‘నన్ను క్షమించండి.. ప్రియాంక గురించి అలా మాట్లాడాల్సింది కాదు’ | Ramesh Bidhuri Withdraws Controversial Remarks: Take My Words Back | Sakshi
Sakshi News home page

‘నన్ను క్షమించండి.. ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదు’

Published Sun, Jan 5 2025 7:50 PM | Last Updated on Sun, Jan 5 2025 7:55 PM

Ramesh Bidhuri Withdraws Controversial Remarks: Take My Words Back

ఢిల్లీ: ‘నన్ను క్షమించండి. ప్రియాంక గాంధీ (priyanka gandhi) గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను’అని ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి (Ramesh Bidhuri) క్షమాపణలు చెప్పారు.  

మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (delhi assembly elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓ వైపు ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎలాగైనా దిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని అటు కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

ఈ తరుణంలో కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్‌ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రమేష్‌ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్  అధికార ప్రతినిధి సుప్రియాశ్రీనేట్ మండిపడ్డారు.

మహిళల పట్ల బిదూరి మనస్తత్వాన్నిఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అవును. ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే. హేమామాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్  అన్నప్పుడు ఏం చేశారంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏం జరిగిందో..ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు.  

👉చదవండి: ప్రియాంకగాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
 

నోటిని అదుపులో పెట్టుకోకపోతే
నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో తన పార్టీ మాజీ ఎంపీలకు తెలిసొచ్చేలా చేసింది బీజేపీ అధినాయకత్వం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 400పై చిలుకు లోక్‌సభ స్థానాల్ని గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ‘టార్గెట్‌ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేసింది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, రమేష్‌‌ బిదురి, అనంత్‌కుమార్‌ హెగ్డే వంటి సిట్టింగ్‌ ఎంపీలకు సీట్లను నిరాకరించింది. వారిలో రమేష్‌ బిదురి ముందు వరసలో ఉన్నారు.  

రమేష్‌‌ బిదురి
ఈ సౌత్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్‌ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్‌ నిరాకరించింది.

అనంత్‌కుమార్‌ హెగ్డే
కర్ణాటకలో సీనియర్‌ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.

పర్వేష్‌ సాహిబ్‌సింగ్‌
ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్‌ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా టికెట్‌ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.

ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే వారు. కాంగ్రెస్‌ అగ్ర నేత దిగ్విజయ్‌‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించినా, ముంబై ఉగ్ర దాడుల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్‌ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. అందుకే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నా ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను పక్కన పెట్టేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement