న్యూఢిల్లీ: ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను హేతుబద్ధీకరించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వై.కె.యాదవ్ గురువారం వెల్లడించారు. అయితే, ఛార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన విషయమని విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు. సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణికులను రైల్వే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం కారణంగా రైల్వే ఆదాయంలో తగ్గుదల నమోదవడం తెల్సిందే.
రైల్వే నిర్వహణకు ఐదు విభాగాలు
రైల్వేలలో ఇకపై యూపీఎస్సీ తరహాలో ఐదు ప్రత్యేక విభాగాలకు నియామకాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగానే ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఐఆర్‌ఎంఎస్) కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని అందులో విజయం సాధించిన వారు ఐదు విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఐదు ప్రత్యేక విభాగాల్లో నాలుగు సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్ వంటి ఇంజినీరింగ్ సేవలు కాగా, మిగిలిన నాన్ టెక్నికల్ విభాగం కింద అకౌంట్స్, పర్సనెల్, ట్రాఫిక్ వంటివి ఉంటాయని చెప్పారు. చివరి విభాగంలో ఉద్యోగం కోసం హ్యుమానిటీస్ చదువుకున్న వారూ అర్హులేనని, అందరికీ ఒకేసారి పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఇకపై రైల్వేల సీఈవోగా ఉంటారు. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారే ఈ పదవి చేపట్టనున్నారు.
సీనియారిటీకి ఢోకా లేదు: పీయూష్ గోయెల్
రైల్వేలోని వివిధ విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల అధికారుల సీనియారిటీకి ఇబ్బంది కలగబోదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగా రైల్వే బోర్డులో సభ్యులయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు.
రైల్వే చార్జీల హేతుబద్ధీకరణ
Published Fri, Dec 27 2019 3:17 AM | Last Updated on Fri, Dec 27 2019 3:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment