సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అక్టోబర్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ట స్ధాయిలో 8.5 శాతానికి ఎగబాకిందని తాజా సర్వే బాంబు పేల్చింది. అక్టోబర్‌లో నమోదైన నిరుద్యోగ రేటు ఆగస్ట్ 2016 నుంచి ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన నివేదిక పేర్కొంది. డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తున్నా ఉద్యోగాలు తగ్గిపోవడం దేశ ఆర్థిక వృద్ధిపై స్లోడౌన్ ప్రభావమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో దేశ మౌలిక ఉత్పాదన గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 5.2 శాతం మేర పతనమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిది కోర్ ఇండస్ర్టీస్‌లో ఏడింటిలో ఉత్పత్తి తగ్గడం మందగమన ప్రభావంపై గుబులు రేపుతోంది.
మరోవైపు 2011-12 నుంచి 2017-18 మధ్య భారత ఉపాథి రంగంలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని సెంటర్ ఆప్ సస్టెయినబుల్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన పరిశోధనా పత్రం పేర్కొంది. పైన ఉదహరించిన కాలంలో దేశంలో మొత్తం ఉపాధి 90 లక్షల మేర పడిపోయిందని, దేశ చరిత్రలో ఈస్ధాయిలో ఉద్యోగాలు తగ్గుముఖ పట్టం ఇదే తొలిసారని పరిశోధనా పత్రాన్ని రూపొందించిన సంతోష్ మల్హోత్రా, జయతి కె పరిద ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, దినసరి కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment