ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఆ ప్రభావం ఇతర ప్రపంచ దేశాలపై చూపిస్తోంది. దీంతో దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్స్ వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. ఇటీవల ట్విటర్,మెటా, అమెజాన్ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేశాయి. దీంతో ఉద్యోగం కోల్పోయే కుటుంబ పోషణ మరింత భారం అవుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో తొలగింపులు, ఉద్యోగం కోల్పోయిన వారు.. భవిష్యత్‌లో తలెత్తే ఇబ్బందుల నుంచి కుటుంబ సభ్యుల్ని సురక్షితంగా ఉంచడం, ఉద్యోగం పరంగా ఒత్తిడిను జయించి ఎలా ముందుకు సాగాలో తెలిపిన నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగుల తొలగింపుకు కారణాలు
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే కొవిడ్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం పడింది. కోవిడ్ సమయంలో ఏం ఊహించామో అదే జరుగుతోంది. మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇతర రంగాలు భారీ ఎత్తున కుదేలయ్యాయి. అదే సమయంలో టెక్ రంగం పుంజుకుంది. డిమాండ్‌ను బట్టి వస్తున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయా సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ విభాగం సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం, దాని వల్ల వచ్చిన ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రజల్లో ఖర్చు పెట్టే స్థోమత తగ్గింది. ఆ ప్రభావం టెక్ కంపెనీలపై పడింది. ప్రాజెక్ట్‌లు తక్కువయ్యాయి. అందుకే ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. వెంటాడుతున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా ఉపాధి కోల్పోయిన అభ‍్యర్ధులు స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రస‍్తుతం మన దేశంలో టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ అనుగుణంగా కోర్సులు నేర్చుకోవాలి. ఉద్యోగం కోల్పోయామనే ఆందోళన చెందకుండా అవకాశాల్ని సృష్టించుకోవాలి.’ అని డెలాయిట్ ఇండియా డైరెక్టర్ వంశీ కరవాది తెలిపారు.
భారత్‌పై ప్రభావం అంతంత మాత్రమే.. కానీ
ప‍్రపంచ దేశాలల్లో ఉద్యోగుల తొలగింపులతో పోలిస్తే భారత్‌పై ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో మనదేశంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదన్నారు వంశీ కరవది. కానీ భారత్‌లో ఆటోమెషిన్, ఉద్యోగి పనితనం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై పనిచేస్తున్న విభాగాల్లోని ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని పేర్కొన్నారు.
ఉద్యోగం కోల్పోతే వ్యక్తిగతంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దని, ఉద్యోగం పోగొట్టుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు ఇచ్చిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి.
మీ నైపుణ్యంపై ప్రభావం పడకూడదు
సంస్థ తొలగిస్తే ఆ ప్రభావం ఉద్యోగి పనితీరుపై పడకూడదు. తొలగింపులు అనేవి మార్కెట్ అస్థిరతకు అనుగుణంగా ఉంటాయి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే అది మీ పనితీరు, మీ సామర్ధ్యాల వల్ల కాదని గుర్తుంచుకోవాలి.
అవసరం అయితే షార్ట్ టర్మ్ ఆన్‌లైన్ కోర్స్‌లు నేర్చుకొని కొత్త కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఆ నైపుణ‍్యాల వల్ల తాత్కాలికంగా ఎలాంటి లాభం లేకపోవచ్చు. భవిష్యత్‌లో ఉపయోగపడతాయి. - నేహా బగాహారియా జాబ్స్ ఫర్ హర్ ఫౌండర్ - సీఈవో
జాబ్ పోయిందని మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆర్ధిక మాంద్యం భయాలలో ఇదొక భాగమనే గుర్తుంచుకోవాలి’ - సుమిత్ సబర్వాల్, టీం లీజ్ హెచ్‌ఆర్ టెక్నాలజీ సీఈవో
మీ బలాల్ని గుర్తించడం
ఉద్యోగి వారి బలాల (Strength) ఆధారంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వారి బలహీనతలు కాకుండా.. బలాలేంటో తెలుసుకోవాలి. ఆ బలాలు ఎవరో చెబితే.. తెలుసుకోవడం కాదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా స్కిల్స్‌ను పెంచుకోవాలి. - సుధాకర్ రాజా, ఫౌండ్ అండ్ సీఈవో టీఆర్‌ఎస్‌టీ
అప్పుల జోలికెళ్లొద్దు
ఉపాధి కోల్పోయామని ఎక్కువ వడ్డీతో అప్పు చేసే ప్రయత్నం చేయొద్దు. పొదుపును అలవాటు చేసుకోవాలి. ఉద్యోగం చేసే సమయంలో దాచిపెట్టుకున్న సేవింగ్స్‌ను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి.
మానసికంగా దృఢంగా ఉండాలి
సంస్థ తొలగించిన ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఉద్యోగం పోతే ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. భవిష్యత్ అవకాశాల గురించి చర్చించాలి. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగిస్తూ నెట్ వర్క్‌ను పెంచుకోవాలి
నెట్ వర్కింగ్‌పై ఫోకస్
ఉద్యోగం పోయిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారి నెట్‌వర్క్‌పై ఫోకస్ చేయాలి. అంటే వారు ఏ రంగంలో నిష్ణాతులో .. ఆ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌తో లింక్డిన్‌లో కనెక్ట్ అవ్వాలి. స్నేహితుల వాట్సాప్ గ్రూప్స్‌లో జాబ్స్ గురించి తెలుసుకోవాలి. అలా నెట్ వర‍్కింగ్‌పై దృష్టి సారించడం వల్ల జాబ్స్ త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో 80 శాతం ఉద్యోగాలు నెట్ వర్కింగ్ ద్వారా అభ్యర్ధులు ఉద్యోగాలు సాధిస్తున్నట్లు తేలింది.
చదవండి👉 వైరల్: ‘ట్విటర్‌లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment