సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ సారి సీన్ రివర్స్‌గా మారింది. టి20ల్లో జయభేరి అనంతరం వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. అయితే ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేన వన్డేల్లో అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలి చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత్... సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ చివరిదైన మూడో వన్డేలో సన్నద్ధమయ్యాయి.
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ గడ్డపై భారత పరిమిత ఓవర్ల పోరు చివరి దశకు వచ్చింది. నేడు ఇక్కడి బే ఓవల్‌లో జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కివీస్ నెగ్గడంతో సిరీస్ ఫలితంపై ఈ మ్యాచ్ ప్రభావం లేదు. అయితే వన్డేల్లోనూ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కీలకం కానుంది. కెప్టెన్ విలియమ్సన్ పునరాగమనం కివీస్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
పంత్‌కు చాన్స్!
టి20ల్లో అద్భుత ప్రదర్శన తర్వాత వన్డేల్లో భారత్‌కు ఎదురైన పరాజయాలు అనూహ్యం. వన్డేలకు ఈ ఏడాది పెద్దగా ప్రాధాన్యత లేదని కోహ్లి చెప్పుకున్నా సరే...ఓటమి అంగీకరించాల్సిందే. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టినదగ్గరినుంచి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాని రిషభ్ పంత్‌ను తుది జట్టులోకి ఎంచుకోవచ్చు. అప్పుడు రాహుల్‌ను పక్కన పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఆరో స్థానం కోసం కూడా జాదవ్ పోటీ ఎదుర్కొంటున్నాడు.
ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న జాదవ్‌కు బదులుగా పాండేకు అవకాశం ఇవ్వాలని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే గత మ్యాచ్ మినహా తనకు వచ్చిన పరిమిత అవకాశాల్లోనూ రాణించిన జాదవ్‌కు ఇది ఆఖరి అవకాశం కావచ్చు. దూబే ఒక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న షమీ మళ్లీ జట్టులోకి రానున్నాడు. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్ అనుకుంటోంది. అయితే తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా భారత్ లక్ష్యం మాత్రం ఎలాగైనా మ్యాచ్ గెలిచి క్లీన్‌స్వీప్‌నుంచి తప్పించుకోవడమే.
కెప్టెన్ వచ్చాడు...
గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన కేన్ విలియమ్సన్ కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. బే ఓవల్ అతని సొంత మైదానం కావడం విశేషం. టి20ల్లో సిరీస్ చేజార్చుకున్నా కేన్ మాత్రం అద్భుతంగా ఆడాడు. అతనితో పాటు ఫామ్‌లో ఉన్న రాస్ టేలర్ జత కలిస్తే ఆతిథ్య జట్టు బలం పెరగడం ఖాయం. ఓపెనర్లు గప్టిల్, నికోల్స్ కూడా రాణిస్తుండగా మిడిలార్డర్‌లో లాథమ్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ చెలరేగితే చాలు బ్యాటింగ్ పరంగా కివీస్‌కు ఎలాంటి సమస్యలు లేనట్లే. బౌలింగ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లు లేని లోటు వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన జేమీసన్ తన సత్తా ఏమిటో చూపించాడు. అతనికి ఇతర బౌలర్లు సహకరిస్తే భారత్‌కు కట్టడి చేయడం కష్టం కాకపోవచ్చు.
1989 – మూడు లేదా అంతకన్నా ఎక్కువ వన్డేలు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆఖరి సారిగా క్లీన్‌స్వీప్‌కు గురైన ఏడాది. నాడు విండీస్ 5–0తో భారత్‌ను చిత్తు చేసింది.
పిచ్, వాతావరణం: నెమ్మదైన వికెట్. బౌలర్లకు కూడా కాస్త అనుకూలిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, అయ్యర్, రాహుల్/ పంత్, జాదవ్/ పాండే, జడేజా, చహల్, సైనీ, షమీ
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, నికోల్స్, టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సౌతీ, జేమీసన్, సోధి, బెన్నెట్
Comments
Please login to add a commentAdd a comment