క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా... | India Look To Increase England Woes, Eye Series Whitewash | Sakshi
Sakshi News home page

క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా...

Published Sun, Jan 22 2017 12:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా...

క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా...

► మరో విజయంపై భారత్‌ దృష్టి
► పరువు కోసం ఇంగ్లండ్‌ ఆరాటం
► నేడు ఇరు జట్ల మధ్య చివరి వన్డే


మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేశారు. రెండో వన్డేలో భీకర బ్యాటింగ్‌తో 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇదీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అద్వితీయ ప్రదర్శన. ఇక తమ శక్తికి మించిన ప్రదర్శనతో రాణిస్తున్నా కోహ్లి సేన ఓ అడుగు ముందే ఉంటుండడంతో మోర్గాన్  బృందం చిత్తవుతూ వస్తోంది. దీంతో చివరి వన్డేలోనైనా భారత బ్యాట్స్‌మెన్ ను కట్టడి చేసి ఊరట విజయాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు టెస్టు సిరీస్‌లాగే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్‌ చేసి చాంపియన్స్  ట్రోఫీ ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

కోల్‌కతా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ప్రతిష్టాత్మక ఈడెన్  గార్డెన్స్ లో భారత జట్టు నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడనుంది. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లి సేన నామమాత్రమైన ఈ మ్యాచ్‌నూ దక్కించుకుని సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్‌ చేయాలనుకుంటోంది. అయితే ఇంగ్లండ్‌ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. భారత పర్యటన ఆరంభించినప్పటి నుంచి ఇంగ్లండ్‌ జట్టుకు కష్టాలు తప్పడంలేదు. ఐదు టెస్టుల సిరీస్‌ను 0–4తో కోల్పోయిన ఇంగ్లండ్‌... ఇప్పుడు వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌ ముంగిట నిలిచింది.

నిజానికి ఓడిన రెండు వన్డేల్లోనూ ఈ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఏమీ లేదు. తొలి వన్డేలో 350, రెండో వన్డేలో 366 పరుగుల భారీ స్కోరును సాధించింది. రెండో వన్డేలో కెప్టెన్  ఇయాన్  మోర్గాన్  ఆడిన తీరు భారత్‌ను వణికించింది. చివర్లో రనౌట్‌ కావడంతో ఊపిరి పీల్చుకోగలిగింది. తమ జట్టు ఇంకా స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదని మోర్గాన్  భావిస్తున్నాడు. ఇక భారత్‌ అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థికన్నా పైచేయిలో ఉంది. దాదాపు ఐదు నెలల అనంతరం ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్   ట్రోఫీకి ముందు తామాడే చివరి వన్డే ఇదే కావడంతో భారత్‌ చక్కటి విజయంతో ముగించాలని కోరుకుంటోంది. గతంలో ఇంగ్లండ్‌ జట్టు ఈడెన్  గార్డెన్స్ లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

ధావన్   అనుమానమే!
పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో భారత జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రాణించకున్నా మూడు నుంచి ఆరో నంబర్‌ బ్యాట్స్‌మెన్  వరకు ఇప్పటికే సెంచరీలు సాధించగలిగారు. తొలి వన్డేలో నిరాశపరిచిన సీనియర్లు ధోని, యువరాజ్‌ రెండో వన్డేలో ఆడిన తీరు అపూర్వం. అలాగే తొలి వన్డేలో కేదార్‌ జాదవ్‌ అనూహ్య ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కోహ్లి ఫామ్‌ సరేసరి. అశ్విన్ , జడేజా, పాండ్యా తమ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్నారు. డెత్‌ ఓవర్లలో భువీ కీలకమవుతున్నాడు. అయితే బొటన వేలి గాయంతో బాధపడుతున్న ధావన్  మూడో వన్డేలో బరిలోకి దిగడం అనుమానంగానే ఉంది. ధావన్  ఫిట్‌గా లేకపోతే రహానే, మనీష్‌ పాండేలలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు.

ఒత్తిడిలో ఇంగ్లండ్‌
రెండు వన్డేల్లో ఎదురైన ఓటములతో ఇంగ్లండ్‌ జట్టు పూర్తిగా డీలా పడింది. రెండో వన్డేలో మోర్గాన్  81 బంతుల్లో 102 పరుగులతో మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చినా ఓటమి పాలవడం వారిని కుంగదీసింది. రూట్, రాయ్, మొయిన్  అలీ ఫామ్‌లో ఉన్నా బౌలర్లు ధారాళంగా పరుగులివ్వడం జట్టును ఆందోళనపరుస్తోంది. గాయపడిన ఓపెనర్‌ హేల్స్‌ స్థానంలో సామ్‌ బిల్లింగ్స్‌ ఆడనున్నాడు.

ఆప్షనల్‌ ప్రాక్టీస్‌కు కోహ్లి దూరం
వన్డే సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు శనివారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్  జరిగింది. దీనికి కెప్టెన్  విరాట్‌ కోహ్లి దూరంగా ఉన్నాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ సెషన్ లో పాల్గొన్న మాజీ కెప్టెన్  ఎంఎస్‌ ధోని మాత్రం సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపు పిచ్‌ను నిశితంగా పరిశీలించాడు. ధోనితో పాటు ధావన్ , బుమ్రా, జాదవ్, రహానే, మిశ్రా, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, మనీష్‌ పాండే ఈడెన్ లో చెమటోడ్చారు.

పిచ్, వాతావరణం
ఈ మైదానంలో జరిగిన చివరి వన్డేలో రోహిత్‌ శర్మ 264 పరుగులతో రికార్డు సృష్టించాడు. అయితే ఈసారి బౌలర్లు ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. రంజీ సీజన్ లో చాలా జట్లు 100లోపే ఆలౌట్‌ అయ్యాయి. కటక్‌తో పోలిస్తే ఇక్కడి పిచ్‌ పూర్తి పచ్చదనంతో కనిపిస్తోంది.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్  ), రాహుల్, ధావన్ /రహానే/మనీష్‌ పాండే, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్య, జడేజా, అశ్విన్ , భువనేశ్వర్, బుమ్రా.
ఇంగ్లండ్‌: మోర్గాన్  (కెప్టెన్ ), రాయ్, బిల్లింగ్స్, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, వోక్స్, ప్లంకెట్, విల్లే, బాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement