నేడు భారత్, ఇంగ్లండ్ తొలి వన్డే
మరో సిరీస్ విజయంపై టీమిండియా గురి
ఒత్తిడిలో బట్లర్ బృందం
మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
టి20 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. సరిగ్గా ఆరు నెలల విరామం తర్వాత వన్డేల్లో బరిలోకి దిగుతున్న టీమిండియా రాబోయే చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను వాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఒకరిద్దరు మినహా దాదాపు టి20 టీమ్‌తోనే వన్డే సిరీస్ కూడా ఆడనున్న బట్లర్ బృందం ఈ ఫార్మాట్‌లోనైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. తుది జట్టు ఎంపిక, వ్యూహాల విషయంలో ఈ మూడు మ్యాచ్‌లో రోహిత్ బృందానికి కీలకం కానున్నాయి.
నాగ్‌పూర్: వన్డే వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన అనంతరం 6 మ్యాచ్‌లే ఆడిన భారత జట్టుదక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓడింది. మన ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో గత ఏడాది ఆగస్టు తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కొంత విరామం తర్వాత భారత్‌లోనే మన జట్టు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. జమ్తాలోని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) మైదానంలో నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగు తుంది.
ఇటీవల టెస్టుల్లో ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొ న్న కెపె్టన్ రోహిత్, కోహ్లి తమదైన శైలిలో చెలరేగేందుకు వన్డేలే సరైన వేదిక. టి20 ఫామ్‌ను కొనసాగిస్తూ ఇక్కడా జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుందా అనేది ఆసక్తికరం.
షమీ, కుల్దీప్ ఫామ్ కీలకం...
టెస్టు, టి20 ఫార్మాట్‌లతో పోలిస్తే భారత వన్డే జట్టు కూర్పు చాలా కాలంగా గందరగోళం లేకుండా దాదాపు ఒకేలా ఉంది. ముఖ్యంగా టాప్–6 విషయంలో సందేహాలు లేవు. వరల్డ్ కప్ తరహాలోనే రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యాలు వరుసగా ఆయా స్థానాల్లో ఆడతారు. వీరంతా కుడిచేతి వాటం బ్యాటర్లే.
అయితే ఇప్పుడు కొత్త ప్రణాళికల్లో భాగంగా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ స్థానంలో వైవిధ్యం కోసం పంత్‌ను తీసుకుంటారా అనేది చూడాలి. నాగ్‌పూర్ పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు స్పిన్నర్లు ఆడవచ్చు. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న కుల్దీప్ ఆడటం ఖాయం.
అతనికి తోడు జట్టుకు నాలుగు స్పిన్ ప్రత్యామ్నాయాలు జడేజా, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి రూపంలో అందుబాటులో ఉన్నాయి. పేసర్లుగా షమీ, అర్‡్షదీప్‌పై బాధ్యత ఉంది. తాజాగా ఇంగ్లండ్‌పై 2 టి20లు ఆడిన షమీకి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇదే తొలి వన్డే కానుంది. బుమ్రా గైర్హాజరీలో షమీపై అదనపు బాధ్యత కూడా ఉంది.
రూట్, బట్లర్ మినహా...
టి20ల్లో చిత్తయిన ఇంగ్లండ్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. కొంత కాలం క్రితం వరకు భీకరమైన లైనప్‌తో ఈ ఫార్మాట్‌ను శాసించిన ఆ జట్టు వరుస వైఫల్యాలతో తడబడుతోంది. వరల్డ్ కప్ తర్వాత టీమ్‌లో స్థానం కోల్పోయిన సీనియర్ జో రూట్‌ను మళ్లీ ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు.
అతనితో పాటు కెపె్టన్ బట్లర్‌కు మాత్రం భారత్‌లో చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. ఎక్కువ మంది టి20 స్పెషలిస్ట్‌లే ఉన్న జట్టు వన్డేల్లో ఏమాత్రం రాణించగలదనేది చూడాలి. మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
తుది జట్ల వివరాలు:
భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, సాఖిబ్.
107 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 107 వన్డేలు జరిగాయి. 58 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 44 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. 3 మ్యాచ్‌లు రద్దయ్యాయి.
52 స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన వన్డేలు. 34 మ్యాచ్‌ల్లో టీమిండియా, 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. 1 మ్యాచ్ ‘టై’ అయింది.
6 వీసీఏ స్టేడియంలో భారత్ ఆడిన వన్డేలు. ఇక్కడ 4 వన్డేల్లో నెగ్గిన టీమిండియా, 2 వన్డేల్లో ఓడిపోయింది. 2019 తర్వాత వీసీఏ స్టేడియంలో భారత్ వన్డే ఆడనుంది.
పిచ్, వాతావరణం
చక్కటి బ్యాటింగ్ వికెట్. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. వర్షసూచన ఏమాత్రం లేదు.
Comments
Please login to add a commentAdd a comment