
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంపై మంత్రుల ప్రకటనలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. స్లోడౌన్‌పై బీజేపీ ప్రభుత్వ తీరును ఆమె ఆక్షేపించారు. కేంద్రం తీరును క్రికెట్ పరిభాషలో ఎండగడుతూ ఆట ముగిసే వరకూ దానిపైనే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. మంచి క్యాచ్‌ను ఒడిసిపట్టాలంటే బంతిని తీక్షణంగా గమనించడం కీలకమని చెప్పుకొచ్చారు. అదే అసలైన గేమ్ వ్యూహమని ప్రియాంక పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య మంత్రి ఐన్‌స్టీన్, గురుత్వాకర్షణ శక్తిలపై చేసిన వ్యాఖ్యలను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓలా-ఊబర్ వ్యాఖ్యలనూ ఆమె ప్రస్తావించారు.
ఆటపై దృష్టిసారించని సందర్భంలో మీరు ఓలా-ఊబర్, గ్రావిటీ, లెక్కలు వంటి ఇతర విషయాలపై నిందలు మోపుతారని కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ఐన్‌స్టీన్ గ్రావిటీ (గురుత్వాకర్షణశక్తి)ని కనిపెట్టేందుకు గణితం పనికిరాలేదని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మందగమనానికి సంబంధించి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు యువత ఓలా,ఊబర్ వంటి క్యాబ్‌లను ఆశ్రయిస్తుండటంతోనే కార్లు, బైక్‌లు, ఇతర వాహన విక్రయాలు పడిపోయాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతవారం పేర్కొన్నారు. కాగా, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు సంధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment