సిక్సర్లతో వాంఖెడే అభిషేకం
37 బంతుల్లోనే శతకం
54 బంతుల్లో 13 సిక్స్‌లు, 7 ఫోర్లతో 135
ఆఖరి టి20లో ఇంగ్లండ్‌పై 150 పరుగులతో భారత్ జయభేరి
ఇన్నింగ్స్ తొలి బంతికే సామ్సన్ సిక్స్‌తో భారత్ ఆట ఆరంభం. మూడో ఓవర్లో బౌండరీతో అభిషేక్ ధాటి కాస్త ఆలస్యం! అంతే ఇక ఆ ఓవర్లోనే రెండు సిక్స్‌లతో పదునెక్కిన ప్రతాపం. ఆర్చర్, మార్క్ వుడ్, ఓవర్టన్ ఇలా పేసర్లు మారినా... లివింగ్‌స్టోన్, రషీద్‌లు స్పిన్నేసినా... బంతి గమ్యం, అభిషేక్ వీరవిహారం... ఈ రెండూ ఏమాత్రం మారలేదు. 13 సిక్సర్లతో ‘వాంఖెడే’కు అభిషేకం... 37 బంతుల్లోనే శతకం... 18వ ఓవర్ దాకా అతనొక్కడిదే విధ్వంసం!
ఆఖరి పోరు గెలిచి ఆతిథ్య దేశం ఆధిక్యానికి గండి కొట్టేద్దామనుకుంటే ఇంగ్లండ్ కనీసం జట్టంతా కలిపి 100 పరుగులైనా కొట్టలేకపోయింది. ప్రత్యర్థి పేస్, స్పిన్ వైవిధ్యం అభిషేక్ శర్మ ధాటిని ఏ ఓవర్లోనూ, ఏ బౌలింగ్‌తోనూ అసలు ప్రభావమే చూపలేకపోయింది.
ముంబై: ఏఐ... అదేనండీ అర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వైపే ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కానీ వాంఖెడే స్టేడియంలో మాత్రం మరో ఏఐ... అదే భయ్యా అభిషేక్ ఇంటలిజెంట్ బ్యాటింగ్ వైపే ఓ గంటసేపు కన్నార్పకుండా చూసేలా చేసింది. ఇది కదా ఫన్... ధన్ ధనాధన్! ఇదే కదా ఈ టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మిస్సయ్యింది. అయితేనే ఆఖరి పోరులో ఆవిష్కృతమైంది.
అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్స్‌లు) ఆమోఘ శతకం, అదేపనిగా విధ్వంసం ముంబై వాసుల్ని మురిపించింది. టీవీ, మొబైల్ యాప్‌లలో యావత్ భారత అభిమానుల్ని కేరింతలతో ముంచెత్తింది. అతని ఆటలో అయ్యో ఈ షాట్‌ను చూడటం మిస్ అయ్యామే అని బహుశా ఏ ఒక్కరికీ అనిపించి ఉండకపోవచ్చు! ఎందుకంటే ప్రతి షాట్ హైలైట్స్‌నే తలదన్నేలా ఉంది.
ఆదివారం అసలైన టి20 వినోదాన్ని పంచిన చివరి టి20లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 247 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్న కాసేపు మెరిపించాడు. బ్రైడన్ కార్స్ 3, మార్క్‌వుడ్ 2 వికెట్లు తీశారు. తర్వాత కష్టమైన లక్ష్యం ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ 10.3 ఓవర్లలోనే 97 పరుగుల వద్దే ఆలౌటైంది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాదిన అర్ధశతకంతో ఆ మాత్రం స్కోరు చేసింది. మిగతావారిలో జాకబ్ బెథెల్ (10; 1 సిక్స్) తప్ప అందరివి సింగిల్ డిజిట్లే! షమీ 3 వికెట్లు పడగొడితే ఒక్క ఓవర్ వేసిన అభిషేక్, దూబే, వరుణ్‌లు తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను 11వ ఓవర్ ముగియక ముందే స్పిన్‌తో దున్నేశారు.
ఇంగ్లండ్ పాలిట సిక్సర పిడుగల్లే...
మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే మ్యాచ్ అంతటిని అభిషేక్ ఒక్కడే షేక్ చేశాడు. ఐదు పదుల బంతులు (54) ఎదుర్కొంటే ఇందులో కేవలం 5 మాత్రమే డాట్ బాల్స్. అంటే పరుగు రాలేదు. కానీ మిగతా 49 బంతుల్లో ‘రన్’రంగమే... ప్రత్యర్థి బౌలర్లేమో లబో... దిబో! ఇది అభిషేక్ సాగించిన విధ్వంసం.
17 బంతుల్లోనే అతను సాధించిన ఫిఫ్టీ భారత్ తరఫున రెండో వేగవంతమైన అర్ధశతకమైంది. అంతేనా... పవర్ ప్లే (6 ఓవర్లు)లో జట్టు స్కోరు 95/1 ఇది భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లోనే అత్యధిక స్కోరైంది. ఆ తర్వాత 37 బంతుల్లోనే దంచేసిన మెరుపు శతకం శాశ్వత దేశాల మధ్య రెండో వేగవంతమైన సెంచరీగా పుటలకెక్కింది. 2017లో మిల్లర్ (దక్షిణాఫ్రికా) బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో శతక్కొట్టాడు.
3.5 ఓవర్లో 50 పరుగులు దాటిన భారత్ స్కోరు అతనొక్కడి జోరుతో 6.3 ఓవర్లోనే వందకు చేరింది. భారత్ 12వ ఓవర్లో 150, 16వ ఓవర్లో 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. మిగతావారిలో శివమ్ దూబే కాస్త మెరిపించాడు. అయితే దూబే (2–0–11–2) బౌలింగ్ స్పెల్‌తో గత మ్యాచ్ ‘కన్‌కషన్’ విమర్శలకు తాజా మ్యాచ్‌లో బంతితో సమాధానమిచ్చాడు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ఆర్చర్ (బి) వుడ్ 16; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 135; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) కార్స్ 24; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; దూబే (సి) రషీద్ (బి) కార్స్ 30; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 9; రింకూసింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్ 9; అక్షర్ రనౌట్ 15; షమీ నాటౌట్ 0; రవి బిష్ణోయ్ (సి) కార్స్ (బి) ఓవర్టన్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–21, 2–136, 3–145, 4–182, 5–193, 6–202, 7–237, 8–247, 9–247. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–55–1, మార్క్‌వుడ్ 4–0–32–2, ఓవర్టన్ 3–0–48–1, లివింగ్‌స్టోన్ 2–0–29–0, అదిల్ రషీద్ 3–0–41–1, బ్రైడన్ కార్స్ 4–0–38–3.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సబ్–జురేల్ (బి) దూబే 55; డకెట్ (సి) అభిషేక్ (బి) షమీ 0; బట్లర్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 7; హ్యారీ బ్రూక్ (సి) వరుణ్ (బి) రవి బిష్ణోయ్ 2; లివింగ్‌స్టోన్ (సి) రింకూ (బి) వరుణ్ 9; జాకబ్ (బి) దూబే 10; కార్స్ (సి) వరుణ్ (బి) అభిషేక్ 3; ఓవర్టన్ (సి) సూర్యకుమార్ (బి) అభిషేక్ 1; ఆర్చర్ నాటౌట్ 1; రషీద్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 6; మార్క్‌వుడ్ (సి) సబ్–జురేల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (10.3 ఓవర్లలో ఆలౌట్) 97. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–59, 4–68, 5–82, 6–87, 7–90, 8–90, 9–97, 10–97. బౌలింగ్: షమీ 2.3–0–25–3, హార్దిక్ పాండ్యా 2–0–23–0, వరుణ్ 2–0–25–2, రవి బిష్ణోయ్ 1–0–9–1, శివమ్ దూబే 2–0–11–2, అభిషేక్ 1–0–3–2.
ఆహా... ఆదివారం
భారత క్రీడాభిమానులకు ఆదివారం పండుగలా గడిచింది. మధ్యాహ్నం కౌలాలంపూర్‌లో భారత అమ్మాయిల జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష చిరస్మరణీయ ఆటతీరుతో అదరగొట్టింది. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో కీలకపాత్ర పోషించింది.
రాత్రి ఇటు ముంబైలో భారత పురుషుల జట్టు ఇంగ్లండ్‌పై వీరంగం సృష్టించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టి20ల్లో రెండోసారి ‘శత’క్కొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ అందుకున్న అభిషేక్ అమోఘమైన ఆటతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది.
1 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (135) చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. శుబ్‌మన్ గిల్ (126 నాటౌట్; న్యూజిలాండ్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు.
2 భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన సెంచరీ (37 బంతుల్లో) చేసిన రెండో ఆటగాడు అభిషేక్. రోహిత్ శర్మ (35 బంతుల్లో; శ్రీలంకపై) అగ్రస్థానంలో ఉన్నాడు.
13 ఈ మ్యాచ్‌లో అభిషేక్ కొట్టిన సిక్స్‌లు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. రోహిత్ (10 సిక్స్‌లు; శ్రీలంకపై), సామ్సన్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై), తిలక్ (10 సిక్స్‌లు; దక్షిణాఫ్రికాపై) రెండో స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment