సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనానికి మోదీ సర్కార్ విధానాలే కారణమని విరుచుకుపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా స్లోడౌన్ నుంచి బయటపడేందుకు సలహాలతో ముందుకొచ్చారు. ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించి, జీడీపీ వృద్ధి పతనానికి దారితీస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన మోదీ సర్కార్‌కు హితవుపలికారు. ఆర్థిక మందగమనం పర్యవసానాలను ప్రభుత్వం పూర్తిగా గ్రహించలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు జీఎస్‌టీ పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంతో పాటు డిమాండ్‌ను పెంచే చర్యలు చేపట్టాలని చెప్పారు.
వ్యవసాయ రంగ పునరుద్ధరణకు తోడ్పడేలా సేద్యానికి పరపతి సాయం పెంచాలని సూచించారు. ఉపాధి రంగాలైన ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మార్కెట్‌లో తిరిగి డిమాండ్ పుంజుకునేలా చొరవ చూపాలని కోరారు. ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణమైన నగదు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రుణ లభ్యత, నగదు అందుబాటులో లేకపోవడంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలైన తీరును ఆయన వివరించారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఎగుమతుల పెంపునకు అందివచ్చే నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అవకాశాలను అన్వేషించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment