final ODI
-
భారత మహిళలకు చేజారిన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 33 నాటౌట్) మరో ఎండ్‌లో ఉండగా...చివరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్ 1–1తో ‘డ్రా’ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా నిలిచింది. చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. -
India vs West Indies: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సిరీస్‌నే గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. నేడు జరిగే ఆఖరి వన్డేలోనూ నెగ్గి ఆతిథ్య కరీబియన్‌ను వైట్‌వాష్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి కనీసం పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే మూడో వన్డే ఆసక్తికరంగా జరగనుంది. ఈ వేదికపై గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు భారీస్కోర్లు నమోదు చేశాయి. చివరి పోరు కూడా ఇక్కడే జరగనుండటంతో మరోసారి ప్రేక్షకులకు పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది. జోరుమీదున్న భారత్ ఇక్కడ వరుస విజయాలతోనే కాదు... ఇటీవల వరుస సిరీస్ విజయాలతో భారత్ జోరు మీదుంది. ఆటగాళ్లు మారినా... సీనియర్లు లేకపోయినా... ఫలితంలో మాత్రం ఏ తేడా లేదు. అదే ఉత్సాహం. అదే పట్టుదల. నిర్లక్ష్యం దరిచేరనీయకుండా కుర్రాళ్లు రాణిస్తున్నారు. టీమిండియా గత రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు చేసింది. కెప్టెన్ ధావన్ సహా టాపార్డర్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సూపర్‌ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్ అర్ధసెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సంజూ సామ్సన్ కూడా గత మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఆరో వరుసలో బ్యాటింగ్‌కు దిగుతున్న దీపక్ హుడా సత్తా చాటుతున్నాడు. అక్షర్ పటేల్ ‘షో’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఏ రకంగా చూసిన భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బెంగ ఏమైనా ఉంటే అది సూర్యకుమార్‌పైనే! తను కూడా చివరి పోరులో బ్యాట్ ఝుళిపిస్తే మరో భారీస్కోరుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లోనే కాస్త మెరుగుపడాలి. వెస్టిండీస్‌కు మరో 300 ప్లస్ అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయాలి. ఓదార్పు విజయంపై... మరోవైపు వెస్టిండీస్ పరిస్థితి భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది. ప్రత్యర్థి జట్టుకు దీటుగా 300 పైచిలుకు పరుగులైతే చేస్తోంది. కానీ అంత చేసినా... తొలి వన్డేలో ఛేదనలో ఆఖరుకొచ్చేసరికి వెనుకబడింది. రెండో మ్యాచ్‌లో చేసింది కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు షై హోప్, కైల్ మేయర్స్, బ్రూక్స్, కింగ్ చెప్పుకోదగ్గ స్కోర్లే చేస్తున్నారు. కానీ బౌలింగ్ వైఫల్యాలతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈసారి బౌలింగ్ లోపాలపై దృష్టి పెట్టిన కరీబియన్ జట్టు ఆఖరి పోరులో గెలిచి తీరాలనే కసితో ఉంది. సమష్టి విజయంతో భారత్ క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. పిచ్, వాతావరణం రెండు వన్డేల్లో పరుగుల వరద పారింది. కానీ... రెండే రోజుల వ్యవధిలో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం మరో పిచ్‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడ సీమర్లకు అనుకూలం. ఈ రోజు చినుకులు కురిసే అవకాశం కూడా ఉంది. జట్లు (అంచనా) భారత్: ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దుల్, సిరాజ్, చహల్, అవేశ్ ఖాన్/ప్రసిధ్ కృష్ణ. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షై హోప్, కైల్ మేయర్స్, బ్రూక్స్/కార్టీ, బ్రాండన్ కింగ్, పావెల్, హోసీన్, షెఫర్డ్/కీమో పాల్, జోసెఫ్, సీల్స్, హేడెన్ వాల్‡్ష. -
వైట్‌వాష్ తప్పేనా!
వార్సెస్టర్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు జరిగే ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. రెండు వన్డేల్లోనూ సారథి మిథాలీ మినహా ఎవరూ రాణించలేకపోయారు. సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు బాధ్యత పంచుకోవాల్సిన తరుణమిది. రెండో వన్డేలో షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించింది. వీరితో పాటు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు కూడ రాణిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు జోరు మీదున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పర్యాటక జట్టుపై ఆధిపత్యాన్ని చాటాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డే సందర్భంగా మెడనొప్పితో ఇబ్బంది పడిన భారత కెప్టెన్ మిథాలీ గాయం నుంచి కోలుకుందని జట్టు వర్గాలు తెలిపాయి. శుక్రవారం సహచరులతో కలిసి ఆమె నెట్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది. -
క్లీన్ స్వీప్.. తప్పించుకుంటారా!
సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్‌గా మారింది. టి20ల్లో జయభేరి అనంతరం వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన వన్డేల్లో అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలి చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత్... సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ చివరిదైన మూడో వన్డేలో సన్నద్ధమయ్యాయి. మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ గడ్డపై భారత పరిమిత ఓవర్ల పోరు చివరి దశకు వచ్చింది. నేడు ఇక్కడి బే ఓవల్‌లో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కివీస్ నెగ్గడంతో సిరీస్ ఫలితంపై ఈ మ్యాచ్ ప్రభావం లేదు. అయితే వన్డేల్లోనూ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కీలకం కానుంది. కెప్టెన్ విలియమ్సన్ పునరాగమనం కివీస్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. పంత్‌కు చాన్స్! టి20ల్లో అద్భుత ప్రదర్శన తర్వాత వన్డేల్లో భారత్‌కు ఎదురైన పరాజయాలు అనూహ్యం. వన్డేలకు ఈ ఏడాది పెద్దగా ప్రాధాన్యత లేదని కోహ్లి చెప్పుకున్నా సరే...ఓటమి అంగీకరించాల్సిందే. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టినదగ్గరినుంచి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాని రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి ఎంచుకోవచ్చు. అప్పుడు రాహుల్‌ను పక్కన పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఆరో స్థానం కోసం కూడా జాదవ్ పోటీ ఎదుర్కొంటున్నాడు. ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న జాదవ్‌కు బదులుగా పాండేకు అవకాశం ఇవ్వాలని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే గత మ్యాచ్ మినహా తనకు వచ్చిన పరిమిత అవకాశాల్లోనూ రాణించిన జాదవ్‌కు ఇది ఆఖరి అవకాశం కావచ్చు. దూబే ఒక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న షమీ మళ్లీ జట్టులోకి రానున్నాడు. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ అనుకుంటోంది. అయితే తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా భారత్ లక్ష్యం మాత్రం ఎలాగైనా మ్యాచ్ గెలిచి క్లీన్స్వీప్నుంచి తప్పించుకోవడమే. కెప్టెన్ వచ్చాడు... గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన కేన్ విలియమ్సన్ కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. బే ఓవల్ అతని సొంత మైదానం కావడం విశేషం. టి20ల్లో సిరీస్ చేజార్చుకున్నా కేన్ మాత్రం అద్భుతంగా ఆడాడు. అతనితో పాటు ఫామ్‌లో ఉన్న రాస్ టేలర్ జత కలిస్తే ఆతిథ్య జట్టు బలం పెరగడం ఖాయం. ఓపెనర్లు గప్టిల్, నికోల్స్ కూడా రాణిస్తుండగా మిడిలార్డర్లో లాథమ్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ చెలరేగితే చాలు బ్యాటింగ్ పరంగా కివీస్‌కు ఎలాంటి సమస్యలు లేనట్లే. బౌలింగ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు లేని లోటు వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన జేమీసన్ తన సత్తా ఏమిటో చూపించాడు. అతనికి ఇతర బౌలర్లు సహకరిస్తే భారత్‌కు కట్టడి చేయడం కష్టం కాకపోవచ్చు. 1989 – మూడు లేదా అంతకన్నా ఎక్కువ వన్డేలు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆఖరి సారిగా క్లీన్‌స్వీప్‌కు గురైన ఏడాది. నాడు విండీస్ 5–0తో భారత్‌ను చిత్తు చేసింది. పిచ్, వాతావరణం: నెమ్మదైన వికెట్. బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, అయ్యర్, రాహుల్/ పంత్, జాదవ్/ పాండే, జడేజా, చహల్, సైనీ, షమీ న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, నికోల్స్, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సౌతీ, జేమీసన్, సోధి, బెన్నెట్ -
క్లీన్ స్వీప్ లక్ష్యంగా...
► మరో విజయంపై భారత్ దృష్టి ► పరువు కోసం ఇంగ్లండ్ ఆరాటం ► నేడు ఇరు జట్ల మధ్య చివరి వన్డే మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేశారు. రెండో వన్డేలో భీకర బ్యాటింగ్‌తో 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇదీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అద్వితీయ ప్రదర్శన. ఇక తమ శక్తికి మించిన ప్రదర్శనతో రాణిస్తున్నా కోహ్లి సేన ఓ అడుగు ముందే ఉంటుండడంతో మోర్గాన్ బృందం చిత్తవుతూ వస్తోంది. దీంతో చివరి వన్డేలోనైనా భారత బ్యాట్స్‌మెన్ ను కట్టడి చేసి ఊరట విజయాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు టెస్టు సిరీస్‌లాగే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసి చాంపియన్స్ ట్రోఫీ ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కోల్‌కతా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ లో భారత జట్టు నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడనుంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లి సేన నామమాత్రమైన ఈ మ్యాచ్‌నూ దక్కించుకుని సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటోంది. అయితే ఇంగ్లండ్ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. భారత పర్యటన ఆరంభించినప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టుకు కష్టాలు తప్పడంలేదు. ఐదు టెస్టుల సిరీస్‌ను 0–4తో కోల్పోయిన ఇంగ్లండ్... ఇప్పుడు వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ ముంగిట నిలిచింది. నిజానికి ఓడిన రెండు వన్డేల్లోనూ ఈ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఏమీ లేదు. తొలి వన్డేలో 350, రెండో వన్డేలో 366 పరుగుల భారీ స్కోరును సాధించింది. రెండో వన్డేలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆడిన తీరు భారత్‌ను వణికించింది. చివర్లో రనౌట్ కావడంతో ఊపిరి పీల్చుకోగలిగింది. తమ జట్టు ఇంకా స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదని మోర్గాన్ భావిస్తున్నాడు. ఇక భారత్ అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థికన్నా పైచేయిలో ఉంది. దాదాపు ఐదు నెలల అనంతరం ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ముందు తామాడే చివరి వన్డే ఇదే కావడంతో భారత్ చక్కటి విజయంతో ముగించాలని కోరుకుంటోంది. గతంలో ఇంగ్లండ్ జట్టు ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ధావన్ అనుమానమే! పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రాణించకున్నా మూడు నుంచి ఆరో నంబర్ బ్యాట్స్‌మెన్ వరకు ఇప్పటికే సెంచరీలు సాధించగలిగారు. తొలి వన్డేలో నిరాశపరిచిన సీనియర్లు ధోని, యువరాజ్ రెండో వన్డేలో ఆడిన తీరు అపూర్వం. అలాగే తొలి వన్డేలో కేదార్ జాదవ్ అనూహ్య ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కోహ్లి ఫామ్ సరేసరి. అశ్విన్ , జడేజా, పాండ్యా తమ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నారు. డెత్ ఓవర్లలో భువీ కీలకమవుతున్నాడు. అయితే బొటన వేలి గాయంతో బాధపడుతున్న ధావన్ మూడో వన్డేలో బరిలోకి దిగడం అనుమానంగానే ఉంది. ధావన్ ఫిట్‌గా లేకపోతే రహానే, మనీష్ పాండేలలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఒత్తిడిలో ఇంగ్లండ్ రెండు వన్డేల్లో ఎదురైన ఓటములతో ఇంగ్లండ్ జట్టు పూర్తిగా డీలా పడింది. రెండో వన్డేలో మోర్గాన్ 81 బంతుల్లో 102 పరుగులతో మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చినా ఓటమి పాలవడం వారిని కుంగదీసింది. రూట్, రాయ్, మొయిన్ అలీ ఫామ్‌లో ఉన్నా బౌలర్లు ధారాళంగా పరుగులివ్వడం జట్టును ఆందోళనపరుస్తోంది. గాయపడిన ఓపెనర్ హేల్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ ఆడనున్నాడు. ఆప్షనల్ ప్రాక్టీస్‌కు కోహ్లి దూరం వన్డే సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు శనివారం ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ జరిగింది. దీనికి కెప్టెన్ విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ సెషన్ లో పాల్గొన్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపు పిచ్‌ను నిశితంగా పరిశీలించాడు. ధోనితో పాటు ధావన్ , బుమ్రా, జాదవ్, రహానే, మిశ్రా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే ఈడెన్ లో చెమటోడ్చారు. పిచ్, వాతావరణం ఈ మైదానంలో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులతో రికార్డు సృష్టించాడు. అయితే ఈసారి బౌలర్లు ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. రంజీ సీజన్ లో చాలా జట్లు 100లోపే ఆలౌట్ అయ్యాయి. కటక్‌తో పోలిస్తే ఇక్కడి పిచ్ పూర్తి పచ్చదనంతో కనిపిస్తోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్ ), రాహుల్, ధావన్ /రహానే/మనీష్ పాండే, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్య, జడేజా, అశ్విన్ , భువనేశ్వర్, బుమ్రా. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్ ), రాయ్, బిల్లింగ్స్, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, వోక్స్, ప్లంకెట్, విల్లే, బాల్.