బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు టీమిండియా ప్లేయర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్‌లతో బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohansingh) మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించారు. 92 ఏళ్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం (డిసెంబర్ 26) రాత్రి 9:51 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004-14 మధ్యలో వరుసగా పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం చైర్మన్‌గా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి యావత్ భారతావణి నివాళులు అర్పిస్తుంది.
కాగా, మెల్‌బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. రెండో రోజు తొలి సెషన్‌లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ మాత్రమే కోల్పోయింది. స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్‌లో ఉన్నాడు.
309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్‌స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్ దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీ
ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీతో మెరిశాడు. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు భారత్‌పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్‌ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్‌పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. స్టీవ్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ (10) భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేశాడు.
టెస్ట్‌ల్లో 34వ సెంచరీ
స్టీవ్‌కు ఇది కెరీర్‌లో 34వ టెస్ట్ సెంచరీ. మెల్‌బోర్న్‌లో ఐదవది. టెస్ట్‌ల్లో స్టీవ్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లోనూ స్టీవ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.
విరాట్ రికార్డును అధిగమించిన స్టీవ్
టెస్ట్‌ల్లో స్టీవ్ విరాట్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. విరాట్ 9 (47 ఇన్నింగ్స్‌లు), సచిన్ 9 (65 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ 8 (51 ఇన్నింగ్స్‌లు), మైఖేల్ క్లార్క్ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్‌లు) కలిగి ఉన్నారు.
గవాస్కర్, లారా సరసన స్టీవ్
టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్.. దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్‌తో పాటు వీరంతా 34 టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.
Comments
Please login to add a commentAdd a comment