్ధి రేట్ల అంచనాలకు కోత పడే అవకాశం ఉందనీ సూచించారు. వచ్చేవారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్ చీఫ్ ఇక్కడ కీలక ముందస్తు ప్రసంగం ఒకటి చేశారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక గణాంకాలను చూస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ► మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం పైనే ఉంది. ఆయా దేశాల్లో 19 సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి. ► పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి. తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది. ► వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. ఇందుకు తగిన మదింపు జరగాలి. -
ఆర్థిక మందగమనంపై ఐఎంఎఫ్ హెచ్చరిక