విధ్వంసానికి చిరునామాగా అభిషేక్ శర్మ
సిక్సర్లతో చెలరేగుతున్న బ్యాటర్
142.3 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఒక బంతి... ఆ తర్వాత అదే ఓవర్లో 146.1 కిలోమీటర్ల వేగంతో మరో బంతి... 147.2 కిలోమీటర్ల వేగంతో తర్వాతి బంతి... మొదటిది ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ దాటింది. తర్వాతి షార్ట్ బంతి బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా, మూడోది కవర్స్ మీదుగా సిక్సర్లుగా మారాయి!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ ఇలా చితకబాదిన తీరు అతని అసలైన బ్యాటింగ్ శైలిని చూపించాయి. ఒకదానితో మరొకటి పోటీ పడినట్లుగా అభిషేక్ బాదిన భారీ సిక్సర్లలో ఈ రెండు మరింత హైలైట్‌గా నిలిచాయి. అండర్–16 స్థాయి నుంచే దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన అభిషేక్ ఇప్పుడు 24 ఏళ్ల వయసులో భారత్ తరఫున టి20ల్లో భీకరమైన హిట్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇంగ్లండ్‌తో ఆదివారం మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్లతో వీరవిధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ భారత టి20లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. అతను కొట్టిన 7 ఫోర్లు, 13 సిక్స్‌లు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో కొట్టిన అసలైన క్రికెటింగ్ షాట్లే. ఒక్కటి కూడా అనుకోకుండా తగిలి లేదా ఎడ్జ్ తీసుకొని వెళ్లింది లేదు. డ్రైవ్, లాఫ్టెడ్ డ్రైవ్, ఫ్లిక్, కట్... ఇలా ఏదైనా శ్రమ లేకుండా అలవోకగా, చూడముచ్చటగా ఆడటం అభిషేక్‌కే చెల్లింది. ఇక ప్రభావాన్ని చూస్తే మాత్రం అన్ని షాట్లూ ఫలితం రాబట్టినవే. ఐపీఎల్ ద్వారానే అభిమానులకు చేరువైన అతను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్యాటింగ్ పదును చూపించాడు.
అక్కడే మొదలు...
భారీ షాట్లు బాదడం, సిక్సర్లతో పండగ చేసుకోవడం అభిషేక్‌కు కొత్త కాదు. తన స్వస్థలం అమృత్‌సర్‌లోని గాంధీ స్టేడియంలో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అతను ఇలా ఆడేవాడు. అతని దెబ్బకు ఎంతో విలువైన కొత్త ఎస్‌జీ, కూకూబుర్రా, డ్యూక్ బంతులు గ్రౌండ్ బయట పడేవి. చివరకు కోచ్‌లు, సిబ్బంది ఈ జోరును తగ్గించమని, లేదంటే చాలా ఖర్చు అవుతుందని అభిషేక్ తండ్రి రాజ్‌కుమార్ శర్మకు మొర పెట్టుకోవాల్సి వచ్చేది. అయితే మీకు కావాలంటే చండీగఢ్ నుంచి నేను కొత్త బంతులు కొని ఇస్తానే తప్ప శైలి మార్చుకోమని నా కొడుకుకు చెప్పను అతని ఆయన ఖరాఖండీగా తేల్చేశారు. దాంతో టీనేజ్‌లో వచ్చిన ఆ ధాటి అన్ని చోట్లా అలాగే కొనసాగింది. బీసీసీఐ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఒకే సీజన్ (2015–16)లో అతను ఇలాంటి బ్యాటింగ్‌తోనే ఏకంగా 1200కు పైగా పరుగులు సాధించి తానేంటో చూపించాడు.
యువరాజ్ అండతో...
దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్‌తో కీలక ఓవర్లు వేయగల అభిషేక్ పంజాబ్ జట్టులో మిడిలార్డర్ నుంచి టాపార్డర్‌కు మారడంతో అతని బ్యాటింగ్ సత్తా అందరికీ తెలిసింది. కెపె్టన్‌గా అండర్–19 ఆసియాకప్‌ను గెలిపించిన అభిషేక్ 2018 అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా. పంజాబ్ తొలిసారి 2023లో దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర.
ఈ టోర్నిలో ఏకంగా 192.46 స్ట్రయిక్‌రేట్‌తో అతను 485 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండగా... ఆంధ్రపై 51 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో చేసిన 112 పరుగులు టోర్నిలో హైలైట్‌గా నిలిచాయి. అతని ఎదుగుదలలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో ఉంది. అభిషేక్‌కు మెంటార్‌గా యువీ ఎన్నో రకాలుగా మార్గనిర్దేశనం చేశాడు. ‘అభి’లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన యువీ సరైన దిశలో ప్రోత్సహించిన ఫలితమే ఇప్పుడు ఈ సిక్సర్ల పండగ. అందుకే యువరాజ్ ఎప్పుడు, ఎక్కడ ప్రాక్టీస్‌కు పిలిచినా అభిషేక్ వెంటనే హాజరైపోతాడు.
ఐపీఎల్‌లో జోరు...
భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ విధ్వంసం విలువ 2024లోనే కనిపించింది. 2022 సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ తరఫున 426 పరుగులు చేసినా గత సీజన్ మాత్రమే అతని స్థాయిని అమాంతం పెంచేసింది. ట్రవిస్ హెడ్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యాలు ఐపీఎల్‌లో అద్భుతాన్ని చూపించాయి. ఈ టోర్నిలో ఏకంగా 204.21 స్ట్రయిక్‌రేట్‌తో అభిషేక్ 484 పరుగులు చేసి టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చాడు.
ఇందులో 36 ఫోర్లు ఉంటే, సిక్స్‌లు 42 ఉన్నాయి! రెండు సార్లు సన్‌రైజర్స్ ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు రికార్డులు బద్దలు కొట్టడంతో అతని పాత్రను అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇదే సీజన్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అతను అదరగొట్టాడు. నిజానికి పంజాబ్ గెలిచిన ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచే అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. నాటి నుంచి ఆదివారం మ్యాచ్ వరకు అతను టి20ల్లో 199.47 స్ట్రయిక్‌రేట్‌తో 1893 పరుగులు చేశాడంటే అభి ఆట ఎలా సాగుతోందో అర్థమవుతుంది.
డకౌట్‌తో మొదలై...
ఐపీఎల్ మెరుపుల తర్వాత భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో ‘డకౌట్’తో అభిషేక్ కెరీర్ మొదలైంది. అయితే దానిని మరచిపోయేలా తర్వాతి మ్యాచ్‌లో 46 బంతుల్లో సెంచరీతో అతను చెలరేగాడు. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో మళ్లీ తడబాటు. దక్షిణాఫ్రికాపై రెండు మ్యాచ్‌లలో రాణించినా తాజా సిరీస్‌కు ముందు కాస్త ఒత్తిడి. కానీ కోల్‌కతాలో తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 79 పరుగులతో చెలరేగి దానిని కాస్త తగ్గించుకోగలిగాడు. ఇప్పుడు చివరి మ్యాచ్‌కు వచ్చేసరికి అభిషేక్ విశ్వరూపం చూపించాడు. 17 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో అతను 276 బంతులు ఆడితే 46 ఫోర్లు, 41 సిక్సర్లతో 535 పరుగులు చేసి పరాక్రమించాడు. మున్ముందూ ఇదే ధాటి కొనసాగితే 2026 టి20 వరల్డ్ కప్ వరకు కూడా మనకు ఎదురుండదు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment