ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్‌తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్‌లుక్‌ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి.
ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్‌గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు.
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే..,
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి.
భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు
యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్‌కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్‌మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్‌డాక్ 4.7%, ఎస్‌అండ్‌పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి.
అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది.
► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం.
► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది.
రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్‌ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది.
రూ‘పాయె’!
77.65కి రికార్డు పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్‌సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్‌లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment