వాషింగ్టన్: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు.
అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలను చూడనుందని తెలిపారు. 2019, 2020 వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ వచ్చే వారంలో విడుదల కానుందని పేర్కొన్న ఆమె, ఈ అవుట్‌లుక్‌లో వృద్ధి రేట్ల అంచనాలకు కోత పడే అవకాశం ఉందనీ సూచించారు. వచ్చేవారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్ చీఫ్ ఇక్కడ కీలక ముందస్తు ప్రసంగం ఒకటి చేశారు.
ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక గణాంకాలను చూస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది.
► మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం పైనే ఉంది. ఆయా దేశాల్లో 19 సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి.
► పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి. తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది.
► వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. ఇందుకు తగిన మదింపు జరగాలి.
Comments
Please login to add a commentAdd a comment