మోదీ ‘రియల్‌’ బూస్ట్‌! | Government Approves Rs 25,000 Crore Fund For Stalled Housing Projects | Sakshi
Sakshi News home page

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

Published Thu, Nov 7 2019 4:52 AM | Last Updated on Thu, Nov 7 2019 5:07 AM

Government Approves Rs 25,000 Crore Fund For Stalled Housing Projects - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది.

మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరాలు వెల్లడించారు. రూ.25,000 కోట్ల ఏఐఎఫ్‌ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్‌ రంగాల్లో డిమాండ్‌ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్‌ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికీ ఏఐఎఫ్‌ ద్వారా నిధులివ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు సీతారామన్‌ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్‌ ఉండి, సానుకూల నికర విలువ ఉ న్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్‌ ఫండ్స్‌ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు.

కొనుగోలుదారులకు ఉపశమనం
ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్‌ పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది.

– అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్‌ చైర్మన్‌

సమస్యకు పరిష్కారం
ఇళ్ల కొనుగోలుదారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం తో పాటు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. తొలుత ప్రకటన(సెప్టెంబర్‌ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్‌పీఏ లేదా ఎన్‌సీఎల్‌టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది.    

– జక్సయ్‌ షా, క్రెడాయ్‌ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement