నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ టి20 సిరీస్
ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్
ఇరు జట్లలోనూ దూకుడైన బ్యాటర్లు
భారీ స్కోర్లకు అవకాశం
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఒకరిని మించి మరొకరు ధాటిగా ఆడే బ్యాటర్లు... భారీ స్కోర్లకు వేదికలైన చిన్న మైదానాలు... మంచు ప్రభావంతో బౌలర్లకు తిప్పలు... రాబోయే పక్షం రోజుల్లో టి20ల్లో క్రికెట్‌లో ఎన్ని కొత్త రికార్డులు నమోదు కానున్నాయో!
వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేసిన 11 మ్యాచ్‌లలో 7 సార్లు 200 స్కోరు దాటించిన టీమిండియా తమ దూకుడును ప్రదర్శించగా... విధ్వంసానికి మారుపేరువంటి మెకల్లమ్ కోచింగ్‌లో ఇంగ్లండ్ కూడా ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో వరుసగా లక్ష్యాలను ఛేదిస్తూ తామూ తక్కువ కాదని నిరూపించింది.
ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టి20 సమరాలు అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనున్నాయి. గత వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ చిత్తయిన తర్వాత ఇరు జట్లు ఇప్పుడే తొలిసారి తలపడనుండగా... చివరకు పైచేయి ఎవరు సాధిస్తారనేది ఆసక్తికరం.
కోల్‌కతా: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాల తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగుతోంది. టెస్టులతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన జట్టుతో ఇప్పుడు టీమిండియా టి20 ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 పోరులో విశ్వ విజేత జట్టు తలపడుతుంది.
ఇందులో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు మొదటి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే రెండు టీమ్‌లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. టి20 కోచ్‌గానూ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న మెకల్లమ్ తనదైన శైలిలో కొత్తగా ఇంగ్లండ్ జట్టును సిద్ధం చేశాడు.
షమీపై అందరి దృష్టి...
గాయం నుంచి కోలుకొని దాదాపు 14 నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌కు ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి కూడా ఎంపికైన షమీ టి20 ఫార్మాట్ ద్వారా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు.
రెండు నెలల క్రితం భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై మెరుపు ప్రదర్శన కనబర్చి 3–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చివరి మ్యాచ్‌తో పోలిస్తే దాదాపు అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన సంజు సామ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన జోరును ప్రదర్శించాలని భావిస్తుండగా, రెండో ఓపెనర్‌గా అభిషేక్ రాణించాల్సి ఉంది.
వరుసగా రెండు అంతర్జాతీయ టి20 సెంచరీలు సాధించిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా అదే ఉత్సాహంతో సిద్ధం కాగా... మిడిలార్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్, రింకూ సింగ్ భారీ స్కోరును అందించగలరు. నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.
కీపర్‌గా సాల్ట్...
తొలి టి20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ముందు రోజే ప్రకటించింది. తొలిసారి వైస్ కెప్టెన్‌గా నియమితుడైన హ్యారీ బ్రూక్ మెరుపు బ్యాటింగ్‌తో సత్తా చాటగలడు. సాల్ట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. చివరి స్థానం వరకు ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయగల సమర్థులు కావడం ఇంగ్లండ్ బలం.
పిచ్, వాతావరణం
ఈడెన్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లు ఖాయం. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు. వర్ష సూచన లేదు.
తుది జట్ల వివరాలు
భారత్ (అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్, షమీ, అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్/సుందర్.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, ఒవర్టన్, అట్కిన్‌సన్, జోఫ్రా ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్.
24 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్ వేదికగా రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందగా... 5 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు విజయం దక్కింది.
7 ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో ఆరింటిలో భారత్ నెగ్గగా... ఎదురైన ఒక పరాజయం ఇంగ్లండ్ చేతిలోనే (2011లో) కావడం గమనార్హం.
హార్దిక్ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అతను మా నాయకత్వ బృందంలో కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా టీమ్‌లో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. కోచ్ గంభీర్‌తో కూడా గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది.
కీపర్‌గా సామ్సన్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్ గురించి ఆలోచన లేదు. టి20 వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం కంటే నేను వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే నన్ను ఎక్కువ నిరాశకు గురి చేస్తోంది. నా ప్రదర్శన బాగా లేక ఎంపిక కాలేదు కాబట్టి సమస్య లేదు. –సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment