IND Vs AUS: జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది.. రోహిత్‌ శర్మపై ఫ్యాన్స్‌ ఫైర్‌ | IND Vs AUS 4th Test: Rohit Sharma Poor Form Continues In Border Gavaskar Trophy, Check Viral Video And Other Details | Sakshi

IND Vs AUS 4th Test: జట్టుకు భారంగా మారావు.. మర్యాదగా తప్పుకుంటే మంచిది.. రోహిత్‌ శర్మపై ఫ్యాన్స్‌ ఫైర్‌

Dec 27 2024 9:45 AM | Updated on Dec 27 2024 4:52 PM

IND VS AUS 4th Test: Rohit Sharma Poor Form Continues In Border Gavaskar Trophy

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్లేస్‌ మారినా రోహిత్‌ ఫేట్‌ మాత్రం మారలేదు. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ ఓపెనర్‌గా వచ్చి మూడు పరుగులకే ఔటయ్యాడు. 

కమిన్స్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. ఆఫ్‌ సైడ్‌ దిశగా వెళ్తున్న అతి సాధారణ బంతిని పుల్‌ షాట్‌ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. హిట్‌మ్యాన్‌ ఔటైన విధానంపై భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. రోహిత్‌.. ఇక మారవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ రెండు, మూడు టెస్ట్‌ల్లో రోహిత్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 3, 6 పరుగులకు ఔటైన రోహిత్‌.. డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్‌) 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

తాజాగా నాలుగో టెస్ట్‌ ఓపెనర్‌గా వచ్చినా రోహిత్‌ అదే చెత్త ఫామ్‌ను కొనసాగించాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రోహిత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జట్టుకు భారంగా మారావు. హుందాగా తప్పుకుంటే మంచిదంటూ సొంత అభిమానులే దుయ్యబడుతున్నారు. హిట్‌మ్యాన్‌ వరుస వైఫల్యాలు చూస్తుంటే ఈ సిరీసే అతనికి చివరిదని అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో (నాలుగో టెస్ట్‌) ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఖ్వాజా (57), లబూషేన్‌ (72), పాట్‌ కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. ట్రవిస్‌ హెడ్‌ (0), మిచెల్‌ మార్ష్‌ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 8 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. హిట్‌మ్యాన్‌ కేవలం 3 పరుగులు చేసి కమిన్స్‌ బౌలింగ్‌ బోలాండ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్ల అనంతరం భారత్‌ స్కోర్‌ 50/1గా ఉంది. యశస్వి జైస్వాల్‌ (22), కేఎల్‌ రాహుల్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 424 పరుగులు వెనుకపడి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement