వార్సెస్టర్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు జరిగే ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. రెండు వన్డేల్లోనూ సారథి మిథాలీ మినహా ఎవరూ రాణించలేకపోయారు. సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు బాధ్యత పంచుకోవాల్సిన తరుణమిది. రెండో వన్డేలో షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించింది. వీరితో పాటు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు కూడ రాణిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు జోరు మీదున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పర్యాటక జట్టుపై ఆధిపత్యాన్ని చాటాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డే సందర్భంగా మెడనొప్పితో ఇబ్బంది పడిన భారత కెప్టెన్ మిథాలీ గాయం నుంచి కోలుకుందని జట్టు వర్గాలు తెలిపాయి. శుక్రవారం సహచరులతో కలిసి ఆమె నెట్ ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment