ముంబై: వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బుధవారం దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ బేర్ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించడంతో బెంచ్‌మార్క్ సూచీలు అయిదు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సెన్సెక్స్ 928 పాయింట్లు నష్టపోయి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఒక్క ఐటీసీ(0.41%) మాత్రమే లాభంతో ముగిసింది.
నిఫ్టీ 50 ఇండెక్స్‌లో నాలుగు షేర్లు మాత్రమే నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 11 శాతం పెరగడంతో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.580 కోట్ల షేర్లను అమ్మేశారు. డీఐఐలు రూ.372 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఈ ఏడాదిలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బుధవారం ఆసియా మార్కెట్లు రెండుశాతం, యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా
ఉదయం సెన్సెక్స్ 281 పాయింట్ల పతనంతో 60391 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 17,755 వద్ద మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒకదశలో సెన్సెక్స్ 992 పాయింట్లు క్షీణించి 59,681 వద్ద, నిఫ్టీ 297 పాయింట్లు నష్టపోయి 17,529 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి.
నష్టాలు ఎందుకంటే...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించిన కొన్ని గంటలకే అణు ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంటుందని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగాయి. ఫెడ్ మినిట్స్ వెల్లడికి ముందు అప్రమత్తత, వడ్డీ రేట్ల పెంపు భయాలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయంగా ఆర్‌బీఐ మినిట్స్ వెల్లడి (మార్కెట్ ముగింపు తర్వాత), ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ ముగింపు(నేడు) నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల పరంపర ఒత్తిడిని మరింత పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా నాలుగోరోజూ అమ్మకాలు పాల్పడ్డారు.
ఈ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ‘‘గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బేర్స్‌కు ఎదురొడ్డి నష్టాలను పరిమితం చేసిన బుల్స్ బుధవారం చేతులెత్తేశారు. కోవిడ్, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాల నుంచి మార్కెట్ రికవరీ అవుతున్న తరుణంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రచ్ఛన్న యుద్ధం సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ప్రస్తుతానికి నిఫ్టీకి 17,500 వద్ద మద్దతు ఉంది. ఈ కీలక స్థాయిని కోల్పోతే మరో దఫా లాభాల స్వీకరణ జరిగే వీలుంది. దిగువ స్థాయిలో 17,350 వద్ద మరో మద్దతు ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
4 రోజుల్లో రూ. 7 లక్షల కోట్ల నష్టం
గడచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1530 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో స్టాక్ మార్కెట్లో దాదాపు రూ. 7 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. బుధవారం ఒక్కరోజే రూ.3.87 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు దిగివచ్చింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► సెన్సెక్స్ కీలకమైన 60 వేల స్థాయిని కోల్పోయి మూడువారాల కనిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ 17,500 స్థాయికి చేరువలో నెల కనిష్టం వద్ద స్థిరపడింది.
► ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ బ్యాంక్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయి సూచీల భారీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
► వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మాంద్య భయాలతో రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు మూడుశాతం నష్టపోయాయి. శోభ, ఓబెరాయ్ రియల్టీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేర్లు 1–2% చొప్పున పతనమయ్యాయి. మైండ్‌స్పేస్ రీట్, బ్రూక్‌ఫీల్డ్ రీట్ షేర్లు అరశాతం చొప్పున నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment