ముంబై: స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టంతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లను విధిస్తున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం అయిదోరోజూ కొనసాగింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 39 పాయింట్లను కోల్పోయి 14,835 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు ముగింపు పడింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధింపుతో ఆస్తుల నాణ్యత తగ్గవచ్చనే అందోళనలతో ప్రైవేట్ బ్యాంకు షేర్లలో అమ్మకాలు జరిగాయి.
కొంతకాలంగా ర్యాలీ చేస్తున్న మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అలాగే ఆటో, రియల్టీ షేర్లలో కూడా విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకి రావడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ నికర అమ్మకందారులుగా మారారు. ఎఫ్‌ఐఐలు రూ.645 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.271 కోట్ల షేర్లను విక్రయించారు. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్...
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 49,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14,882 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఫార్మా, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించడంతో లాభాల్లోకి మళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49,907 వద్ద, నిఫ్టీ 14,918 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్ తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీల లాభాలన్ని మళ్లీ మాయమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి(49,907) నుంచి 446 పాయింట్లు నష్టపోయి 49,461 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం (14,918) నుంచి 133 పాయింట్లు కోల్పోయి 14,785 స్థాయికి చేరుకుంది. చివర్లో ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఆదుకోవడంతో సెన్సెక్స్ 154 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ముగించాయి.
సెన్సెక్స్ నష్టం 155 పాయింట్లు
Published Sat, Apr 10 2021 5:18 AM | Last Updated on Sat, Apr 10 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment