న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనలో పడవేస్తుండగా తాజాగా ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్ సహా పలు రంగాల్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతం తగ్గిందని ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో విద్యుత్ ఉత్పత్తి 7.6 శాతం పెరగ్గా తాజాగా విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం పడిపోయింది. మైనింగ్ రంగం కేవలం 0.1 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇక ఐఐపీలో 77 శాతం వాటా ఉండే తయారీ రంగం ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.2 శాతం మేర కుదేలైంది. ఈ కీలక రంగం గత ఏడాది ఇదే నెలలో 5.2 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు గత ఏడాది ఆగస్ట్‌లో 5.3 శాతం నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో 2.4 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధి గణాంకాలను సోమవారం వెల్లడించనున్నట్టు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment