బంగారంలో తగ్గిన ఆదాయాలు | Gold returns subside in 2022 in dollar terms | Sakshi
Sakshi News home page

బంగారంలో తగ్గిన ఆదాయాలు

Published Mon, Dec 26 2022 5:52 AM | Last Updated on Mon, Dec 26 2022 5:52 AM

Gold returns subside in 2022 in dollar terms - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్‌తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్‌ గోల్డ్‌ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే..  

ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం
యూఎస్‌ ఫెడ్‌ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్‌ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్‌ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్‌ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్‌ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్‌ ఈటీఎఫ్‌ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి.  

నిల్వలు పెంచుకోవడం..
సెంట్రల్‌ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్‌ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్‌ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్‌ ఈటీఎఫ్‌లు 2022 నవంబర్‌లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్‌ నాటికి నికరంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి.  

కాయిన్లు, ఆభరణాల డిమాండ్‌
కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్‌ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు.  

2023పై అంచనాలు
అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్‌ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్‌కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్‌ ఇండెక్స్‌ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్‌ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన.  

ప్రథమేష్‌ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement