gold investments
-
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
దీపావళి పండగను పురస్కరించుకుని ధన్‌తేరాస్ సందర్భంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రిలయన్స్ గ్రూప్ అవకాశం కల్పిస్తోంది. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్స్ యాప్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసేలా చర్యలు చేపట్టింది. ముదుపర్లు, వినియోగదారులు నేరుగా ఈ యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్మార్ట్ గోల్డ్ ఫీచర్‌తో డిజిటల్ రూపంలో కేవలం రూ.10తో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ ప్రకటనలో తెలిపింది.నేరుగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి జియో ఫైనాన్స్ యాప్ ద్వారా 0.5 గ్రాములు, 1 గ్రా., 2 గ్రా., 5 గ్రా., 10 గ్రా. బరువుగల బంగారం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన బంగారం అందిస్తామని తెలిపింది. గోల్డ్‌లో మదుపు చేసేందుకు మరో మార్గాన్ని కూడా జియో ఫైనాన్స్ అందుబాటులో ఉంచింది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!కస్టమర్లు రూ.10 అంతకంటే ఎక్కువ పెట్టుబడితో డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇలా కొంతకాలం మదుపు చేసిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రెడీమ్ చేసుకోవచ్చని చెప్పింది. -
బంగారంపై పెట్టుబడి లాభదాయకమేనా..!
-
బంగారం బంగారమే
కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు), డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్స్ మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్ ఈటీఎఫ్ ధర ఏరోజుకారోజు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్పెన్స్ రేషియో కింద ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పెన్స్ రేషియో.. తిరిగి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ఫామ్లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్జీబీ 2016– సిరీస్1 బాండ్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్ఎస్ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్ తన వద్దనున్న బాండ్‌ను ఆర్బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ). కాకపోతే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్ తక్కువ కనుక మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది. -
సంపదలో 6 శాతం పుత్తడికి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌తోపాటు చైనాకు చెందిన అల్ట్రా–హై నెట్ వర్త్ వ్యక్తులు (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) గత సంవత్సరం పెట్టుబడి పెట్టదగిన సంపదలో 6 శాతం బంగారంలో ఉంచారని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ‘8 శాతం కేటాయింపులతో ఆస్ట్రేలియాకు చెందిన యూహెచ్ఎన్డబ్ల్యూఐలు తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా సగటు 3 శాతం కాగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 4 శాతంగా ఉంది. పెట్టుబడి పెట్టదగిన సంపదలో బంగారానికి భారతీయులు చేసిన కేటాయింపులు 2018లో 4 శాతం నమోదైంది. సంవత్సరాలుగా పుత్తడి అందించిన గణనీయమైన రాబడి ఈ పెరుగుదలకు కారణం. 2018–19 నుంచి 2022–23 మధ్య పసిడి 69 శాతం కంటే ఎక్కువగా రాబడిని అందించింది. మహమ్మారి తక్కువ వడ్డీ రేటుకు దారితీసింది. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు అనుసరించిన సులభ నగదు లభ్యత వ్యూహం ధరలను భారీగా పెంచింది’ అని నివేదిక వివరించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో స్థిరత్వాన్ని అందించే, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనాలను ఆశ్రయిస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. -
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
బంగారంలో తగ్గిన ఆదాయాలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్‌తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే.. ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం యూఎస్ ఫెడ్ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్‌ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి. నిల్వలు పెంచుకోవడం.. సెంట్రల్ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు 2022 నవంబర్‌లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. కాయిన్లు, ఆభరణాల డిమాండ్ కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు. 2023పై అంచనాలు అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్‌కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్ ఇండెక్స్ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన. ప్రథమేష్ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ -
PRE-BUDGET 2023: గోల్డ్ ఈటీఎఫ్‌లకు ప్రోత్సాహమివ్వండి
న్యూఢిల్లీ: ఫండ్స్ ద్వారా పసిడిలో పెట్టుబడులు పెట్టేలా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు తగు చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కోరింది. ఇందుకోసం గోల్డ్ ఈటీఎఫ్‌లపై పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. 2023–24 బడ్జెట్‌కు సంబంధించి ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ ఈ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. వీటి ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్‌లు, అలాగే తమ నిధుల్లో 90 శాతానికి మించి పసిడి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్)పై ప్రస్తుతం 20 శాతంగా ఉన్న దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ)ను ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతానికి తగ్గించాలని కోరింది. ప్రత్యామ్నాయంగా, ఎల్టీసీజీ ట్యాక్సేషన్ ప్రయోజనాలు పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌ల హోల్డింగ్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక్క ఏడాదికి అయినా తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి పసిడి పథకాలకు పన్నుపరమైన ప్రయోజనాలు కల్పిస్తే, ఆర్థికంగా అంతగా సమర్ధమంతం కాని భౌతిక పసిడికి ప్రత్యామ్నాయ సాధనంగా వాటికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భౌతిక రూపంలోని బంగారంలో పెట్టుబడులు తగ్గించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది‘ అని యాంఫీ పేర్కొంది. బ్రిటన్ తదితర దేశాల్లో ఇలాంటి విధానాలు అమల్లో ఉన్నట్లు వివరించింది. ఆయా దేశాల్లో పెట్టుబడియేతర బంగారంపై 20 శాతం వ్యాట్ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్) విధిస్తుండగా బంగారంలో పెట్టుబడులపై మాత్రం ఉండటం లేదని తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇతరత్రా పసిడి పెట్టుబడుల సాధనాల తరహాలోనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తోంది. మరిన్ని ప్రతిపాదనలు.. ► ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లను కూ డా ఈక్విటీ ఆధారిత ఫండ్స్ పరిధిలోకి చేర్చాలి. ► లిస్టెడ్ డెట్ సాధనాలు, డెట్ మ్యుచువల్ ఫండ్స్‌పై పన్నులు సమాన స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► అలాగే ఇంట్రా–స్కీమ్ మార్పులను (ఒకే మ్యుచువల్ ఫండ్ స్కీమ్ అంతర్గతంగా వివిధ ప్లాన్లు/ఆప్షన్లలోకి పెట్టుబడులను మార్చుకోవడం) ’ట్రాన్స్ఫర్’ కింద పరిగణించరాదు. ఇలాంటి లావాదేవీలకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుండి మినహాయింపునివ్వాలి. ► ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల (ఈఎల్ఎస్ఎస్) తరహాలోనే చౌకైన, తక్కువ రిస్కులతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండే డెట్ ఆధారిత పొదుపు పథకాలను (డీఎల్ఎస్ఎస్) ప్రవేశపెట్టేందుకు ఫండ్స్‌ను అనుమతించాలి. ► ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్‌డీల తరహాలోనే అయిదేళ్ల లాకిన్ వ్యవధితో డీఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు వర్తింపచేయాలి. ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ల్లో రూ. 1.5 లక్షల వరకూ పెట్టుబడులకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటున్నాయి. ► ఫండ్ నిర్వహణ కార్యకలాపాలను రిజిస్టర్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీ) బదలాయించేందుకు బీమా కంపెనీలన్నింటినీ అనుమతించాలి. అలాగే బీమా కంపెనీలకు ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడానికి ఏఎంసీలకు కూడా అనుమతినివ్వాలి. ► పింఛన్లకు సంబంధించి ఫండ్ ఆధారిత రిటైర్మెంట్ పథకాలను ప్రవేశపెట్టేందుకు మ్యుచువల్ ఫండ్స్‌కు అనుమతినివ్వాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)కు ఇచ్చే పన్ను ప్రయోజనాలను వీటికి కూడా వర్తింపచేయాలి. బడ్జెట్ సెషన్లో డేటా బిల్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందగలదని భావిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. బిల్లు ముసాయిదాలోని నిబంధనలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఉగ్రవాద, సైబర్ ముప్పులతో పాటు అంతర్జాతీయంగా యుద్ధ విధానాలు మారుతుండటాన్ని పరిగణనలోకి తీసుకునే నిబంధనల రూపకల్పన జరిగిందని మంత్రి చెప్పారు. బిల్లులో ప్రతిపాదించిన పర్యవేక్షణ సంస్థ డేటా ప్రొటెక్షన్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తిపై వ్యక్తమవుతున్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వ్ బ్యాంక్, సెబీ వంటి నియంత్రణ సంస్థల తరహాలోనే దీనికి కూడా సంపూర్ణ స్వతంత్రత ఉంటుందని పేర్కొన్నారు. -
TAX SAVINGS: బంగారం .. సొంత ఇల్లు.. జాగా..
చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు .. అయ్యా సేవింగ్స్ బోలెడంత ఉన్నాయి .. అబ్బాయి అమెరికా నుండి పంపారు. అక్కడ సంవత్సరానికి రూపాయి కూడా వడ్డీ రాదు. ఇండియాలో ఎక్కువ ఆదాయం వస్తుంది .. మమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు .. ఎంతవరకు చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో .. ఈ వారం ‘ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్‘లో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న .. లేదా చేసిన సేవింగ్స్‌ను ఎలా పొదుపు చేశారన్న దానిపై మీరు వివరణ ఇవ్వాలి. అది పన్ను చెల్లించగా మిగిలిన మొత్తమా .. పీఎఫ్ విత్డ్రాయలా, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తమా, జీవిత బీమా నుండి వచ్చిందా .. మీ పుత్రరత్నం విదేశాల నుండి మీకు పంపినదా .. ఏదైనా ఫర్వాలేదు. సోర్సు అంటూ ఒకటి ఉండాలి. అదీ పక్కాగా ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఉండి తీరాలి. ఇక బంగారమా.. భవంతా .. లేక జాగానా.. ఏదైనా మీ ఇష్టం. రాయితీలు లేవ్.. అయినా సరే బంగారం కొనడం వల్ల ఎటువంటి రాయితీలు, మినహాయింపులు రావు. ఇన్‌కం ట్యాక్స్ చట్టంలో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. మీరు కొన్న బంగారం ధరకి ‘సోర్స్‘ ఉండాలి. వివరణ ఇవ్వాలి. బంగారం ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. ఈ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. అమ్మతే లాభం వస్తే ఆ లాభాన్ని లేదా నష్టాన్ని మూలధనం లాభనష్టాల్లా భావిస్తారు. దీర్ఘకాలికం అయితే 20 శాతం రేటు చొప్పున పన్ను వేస్తారు. దీర్ఘకాలికం కాకపోతే శ్లాబుని బట్టి రేటు ఉంటుంది. సెస్సు అదనం. బంగారమైనా ఆభరణాలైనా ఇదే తీరు. కొంటున్నప్పుడు ఎటువంటి రాయితీలు రావు. అమ్మినప్పుడు పన్ను భారం ఉంటుంది. పన్ను భారం చెల్లించితే మిగతా చాలా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ .. ఆలికి సింగారం.. అదనుకి బంగారం అన్న పాత సామెత ఈ రోజుకీ వర్తిస్తుంది. జాగా విషయంలో జాగా/ఫ్లాటుకి కూడా బంగారంలాగానే. కొన్నందుకు ఎటువంటి మినహాయింపు ఉండదు. అమ్మితే పన్ను భారం ఉంటుంది. వేలల్లో కొని కోట్లలో అమ్మిన సందర్భాలు ఉన్నా ఎంతో లాభం ఉంటుంది. అందులో 20 శాతం ప్రభుత్వానికి పోతుంది. మిగతా అంతా మనదే. ఇంత పెద్ద మొత్తంతో చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సొంతిళ్లు సొంత ఇల్లు ఎంతో మందికి కల. ఆ కల సాకారం అవ్వటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు. ఇంటి గురించి అంటే ఫ్లాటు లేదా ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం వంటివి వస్తాయి. సేవింగ్స్ / స్వంత డబ్బులతో కొంటే ఎటువంటి రాయితీలు రావు. ఎటువంటి మినహాయింపులు రావు. అప్పు చేసి కడితే / కొంటే ఆ అప్పు మీద వడ్డీ కట్టాల్సి ఉంటే .. వడ్డీకి మినహాయింపు ఉంది. అప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తికి ‘సోర్స్‘ సామర్థ్యం ఉండాలి. కాగితాలు ఉండాలి. ఈ అప్పుని తిరిగి చెల్లించినందుకు గాను కూడా మినహాయింపు పొందవచ్చు. రుణం చెల్లించేటప్పుడు నిర్దేశించిన వారి నుంచే అప్పులు తీసుకుని ఉండాలి. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వడ్డీ నిమిత్తం రూ. 2,00,000 దాటితే ఇవ్వరు. మీరే ఆలోచించుకోండి. నిర్ణయం ఏదైనా చట్టబద్ధం అవ్వాలి. బ్లాక్ వ్యవహారాలు చేయకండి. మీ కుటుంబ అవసరాలు, ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
బంగారం మంచి పెట్టుబడి సాధనం కాదు! పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి?
నేను ఏటా ఒక లక్ష రూపాయల చొప్పున 15 ఏళ్లపాటు సావరీన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తుందా? – సుధాకర్ దీనికి జవాబు తెలుసుకోవడానికి ముందు నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్‌బీస్ పథకాన్ని ఒక సారి పరిశీలించాలి. గోల్డ్ ఫండ్స్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పథకం ఇది. ఇందులో రాబడులు 10 శాతానికి పైనే ఉన్నాయి. ఇది మంచి రాబడే. కానీ ఇదే ఈటీఎఫ్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే రాబడుల్లో అధిక శాతం గడిచిన నాలుగేళ్లలోనే వచి్చనట్టు గుర్తించొచ్చు. అంటే బంగారం అన్నది ఎంతో అస్థిరమైన పెట్టుబడి సాధనంగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ పథకం ప్రతికూల పనితీరు చూపించిన కాలాలను పరిశీలించినా.. ఒక వారంలో 13 శాతం నష్టం, ఒక ఏడాదిలో 20 శాతం నష్టం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే బంగారం ధరలు ఒక వారంలో 13 శాతం, ఒక ఏడాదిలో 20 శాతం పడిపోతాయని అర్థం చేసుకోవచ్చు. చాలా మంది బంగారంలో పెట్టుబడి మంచిదని భావిస్తుంటారు. కానీ, ఇది కూడా ఒక అస్థిరతలతో కూడిన సాధనం. బంగారంపై రాబడి ద్రవ్యోల్బణానికి దీటుగా ఉండకపోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడినిచ్చేది అయితే అది ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. కానీ బంగారం అన్నది లాకర్లో ఉండేది. ప్రధానంగా డిమాండ్, సరఫరా దీని ధరలను నిర్ణయిస్తుంటుంది. మార్కెట్లు కుప్పకూలుతున్న తరుణంలో పెట్టుబడులకు సంబంధించి ఆకర్షణీయమైన సాధనం ఇది. మార్కెట్లు పడుతున్న సమయాల్లో బాండ్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లలోనూ.. కంపెనీలు దివాలా తీస్తే తమ పెట్టుబడి వెనక్కి రాదన్న ఆందోళన ఉంటుంది. బంగారం మంచి పెట్టుబడి సాధనం కాదు. ప్రపంచ భవిష్యత్తు విషయమై మీరు ఆశావహంగా ఉంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయకూడదు. పిల్లల విద్య కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు లాభదాయకమేనా? – ఆశా పేర్లను చూసి అనుసరించడం కానీ, మోసపోవడం కానీ చేయవద్దు. చిన్నారి కోసం పెట్టుబడులు పెడుతున్నట్టు అయితే అది చేతులు దులుపుకునేట్టు ఉండకూడదు. మీ పిల్లల కోసం ఏ తరహా పెట్టుబడి అనుకూలంగా ఉంటుంది? వారు చాలా చిన్న వయసులోనే ఉంటే ఈక్విటీ ఫండ్స్ అనుకూలం. మీరు తగినంత అనుభవం ఉన్న ఇన్వెస్టర్ అయితే వీలైనంత ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. 10–12 ఏళ్లపాటు పిల్లల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారు కాలేజీలోకి అడుగు పెట్టే సమయం వస్తుంది. దానికంటే మూడేళ్ల ముందు సన్నద్ధం కావాలి. మొదటి సంవత్సరం కాలేజీకి కోసం కావాల్సిన మొత్తాన్ని మూడేళ్ల ముందే వెనక్కి తీసుకోవాలి. కాలేజీ రెండో సంవత్సరం కోసం కావాల్సిన మొత్తాన్ని ఏడాది విరామం తర్వాత తీసుకోవాలి. అప్పుడే మార్కెట్ పరిస్థితులపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుంది. ఎవరైనా కానీ, పిల్లల విద్య కోసం ఈక్విటీల్లో మదుపు చేస్తున్నట్టు అయితే ఈ విధానాన్ని అనుసరించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు ఆఫర్ చేసే చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్లు అంత అర్థవంతమైనవి కావు. ఎందుకంటే అనవసరమైన నిర్బంధాలు వీటిల్లో ఉండడమే. తాను పిల్లల కోసం పెట్టుబడులను చైల్డ్ ఫండ్‌లోనే పెడుతున్నానన్న భావనతో చాలా మంది ఉంటారు. కానీ, మంచి పథకం ఎంపిక చేసుకోతగిన సామర్థ్యం మీకు ఉంటే, తగినంత క్రమశిక్షణతో వ్యవహరించేట్టు అయితే అప్పుడు ఎటువంటి ప్రతికూలతలు కనిపించవు. ఏ ఫండ్ అయినా చైల్డ్ ఫండ్‌గా అనిపిస్తుంది. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
బంగారం..పెట్టుబడిగా మంచి సాధనమేనా?
ప్రశ్న: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? - రాజేష్ సమాధానం: మార్కెట్లు ఆందోళనకరంగా కనిపించొచ్చు లేదా పడిపోతాయని అనిపించొచ్చు. లేదంటే ర్యాలీని కోల్పోవచ్చు. కనుక వీటిని పట్టించుకోకుండా ప్రతీ నెలా ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే అంత మేరకు వెంటనే ప్రారంభించాలి. మీ పెట్టుబడుల విలువను చూడకుండా మూడేళ్లపాటు అనుకున్నట్టుగా ఇన్వెస్ట్‌చేస్తూ వెళ్లండి. ఆరంభం ఇలానే ఉండాలి. ఒకవేళ సరైన సమయంలో ప్రవేశించాలని, మార్కెట్ పతనం కోసం వేచి చూస్తే ఆ పనిచేయడం కష్టమే అవుతుంది. మార్కెట్లు పడిపోవడం మొదలవగానే అప్పుడు కూడా పెట్టుబడులు పెట్టకుండా ఒక స్థాయి వరకు పడిపోయి స్థిరపడే వరకు చూద్దాంలే అని అనుకుంటారు. ఈ తరహా ఆలోచనల నుంచి బయటకు రావాలి. ప్రారంభంలో ప్రతీ రోజూ మార్కెట్ కదలికలను చూడకుండా పెట్టుబడులు పెడుతూ వెళ్లాలి. ప్రశ్న: బంగారాన్ని పెట్టుబడిగా ఎందుకు పరిగణిస్తుంటారు? ఇది ఎంత భద్రం, పెట్టుబడిగా ఇది మంచి సాధనమేనా? - అర్చనా సావిత్రి సమాధానం: బంగారం అన్నది భౌతిక రూపంలో ఉంటూ, ధరించేందుకు అనుకూలమైనది కావడంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాల విలువ కూడా తోడవుతుంది. చారిత్రకంగా చూస్తే భూమి తప్ప బంగారం మాదిరిగా విలువ కాపాడుకోగలిగినది మరొకటి లేదు. అయితే, కష్ట సమయాల్లో బంగారం మాదిరి భూమిని వినియోగించుకోవడం కష్టం. బంగారం నిజంగా నిల్వ చేసినా, విలువతో ఉండే సాధనమే. కానీ, పెట్టుబడులకు ఇది మంచి సాధనం కాదు. దీనికంటే కూడా ఈక్విటీ, స్థిరాదాయ పథకాలు మరింత ఉత్పాదకతతో ఉంటాయని నేను నమ్ముతాను. బంగారం ఆభరణాల గురించి మాట్లాడేట్టు అయితే వాటిని వినియోగంగానే చూడాల్సి ఉంటుంది. ఆభరణాలపై తయారీ చార్జీలు, లావాదేవీల, ఇతర చార్జీలన్నవి 10-20 శాతం వరకు ఉంటాయి. అంటే రూ.లక్ష బంగారం కొంటున్నారంటే నిజంగా రూ.80,000 విలువ బంగారాన్నే పొందుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ప్రశ్న: పనిచేసే సంస్థ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్నప్పటికీ ఉద్యోగి సొంతంగానూ ఒక హెల్త్‌ప్లాన్ కలిగి ఉండాలనడం ఎందుకని?- శ్రీరామ్ రామనాథన్ సమాధానం: ఇందుకు రెండు కారణాలను మీరు గమనించాల్సి ఉంటుంది. మీ సంస్థ ఇస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీ సంపూర్ణంగా, తగినంతగా లేకపోవడం. ఉదాహరణకు రూ.3 లక్షల కవరేజీ ఇస్తుందనుకుంటే..అది చాలదనే చెప్పుకోవాలి. కనీసం రూ.5 లక్షల కవరేజీ అయినా అవసరం. అలాగే, పనిచేసే సంస్థ ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ సమగ్రంగా లేకపోవచ్చు. ఉదాహరణకు మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వారికి బీమాను పనిచేసే సంస్థ ఇవ్వకపోవచ్చు. లేదా వారికి కూడా తీసుకోవాలంటే ప్రీమియం భారీగా ఉండొచ్చు. అలాగే, మీకు అవసరమైన అన్ని రకాల కవరేజీ ఆప్షన్లు ఉండకపోవచ్చు. వ్యక్తిగతంగా అయితే మీ అవసరాలను తీర్చే అనుకూలమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఉద్యోగం మారినా, బీమా రక్షణ ఆగిపోకుండా చూసుకోవచ్చు. ప్రశ్న: మ్యూచువల్ ఫండ్స్ తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీల నుంచి అందుకున్న డివిడెండ్‌పై పన్ను చెల్లించాలా? ఎందుకు? - ఆర్కే శర్మ సమాధానం: మ్యూచువల్ ఫండ్స్ పన్నులు చెల్లించవు. రెండేళ్ల క్రితం వరకు డివిడెండ్ పంపిణీ పన్ను అమల్లో ఉండేది. వ్యక్తిగత ఇన్వెస్టర్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా డివిడెండ్ ఎవరికి పంచినా దానిపై కంపెనీలే పన్ను లు చెల్లించేవి. దీంతో ఇన్వెస్టర్ చేతికి వచ్చే డివిడెండ్ పూర్తిగా పన్ను రహితంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఇందులో మార్పు వచ్చింది. డివిడెండ్ స్వీకరించే ఇన్వెస్టరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్నులు చెల్లించవు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బంగారం ఈటీఎఫ్‌ల ‘తళతళ’
న్యూఢిల్లీ: బంగారంపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి మరింత అధికమైంది. దీన్ని సూచిస్తూ జనవరిలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 45 శాతం అధికంగా రూ.625 కోట్ల మేర వచ్చాయి. దీంతో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ జనవరి చివరికి 22 శాతం అధికమై రూ.14,481 కోట్లకు చేరుకుంది. 2020 డిసెంబర్ చివరికి బంగారం ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.14,174 కోట్లుగా ఉండడం గమనార్హం. 2020 నవంబర్ నెలలో రూ.141 కోట్లు బంగారం ఈటీఎఫ్‌ల నుంచి నికరంగా బయటకు వెళ్లిపోగా.. ఆ తర్వాత నుంచి ఈ విభాగం పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. 2020 డిసెంబర్లో నికరంగా రూ.431 కోట్ల మేర పెట్టుబడులు బంగారం ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు యాంఫి గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: పోకో ఎం3 కాసుల వర్షం! శామ్సంగ్ డేస్ సేల్.. భారీ తగ్గింపు! -
పసిడి పెట్టుబడికి దారేదీ..?
బంగారం అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ఆభరణాల రూపంలో మహిళలు, పెట్టుబడి రూపంలో ఇన్వెస్టర్లు గోల్డ్‌ను కొంటుంటారు. ఈమధ్య కాలంలో ఆన్లైన్లో గోల్డ్ కొనడమూ పెరిగింది. మరి, డిజిటల్ రూపంలో బంగారం కొనడం ఉత్తమమేనా? బంగారంలో పెట్టుబడి భద్రంగా ఉండాలంటే? రెట్టింపు రాబడి రావాలంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బంగారం.. ఇవీ భారతీయుల పెట్టుబడి సాధనాలు. గోల్డ్‌లో పెట్టుబడులు అత్యంత భద్రమైనవని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ వ్యాలెట్ ద్వారా బంగారాన్ని డిజిటల్‌గా కొనడం ఒక మార్గం. అయితే ఇలాంటి ఉత్పత్తుల కొనుగోళ్లు రెగ్యులేటరీ పరిధిలోకి రావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణకు సెబీ తరహాలో బంగారాన్ని విక్రయించే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షించడానికి ఎలాంటి నియంత్రణ సంస్థ లేదు. రెగ్యులేటరీ నిబంధనలు వర్తించే, సురక్షితమైన బంగారు పెట్టుబడులు ఏంటో ఓసారి చూద్దాం... సావరిన్ గోల్డ్ బాండ్స్ సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. ఒక గ్రాము లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన బాండ్లను ఇస్తుంది. ఎస్జీబీ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. బాండ్ ముఖ విలువపై సంవత్సరానికి 2.5 శాతం కూపన్‌తో సార్వభౌమ హామీని కలిగి ఉంటారు. ఇది బాండ్ మెచ్యూరిటీ విలువ, బంగారం ధరల మీద ఆధారపడి ఉంటుంది. బంగారం రాబడిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్గా గుర్తింపు పొందాయి. ఈ బాండ్ల మెచ్యూరిటీ వరకు గనక ఇన్వెస్టర్ వెయిట్ చేస్తే.. వ్యక్తిగత పెట్టుబడిదారులకు మూలధన లాభాల పన్ను మినహాయించబడుతుంది. అయితే మెచ్యూరిటీ సమయం ఎనిమిది సంవత్సరాలుగా ఉంది. ఈ బాండ్లను ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రీ–మెచ్యూర్ ఎగ్జిట్‌కు అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు ఈ బాండ్లను ఆర్బీఐకి కాకుండా సెకండరీ మార్కెట్లో విక్రయించినట్లయితే మూలధన లాభాలపై 20 శాతం (ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి) పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సడెన్‌గా ప్రీ–మెచ్యుర్ కంటే ముందే ఎగ్జిట్ కావాలనుకుంటే మాత్రం.. కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా బ్రోకర్‌ను సంప్రదించాలి. ఐదేళ్లు పూర్తికాకముందే పెట్టుబడిదారులు ఎస్జీబీలను సెకండరీ మార్కెట్లో విక్రయించవచ్చు. కానీ, సంబంధిత ఇన్వెస్టర్ మూలధన లాభాల పన్నును చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. 36 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం ఉంచినట్లయితే స్లాబ్ రేట్, 36 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచినట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్‌తో కలిపి 20% క్యాపిటల్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీలో ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీల విషయంలో ప్రధాన సమస్య ఏంటంటే.. సెకండరీ మార్కెట్లో కొనడం లేదా అమ్మడం అంత సులువైన అంశం కాదు. పెట్టుబడిదారుడు, బ్రోకర్‌కు ఒకే డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ)తో డిపాజిటరీ అకౌంట్ ఉంటే తప్ప ఎస్‌జీబీల బదిలీ కఠినం. ఎందుకంటే ఇంటర్ డిపాజిటరీ బదిలీని అనుమతించని ఎస్జీబీలను మాత్రమే ప్రభుత్వ సెక్యూరిటీలుగా పరిగణిస్తారు కాబట్టి! ఎస్జీబీలలో ఇంటర్ డిపాజిటరీ బదిలీకి ఆర్బీఐ అనుమతులు ఇచ్చినప్పటికీ.. డిపాజిటరీలు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పూర్తిగా క్రమబద్ధీకరించలేదు. రిటైల్ పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పన్ను విధానం ఉండగా.. వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మాత్రం ఎస్‌జీబీల ఎంట్రీ, ఎగ్జిట్‌లో ప్రతికూలతలున్నాయి.ఎస్జీబీలలో సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ పరిమితం. కొత్త ఆఫర్లు తెరిచినప్పుడు మాత్రమే ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ బైబ్యాక్ విండోను తెరిచినప్పుడు ఆయా బాండ్లను విక్రయించాల్సి ఉంటుంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లలోని గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. ఈటీఎఫ్‌లు ఎస్‌జీబీల కంటే కొంచెం తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ, బంగారం మీద కాగితపు రహిత, దీర్ఘకాలిక పెట్టుబడులకు, స్నేహపూర్వక ఎంపికలకు మాత్రం ఈటీఎఫ్‌లు సరైనవి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) జారీ చేసిన ప్రతి యూనిట్ ఈటీఎఫ్.. భౌతికంగా కొనుగోలు చేసిన బంగారానికి సమానవైన విలువను కలిగి ఉంటుంది. ఏఎంసీలను సెబీ రిజిస్టర్డ్ కస్టోడియన్ ధ్రువీకరిస్తారు. బంగారాన్ని భద్రపరిచే బాధ్యత కస్టోడియన్దే. గోల్డ్ ఈటీఎఫ్‌లను స్వతంత్ర ఖజానా ప్రొవైడర్ నిల్వ చేస్తారు. ఈయన రోజువారీ రికార్డ్లను నిర్వహిస్తుంటాడు. బార్ నంబర్, స్వచ్ఛత ధ్రువీకరణ పత్రాలతో రోజువారీ బంగారం ధరల కదలికలను ట్రాక్ చేస్తుంటాడు కూడా. మొబైల్ వాలెట్స్ జారీ చేసినవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేసే గోల్డ్ ఈటీఎఫ్‌ల నెలవారీ వివరాలను సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి బహిర్గత పరచాల్సి ఉంటుంది. ఎంఎఫ్‌ల గోల్డ్ హోల్డింగ్స్‌లకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ఈటీఎఫ్‌లలో టాస్క్ ఏంటంటే.. ఈటీఎఫ్‌ల ప్రధాన సమస్య ఏంటంటే.. ఎస్‌జీబీలతో పోల్చితే ఈటీఎఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎంఎఫ్‌లు ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులను విధిస్తాయి. అన్ని బంగారు ఈటీఎఫ్‌లు సెకండరీ మార్కెట్లో చురుకుగా ట్రేడ్ కావు. అలాగే ధరలు అంతర్లీనంగా నికర ఆస్తి విలువల (ఎన్ఏవీ) కంటే దూరంగా ఉంటాయి. అందుకే పెట్టుబడిదారులు తమ ఎన్ఏవీలకు దగ్గరగా కోట్ చేసే ట్రేడింగ్ వాల్యూమ్స్‌తో గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవటం ఉత్తమం. అంతేకాకుండా ఎస్‌జీబీల మాదిరిగా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద మూలధన లాభాల పన్ను ఉంటుంది. అది భౌతిక బంగారంపై ఎంతైతే పన్ను విధించబడుతుందో అంతే ఉంటుంది. గోల్డ్ ఫ్యూచర్స్... ఇండియాలో అతిపెద్ద సెక్యూరిటీస్ అండ్ కమొడిటీస్ ఎక్స్ఛేంజ్ కంపెనీ మల్టి కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) తీసుకొచ్చిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే గోల్డ్ ఫ్యూచర్స్. ఎంసీఎక్స్‌లో ఒక గ్రాము విలువ నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఎంసీఎక్స్ సెబీ నియంత్రణలో ఉంటుంది. గోల్డ్ పెటల్ అనేది బాగా సక్సెస్ అయిన రిటైల్ గోల్డ్ ఇన్వెస్టర్ కాంట్రాక్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్), లిక్విడ్ ఆర్డర్ బుక్ చేసే వీలుండటమే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రధాన కారణాలని ఎంసీఎక్స్ హెడ్ శివాన్షు మెహతా చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో గోల్డ్ పెటల్ ప్రారంభమైంది. 2019–20లో గోల్డ్ పెటల్ కాంట్రాక్ట్‌లో సగటు రోజువారీ టర్నోవర్ రూ.10,163 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇది అత్యధికంగా రూ.54,415 కోట్లుగా ఉంది. ఇతర రకాల గోల్డ్ పెట్టుబడులతో పోలిస్తే.. గోల్డ్ ఫ్యూచర్స్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పెట్టుబడిదారులు బంగారం విలువ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ విలువలో ఆరు శాతం మార్జిన్‌ను చెల్లించవచ్చు. లేదా పూర్తి విలువను చెల్లించవచ్చు. కాకపోతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా లేదా డెలివరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒప్పంద గడువు ముగిసే సమయానికి పూర్తి విలువను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ ధర, అస్థిరతను బట్టి అదనపు మార్జిన్లను వసూలు చేయవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్‌లో వచ్చే ఆదాయాన్ని కమొడిటీస్ ఇన్‌కమ్‌తో కలుపుతారు. దీనికి స్లాబ్ రేట్‌ను బట్టి పన్ను విధించబడుతుంది. బంగారం... భారతీయులకు బంగారమే భారతీయులకు బంగారం అంటే.. సాంప్రదాయం, సరదా, పెట్టుబడి.. అన్నీ కలిసిన సాధనం. ప్రస్తుతం కరోనా వైరస్‌పరమైన అనిశ్చితి కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పలు మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2,400 కోట్ల మేర పెట్టుబడులు రావడం ఫండ్స్‌కి ప్రాచుర్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. ఫిజికల్‌గా కనీసం ఒక్క గ్రాము బంగారం నాణేన్ని కొనాలంటే రూ. 5,000 దాకా వెచ్చించాల్సి ఉంటోంది. అలా కాకుండా పసిడి ఈటీఎఫ్‌లలో అత్యంత తక్కువగా రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటి ద్వారా నెలవారీ కొద్ది కొద్దిగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. – డీపీ సింగ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ -
బంగారం పెట్టుబడులవైపు అమెజాన్ చూపు..
ముంబై: ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ అన్ని రంగాలలో దూసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డిజిటల్ బంగారు పెట్టుబడులను అమెజాన్ పే ఆహ్వానిస్తోంది. త్వరలోనే వినియోగదారులకు బంగారు పెట్టుబడులను ఆకర్శించే ‘గోల్డ్ వాల్ట్’ను వినియోగదారులకు అందించనుంది. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇటీవల కాలంలో చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ మైపే డిజిటల్ బంగారు సేవలను అందించింది. దేశంలో పేటీఎమ్, ఫోన్‌పే, గూగుల్ఫే, తదతర సంస్థలు ఇది వరకు బంగారు పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చా..?
రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్న బంగారంలో పెట్టుబడులు అధిక రాబడులను ఇస్తాయని బులియన్ పండితులు అంటున్నారు. దేశీయంగా ఎంసీఎక్స్‌లో బంగారం ధర ఈ వారంలో రూ.48,589 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్-19 అంటువ్యాధితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు బంగారం ధరను మరింత మెరిసేలా చేశాయి. అన్ని రకాల అసెట్ క్లాసెస్‌లో కెల్లా బంగారం మ్యూచువల్ ఫండ్లు ఈ ఏడాదిలో 40.39శాతం ఆదాయాల్ని ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.., బంగారంలో పెట్టుబడులు ఎల్లప్పుడు అధిక రాబడులను ఇస్తాయని మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు విశ్వసిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బంగారం ఇచ్చిన బలమైన రాబడుల ట్రాక్ రికార్డును ఇందుకు సాక్ష్యంగా వారు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుత్తడిలో పెట్టుబడి మంచిదే: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి మంచి రాబడులను ఇస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ కమోడిటీ విబాగపు అధిపతి నవ్‌నీత్ ధమాని తెలిపారు. ‘‘బంగారం ధర 2001లో గరిష్టాన్ని తాకిన తర్వాత 240శాతం రాబడిని ఇచ్చింది. అలాగే 2008లో గరిష్ట స్థాయిని తాకినపుడు 170శాతం ఆదాయాన్ని ఇచ్చింది. 2013లోనూ 10గ్రాముల బంగారం రూ.35వేల గరిష్టాన్ని తాకిన సమయంలో పెట్టుబడులను పెట్టిన ఇన్వెస్టర్లకు ధీర్ఘకాలంలో కొంతరాబడి లభించింది. తమ సలహాలు పాటిస్తూ సిప్ల ద్వారా బంగారం ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మాత్రం రెండంకెల రాబడి లభించింది. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేయమని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’’ అని ధావన్ తెలిపారు. పరిమితికి మించొద్దు అయితే పరిమితికి మించి బంగారంలో పెట్టుబడులు మంచిది కాదని బులియన్ పండితులు చెబుతున్నారు. పరిమితికి మించి పసిడిలో పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవని వారంటున్నారు. పోర్ట్ ఫోలియోలో గోల్డ్ ఫండ్లకు 10-15శాతం మాత్రమే కేటాయించాలంటున్నారు. ఇంతకు మించి బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే సిప్ల పద్దతిలో కొనుగోలు చేయడం ఉత్తమమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీ రూపంలో కొంత నగదు చేతిలో ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. డిఫాల్ట్, క్రెడిట్ లాంటి రిస్క్‌లు ఉండవు గత దశాబ్ధ కాలంలో బంగారం తక్కువ క్షీణతను చవిచూసింది. అసెట్ క్లాస్‌గా ఉండే బంగారం ఫండ్లకు డిఫాల్ట్ రిస్క్‌గానీ, క్రెడిట్ రిస్క్‌గా ఉండవని విక్రమ్ ధావన్ తెలిపారు. భారత్‌లో దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం 7-8శాతంగా ఉందని, దీనికి సమానంగా బంగారం రాబడిని ఇచ్చింది. కొన్నేళ్ల నుంచి బంగారం దాని విలువను ఎప్పటికప్పుడూ నిరూపించుకుంటుంది కాబట్టి బంగారంలో కొనుగోళ్లకు మేము మద్దతునిస్తున్నామని ధావన్ తెలిపారు. ర్యాలీకి ఢోకా లేదు కరోనా కేసులు, యూఎస్ ఎన్నికలపై స్పష్టత లేనంత వరకు బంగారం ర్యాలీకి ఏ ఢోకా లేదని అంతర్జాతీయ బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2011, 2008ల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల తరువాత అన్ని అసెట్ క్లాసెస్ కంటే బంగారమే తొలిసారిగా బౌన్స్‌బ్యాక్‌ను చవిచూసిన సంగతి వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
బంగారం మరింత మెరిసే అవకాశం
కరోనా వైరస్ నేపథ్యం... పెట్టుబడిదారులను పసిడివైపు పరుగులు తీసేలా చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మాంద్యంలోకి జారుకుంటున్న పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఈక్విటీల్లో తీవ్ర ఆటుపోట్లు తత్సంబంధ పరిస్థితుల్లో పసిడి తిరిగి తన చరిత్రాత్మక గరిష్ట రికార్డు స్థాయి... ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశాలే సుస్పష్టమవుతున్నాయి. కరోనా కట్టడి జర క్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే, డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5 శాతంపైగా క్షీణతలోకి జారిపోతుందన్న అంచనాలు ఇక్కడ గమనార్హం. అటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతోపాటు, ఇటు వర్థమాన దేశాల విషయంలోనూ ఆర్థిక వ్యవస్థలు క్షీణతనే నమోదుచేస్తాయని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. 12వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో ఒక దశలో పసిడి 1,752 డాలర్ల స్థాయినీ చూడ్డం ఇక్కడ ముఖ్యాంశం. దేశంలోనూ రూ.50 వేలు దాటే అవకాశం అంతర్జాతీయ ధోరణే కాకుండా, డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి భారత్‌లో పసిడికి బలమవుతోంది. ఈ పరిస్థితుల్లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు శుక్రవారం రూ.47,334 వద్ద ముగిసింది. -
మెరిసిన బంగారం
ముంబై: పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం, ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యెల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి వేగంగా పెట్టుబడులు పసిడివైపు మరలుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం ఏకంగా దాదాపు 42 డాలర్లు ఎగసింది. ట్రేడింగ్ ఒక దశలో 1,700 డాలర్లకు 10 డాలర్ల దూరంలో 1,691.56ను తాకింది. ఈ వార్తరాసే రాత్రి 9 గంటల సమయంలో 31.35 డాలర్ల లాభంతో 1,680.15 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర దాదాపు 8 సంవత్సరాల గరిష్టస్థాయి. దేశీయంగా రూపాయి బలహీనత తోడు... ఇక భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణితోపాటు, దేశీయంగా రూపాయి బలహీనత పసిడి పరుగుకు కారణమవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర ఈ వార్త రాసే 9 గంటల సమయంలో రూ.953 లాభంతో రూ.43,619 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో రూ.43,788నూ తాకింది. ఢిల్లీ సహా పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.1,000 వరకూ పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు స్వచ్ఛత పసిడి ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలోనూ ధర దాదాపు రూ.1,000 వరకూ పెరిగి రూ.44,000 పైనే ధర పలికింది. -
కోవిడ్ భయం.. పసిడి పరుగు!
న్యూయార్క్: చైనాలో మొదలై ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... ఇన్వెస్టర్లను బంగారంవైపు తిరిగేలా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెట్టుబడులకు బంగారమే సురక్షిత మార్గమని వారు భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ట్రేడింగ్ ఒక దశలో 1,614.25 డాలర్లను తాకింది. ఇది ఏడేళ్ల కనిష్టస్థాయి. ఈ వార్త రాసే 10 గంటల సమయంలో 1,607 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరోనా భయాలతో ప్రపంచ వృద్ధిరేటు పడిపోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వస్తున్న వార్తలు కూడా పసిడికి బలంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, ఏడాదిలో పసిడి ధర 21 శాతం (1,277.9 డాలర్లు కనిష్టం) పెరిగింది. దేశీయంగానూ జోరు... ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, పెళ్లిళ్ల సీజన్ దేశంలో పసిడి ధరను పెంచుతోంది. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి కూడా పసిడికి బలమవుతోంది. ఈ వార్తరాసే సమయానికి దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర లాభాల్లో రూ.41,470 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో ఈ మెటల్ ధర రూ.462 ఎగసి రూ.42,339కు ఎగసింది. -
పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!
ప్రస్తుతం పెట్టుబడులకు పసిడి సురక్షిత సాధనమేనని నిపుణుల అంచనా. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర 20వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్‌కు (31.1గ్రా) 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు, అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ప్రత్యేకించి వినియోగ గణాంకాలు సానుకూలత, డాలర్ పటిష్టత వంటి అంశాలు స్వల్పకాలంలో పసిడి ధర దిగువకు రావడానికి కొంత దారితీసినా.. 1,450 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది వాదన. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ధోరణుల వల్ల పసిడి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్‌లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్‌లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.