వన్డేలో 407 చే‘దంచేశారు’ | Uttar Pradesh chasing record against Vidarbha | Sakshi
Sakshi News home page

వన్డేలో 407 చే‘దంచేశారు’

Published Fri, Dec 27 2024 4:00 AM | Last Updated on Fri, Dec 27 2024 4:00 AM

Uttar Pradesh chasing record against Vidarbha

విదర్భపై ఉత్తరప్రదేశ్‌ రికార్డు ఛేజింగ్‌ 

సమీర్‌ రిజ్వీ రెండో ‘డబుల్‌’ సెంచరీ

105 బంతుల్లో 10 ఫోర్లు, 18 సిక్స్‌లతో 202 నాటౌట్‌ 

వడోదర: భారత దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో రికార్డు లక్ష్యఛేదన నమోదైంది. పురుషుల అండర్‌–23 వన్డే టోర్నమెంట్‌లో సూపర్‌ ‘డబుల్‌’ ఫామ్‌లో ఉత్తరప్రదేశ్‌ (యూపీ) బ్యాటర్‌ సమీర్‌ రిజ్వీ (105 బంతుల్లో 202 నాటౌట్‌; 10 ఫోర్లు, 18 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస మ్యాచ్‌ల్లో రెండో అ‘ద్వితీయ’ సెంచరీ సాధించడంతో యూపీ 407 పరుగుల లక్ష్యాన్ని 41.2 ఓవర్లలోనే ఛేదించి దేశవాళీ క్రికెట్‌ పుటలకెక్కింది.

జీఎస్‌ఎఫ్‌సీ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సొంతగడ్డపై విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల భారీస్కోరు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్‌ దనిశ్‌ మాలేవర్‌ (123 బంతుల్లో 142; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్‌లో కెపె్టన్‌ ఫయాజ్‌ (62 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 197 పరుగులు జోడించారు. 

తర్వాత జగ్‌జోత్‌ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా అర్ధసెంచరీ సాధించడంతో విదర్భ 400 పైచిలుకు భారీ స్కోరు చేసింది. అయితే ఈ సంతోషం ప్రత్యర్థి లక్ష్యఛేదనకు దిగడంతోనే ఆవిరైంది. ఓపెనర్లు శౌర్య సింగ్‌ (42 బంతుల్లో 62; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్వస్తిక్‌ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) 10.4 ఓవర్లలోనే 106 పరుగులు చకచకా జతచేశారు. ఈ మెరుపు శుభారంభం రికార్డు ఛేజింగ్‌కు బాటవేసింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ షోయబ్‌ సిద్దిఖీ (73 బంతుల్లో 96 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రిజ్వీ అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 173 బంతుల్లోనే 296 పరుగులు ధనాధన్‌గా జతచేయడంతో ఉత్తర ప్రదేశ్‌ జట్టు 41.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో సమీర్‌ గత మ్యాచ్‌లో త్రిపురపై కూడా (93 బంతుల్లో 201 నాటౌట్‌) డబుల్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను అవుట్‌ కాకుండా అజేయంగా నిలవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement