సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) పై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర మంత్రులను అడ్డుకోవాలని యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ (congress party) కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. రమేష్ బిదూరి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో ఓ బీజేపీ (bjp) కార్యకర్త తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోపోద్రికులైన బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
దాడులపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ బిదూరి ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎందుకు నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని యూత్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరసన చేసేందుకు వచ్చిన తమపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని ఆరోపిస్తున్నారు.
కాగా, రమేష్ బిధూరి (Ramesh Bidhuri) ప్రియాంక గాంధీపై నోటి దురుసు వ్యాఖ్యలు చేశారు. తనని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తానో ఉదహరిస్తూ ఆమె పేరు ప్రస్తావించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంకా గాంధీ బుగ్గల వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. రమేష్ బిదురితో పాటు బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో తాను ప్రియాంక గాంధీ గురించి అలా మాట్లాడాల్సింది కాదంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఆ వివాదం కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment