న్యూఢిల్లీలోని జామా మసీదు ప్రాంగణంలో ఆందోళనకు దిగిన వందలాది మంది నిరసనకారులు
న్యూఢిల్లీ: భారత్‌లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆందోళనలతో అట్టుడికింది. నిరసనల సందర్భంగా యూపీలో శుక్రవారం ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ఐదుగా పేర్కొన్నారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌లో ఒక్కరు చొప్పున చనిపోయారని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.
కాన్పూర్‌లోనూ ఒకరు చనిపోయినట్లు సమాచారం. పోలీసు కాల్పుల కారణంగా ఈ మరణాలు సంభవించాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆందోళనకారుల దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ఇప్పటివరకు ఆందోళనలు జరగని ప్రాంతాల్లోనూ శుక్రవారం భారీ స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్ నుంచి బులంద్‌షహర్ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగాయి. ఢిల్లీలో జాతీయ పతాకం చేతపట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదాలతో నిరసనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనకారులు తమది శాంతియుత నిరసన అని తెలిపేందుకు పోలీసులకు గులాబీ పూలను అందించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మంగళూరు, ఒకరు చనిపోయిన లక్నో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో.. సీఏఏపై, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్నార్సీపై సలహాలు, సూచనలను స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఢిల్లీలో..
ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆందోళనకారులు కారును తగలబెట్టారు. ఢిల్లీగేట్ వద్ద రాళ్లు రువ్వడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్‌లను ప్రయోగించారు. రోడ్లపై భారీగా బారికేడ్లను నిలిపినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసేసినప్పటికీ, నిషేధాజ్ఙలను ఉల్లంఘిస్తూ వేలాదిగా ఆందోళనకారులు నిరసన తెలిపారు.
జామా మసీదు, ఇండియా గేట్, సెంట్రల్ పార్క్‌ల వద్ధ భారీ స్థాయిలో గుమికూడారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భారీ ర్యాలీకి నేతృత్వం వహించారు. పోలీసులు డ్రోన్లతో ఆందోళనలపై నిఘా పెట్టారు. హోంమంత్రి అమిత్ షా నివాసం దగ్గరలో నిరసన తెలుపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళ కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భిన్నాభిప్రాయాన్ని పోలీసు బలంతో అణచేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు.
జాతీయ గీతంతో..
బనశంకరి: పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింపజేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై అందోళనలు చేయడానికి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ గురువారం కొన్ని సంఘాల నాయకులు టౌన్‌హాల్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడకు చేరుకున్న డీసీపీ చేతన్‌సింగ్‌రాథోడ్ మాట్లాడుతూ ‘నేను మీవాడిని అనుకుంటే నేను ఆలపించే జాతీయ గీతాన్ని ఆలకించాల’ని కోరారు. అనంతరం ఆయన జాతీయగీతం ఆలపించగా అందోళనకారులు గౌరవంగా లేచి నిల్చుని, ధర్నా విరమించారు. డీసీపీ చేతన్‌సింగ్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నేరవిభాగ ఐజీ హేమంత్ నింబాళ్కర్ ట్వీట్ చేశారు.
మిత్రపక్షాల వేరు బాట
జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని బిహార్‌లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జేడీయూ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరో మిత్రపక్షం ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ తీరును తప్పుబట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విషయంలో కేంద్రం విఫలౖ మెందన్నారు. ఎన్నార్సీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు వ్యతిరేకత తెలిపిన విషయం తెలిసిందే.
యూపీలో..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గోరఖ్‌పూర్, సంభాల్, భదోహి, బహ్రెచ్, ఫరుఖాబాద్, బులంద్ షహర్, ఫిరోజ్‌బాద్‌లో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ యా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లక్నో, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్ సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
► మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్, పర్బాని జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్‌లో హిందువులే ఉండేలా మోదీ సర్కారు చట్టాలు తీసుకువస్తోందని ఆరోపించింది.
► కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో గురువారం ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కేరళలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.
► అస్సాంలో ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినట్లు సీఎం శర్బానంద సోనోవాల్ తెలిపారు.
మమత యూ టర్న్
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని గురువారం డిమాండ్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట మార్చారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టం విషయంలో జోక్యం చేసుకుని, రద్దుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు విషయంలోనూ వెనక్కు తగ్గాలని కోరారు.
డీసీపీ చేతన్
Comments
Please login to add a commentAdd a comment