నేడు వెస్టిండీస్‌తో భారత్ ఆఖరి వన్డే
అసాధారణ ఫామ్‌లో హర్మన్ బృందం
పరువు కోసం కరీబియన్ పోరాటం
ఉదయం గం. 9:30 నుంచి ‘స్పోర్ట్స్18’, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
వడోదర: అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆఖరి పోరుకు సిద్ధమైంది. అచ్చొచ్చిన వడోదర పిచ్‌పై నేడు జరిగే మూడో వన్డేలో వెస్టిండీస్‌ను ‘ఢీ’కొట్టేందుకు సిద్ధమైంది. హర్మన్‌ప్రీత్ బృందం ఉన్న ప్రస్తుత ఫామ్ దృష్ట్యా 3–0తో సిరీస్‌ను ముగించడం ఏమంత కష్టం కానేకాదు. 217/4, 314/9, 358/5... ఆఖరి టి20 సహా, గత రెండు వన్డేల స్కోర్లివి.
దుర్బేధ్యమైన టాపార్డర్ బ్యాటింగ్ లైనప్, నిప్పులు చెరుగుతున్న బౌలింగ్ కరీబియన్‌కు కష్టాలనే మిగిలిస్తున్నాయి. మరోవైపు రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లను సమర్పించుకున్న వెస్టిండీస్ ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. పర్యటనలో ఆఖరి పోరులో గెలిచి స్వదేశానికి విజయంతో పయనం కావాలని భావిస్తోంది. కానీ ఇదంతా సులభం కాదు.
స్మృతిని ఆపేదెవరు?
భారత ఓపెనర్ స్మృతి మంధాన జోరే జట్టుకు కొండంత బలంగా మారింది. గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 54, 62, 77, 91, 53... అర్ధసెంచరీలను అవలీలగా బాదేసింది. అసాధారణ ఫామ్‌లో ఉన్న స్మృతికి ఇప్పుడు టాపార్డర్‌లో ప్రతీక రావల్, హర్లీన్ డియోల్ జతవ్వడంతో విండీస్ బౌలింగ్ అదేపనిగా కుదేలవుతోంది. వీళ్లకు అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలియక కరీబియన్ జట్టు సతమతమవుతోంది. అలాగని జెమీమా రోడ్రిగ్స్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌లు ఉన్న మిడిలార్డర్ తక్కువేం కాదు.
‘టాప్’ శుభారంభాల్ని భారీస్కోర్లుగా మలిచేయడంలో మిడిలార్డర్ పాత్ర చాలావుంది. ఇక బౌలింగ్ దళం కరీబియన్ల పాలిట సింహస్వప్నమవుతోంది. పేస్‌లో రేణుక, దీప్తిశర్మ, స్పిన్‌లో ప్రియా మిశ్రా నిలకడగా విండీస్ బ్యాటర్లకు ముందరికాళ్లకు ముందే బంధమేస్తున్నారు. ఇలాంటి ఆతిథ్య జట్టుకు చివరి వన్డేలో గెలుపు సాధ్యమే!
కష్టాల్లో కరీబియన్ టీమ్
భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ మహిళల జట్టుకు వరుసగా తీవ్ర నిరాశ ఎదురవుతూనే ఉంది. టి20 సిరీస్‌లో ఒక మ్యాచ్ అయినా నెగ్గింది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఆ ఫలితం కోసం పెద్ద పోరాటం చేసినా కూడా... ప్రస్తుత పరిస్థితుల్లో ఓదార్పు కష్టంగానే కనబడుతోంది. తొలివన్డేలో అయితే ఘోరంగా కుప్పకూలిన విండీస్ సేన గత మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లను కాస్త ఢీకొట్టగలిగింది.
కెప్టెన్ హేలీ మాథ్యూస్, షెమైన్ క్యాంప్‌బెల్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్ నిలకడను ప్రదర్శించారు. అయితే ప్రత్యర్థి 300 పైచిలుకు చేసే స్కోర్లను కట్టడి చేసే బౌలర్లయితే లేరు. రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే కాస్తో... కూస్తో... ప్రభావం చూపిన బౌలర్ దాదాపు లేదనే చెప్పొచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న హేలీ మాథ్యూస్ సేన 0–3ని తప్పించుకొని 1–2తో ముగించడం పెద్ద సవాలే!
తుది జట్లు (అంచనా)
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, టిటాస్ సాధు, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్.
వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), క్వియాన, నెరిస్సా క్రాఫ్టన్, రషద విలియమ్స్, డియాండ్రా, షెమైన్, ఆలియా, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కరిష్మా, షమీలియా కానెల్.
Comments
Please login to add a commentAdd a comment