IND Vs ENG: శుబ్‌మన్, శ్రేయస్‌ సత్తా చాటగా... | India Defeated England By 4 Wickets In The First ODI, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs ENG 1st ODI: శుబ్‌మన్, శ్రేయస్‌ సత్తా చాటగా...

Published Fri, Feb 7 2025 4:18 AM | Last Updated on Fri, Feb 7 2025 9:29 AM

India defeated England by 4 wickets in the first ODI

తొలి వన్డేలో భారత్‌  ఘనవిజయం

4 వికెట్లతో ఇంగ్లండ్‌ పరాజయం 

ఆదివారం కటక్‌లో రెండో వన్డే

స్వదేశంలో జరుగుతున్న పోరులో ఇంగ్లండ్‌పై భారత్‌  సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డేల్లో గెలుపుతో బోణీ చేసింది. బౌలింగ్‌లో జడేజా, రాణా రాణించడంతో ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన జట్టు...ఆపై గిల్, శ్రేయస్, అక్షర్‌ బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ మరోసారి పరాజయానికే పరిమితమైంది.  

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్‌ బట్లర్‌ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్‌ బెతెల్‌ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్‌ సాల్ట్‌ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (96 బంతుల్లో 87; 14 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 59; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (47 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. రెండో వన్డే ఆదివారం కటక్‌లో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యాలు... 
ఓపెనర్లు సాల్ట్, బెన్‌ డకెట్‌ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఓపెనర్లను నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమవుతున్న స్థితిలో ఇంగ్లండ్‌ స్వయంకృతం ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. లేని మూడో పరుగు కోసం ప్రయత్నించిన సాల్ట్‌ను చక్కటి ఫీల్డింగ్‌తో శ్రేయస్‌ రనౌట్‌ చేయడంతో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. 

ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఆడిన జో రూట్‌ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బట్లర్, బెతెల్‌ కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన వెంటనే బట్లర్‌ నిష్క్రమించాడు. 

బెతెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అతను 14.3 ఓవర్లలో 59 పరుగులు జత చేశాడు. 62 బంతుల్లో బెతెల్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకోగా...తర్వాతి బ్యాటర్లెవరూ నిలవలేకపోవడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ ఆట ముగిసింది.  

రాణించిన అక్షర్‌... 
ఛేదనలో ఆరంభంలో భారత్‌ తడబడింది. 19 పరుగుల వద్దే యశస్వి జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (2) వెనుదిరిగారు. అయితే గిల్, శ్రేయస్‌ భాగస్వామ్యంలో జట్టు దూసుకుపోయింది. ముఖ్యంగా శ్రేయస్‌ మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఆర్చర్‌ ఓవర్లో వరుసగా 2 సిక్స్‌లు బాదిన అతను, కార్స్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఈ జోరులో 30 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. 

గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగులు (10.4 ఓవర్లలో) జోడించిన తర్వాత శ్రేయస్‌ వెనుదిరిగాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ అయిన అక్షర్‌ పటేల్‌ కూడా గిల్‌కు తగిన విధంగా సహకరించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో గిల్‌ 60 బంతుల్లో, అక్షర్‌ 46 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీలను అందుకున్నారు. 

నాలుగో వికెట్‌కు 17.5 ఓవర్లలో 108 పరుగులు జత చేసిన అనంతరం అక్షర్‌ అవుటయ్యాడు. ఈ దశలో భారత్‌ విజయానికి 28 పరుగులు, గిల్‌ సెంచరీకి 19 పరుగులు అవసరమయ్యాయి. అయితే గిల్‌ సెంచరీ చేజార్చుకోగా, రాహుల్‌ (2) కూడా నిలబడలేదు. కానీ పాండ్యా (9 నాటౌట్‌), జడేజా (12 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు.

26 పరుగులు సమర్పించుకున్నా... 
కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న రాణా బౌలింగ్‌ ఆరంభంలో తడబడ్డాడు. ముఖ్యంగా అతని మూడో ఓవర్లో సాల్ట్‌ 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో సాల్ట్‌ వరుసగా 6, 4, 6, 4, 0, 6 బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే తన నాలుగో ఓవర్లో అతను సత్తా చాటి పరిస్థితిని మార్చాడు. మూడో బంతికి డకెట్‌ను అవుట్‌ చేసిన రాణా చివరి బంతికి బ్రూక్‌ను డకౌట్‌ చేశాడు. ఆ తర్వాత కీలకమైన లివింగ్‌స్టోన్‌ వికెట్‌ కూడా రాణా ఖాతాలోనే చేరింది.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (రనౌట్‌) 43; డకెట్‌ (సి) జైస్వాల్‌ (బి) రాణా 32; రూట్‌ (ఎల్బీ) (బి) జడేజా 19; బ్రూక్‌ (సి) రాహుల్‌ (బి) రాణా 0; బట్లర్‌ (సి) పాండ్యా (బి) అక్షర్‌ 52; బెతెల్‌ (ఎల్బీ) (బి) జడేజా 51; లివింగ్‌స్టోన్‌ (సి) రాహుల్‌ (బి) రాణా 5; కార్స్‌ (బి) షమీ 10; రషీద్‌ (బి) జడేజా 8; ఆర్చర్‌ (నాటౌట్‌) 21; మహమూద్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్‌) 248.  వికెట్ల పతనం: 1–75, 2–77, 3–77, 4–111, 5–170, 6–183, 7–206, 8–220, 9–241, 10–248. బౌలింగ్‌: షమీ 8–1–38–1, రాణా 7–1–53–3, అక్షర్‌ 7–0–38–1, పాండ్యా 7–1–37–0, కుల్దీప్‌ 9.4–0–53–1, జడేజా 9–1–26–3. 

భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) సాల్ట్‌ (బి) ఆర్చర్‌ 15; రోహిత్‌ శర్మ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) మహమూద్‌ 2; గిల్‌ (సి) బట్లర్‌ (బి) మహమూద్‌ 86; శ్రేయస్‌ (ఎల్బీ) (బి) బెతెల్‌ 59; అక్షర్‌ (బి) రషీద్‌ 52; రాహుల్‌ (సి) అండ్‌ (బి) రషీద్‌ 2; పాండ్యా (నాటౌట్‌) 9; జడేజా (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38.4 ఓవర్లలో 6 వికెట్లకు) 251.  వికెట్ల పతనం: 1–19, 2–19, 3–113, 4–221, 5–225, 6–235. బౌలింగ్‌: ఆర్చర్‌ 7–1–39–1, మహమూద్‌ 6.4–0–47–2, కార్స్‌ 5–0–52–0, రషీద్‌ 10–1–49–2, బెతెల్‌ 3–0–18–1, లివింగ్‌స్టోన్‌ 5–0–28–0, రూట్‌ 2–0–10–0. 

సినిమా చూస్తుండగా... 
‘నేను ఈ మ్యాచ్‌ ఆడతానని అనుకోలేదు. కాస్త ఎక్కువ సేపు మెలకువతో ఉండవచ్చు అనుకొని రాత్రి సినిమా చూస్తూ కూర్చున్నాను. అయితే కోహ్లి మోకాలికి గాయం అయిందని నువ్వు ఆడాల్సి ఉంటుందని కెప్టెన్  రోహిత్‌నుంచి ఫోన్‌ వచ్చింది. వెంటనే సినిమాను సగంలోనే ఆపేసి వెంటనే వెళ్లి పడుకున్నాను’   –శ్రేయస్‌ అయ్యర్‌  

జైస్వాల్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముందే సిద్ధమైందని శ్రేయస్‌ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గత కొంత కాలంగా వన్డేల్లో ఘనమైన రికార్డు ఉన్నా సరే... శ్రేయస్‌కు తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యకరం.

గాయంతో దూరమైన కోహ్లి 
టాప్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి లేకుండానే భారత జట్టు తొలి వన్డేలో బరిలోకి దిగింది. కుడి మోకాలికి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్‌ సమయంలోనే అతనికి ఈ గాయమైందని టాస్‌ సమయంలో కెప్టెన్ రోహిత్‌ వెల్లడించాడు. 

అయితే మ్యాచ్‌ ముందు రోజు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ విషయాన్ని చెప్పలేదు. గురువారం జట్టు సభ్యులందరితో కలిసి మైదానానికి వచ్చిన కోహ్లి స్వల్పంగా డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ సమయంలో అతను కాలికి ప్లాస్టర్‌తో కనిపించాడు.  

యశస్వి జైస్వాల్, రాణా అరంగేట్రం  
పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా, ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఈ మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. భారత్‌ తరఫున వన్డేలు ఆడిన 257, 258వ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. 

భారత్‌ తరఫున ఇప్పటికే 19 టెస్టులు, 23 టి20లు ఆడిన 23 ఏళ్ల ముంబై ఆటగాడు జైస్వాల్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా... ఢిల్లీకి చెందిన రాణా ఆ్రస్టేలియా గడ్డపై తొలి రెండు టెస్టులు ఆడాడు. ఆపై ఇంగ్లండ్‌తో గత శుక్రవారం జరిగిన చివరి మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లోకి అడుగు పెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement