
ఈ ఏడాది 12 శాతం పెరుగుదల
గతేడాది 27 శాతం లాభం
ట్రంప్ టారిఫ్‌లు, ద్రవ్యోల్బణ భయాలు
ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్
సెంట్రల్ బ్యాంక్‌లు జోరుగా షాపింగ్
న్యూఢిల్లీ: బంగారం మురిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు అందరికీ పసిడిపై పెట్టుబడి కనక వర్షం కురిపిస్తోంది. 2024లో 27 శాతం రాబడితో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన స్థానంలో నిలిచిన బంగారం.. ఈ ఏడాదీ తన జోరును కొనసాగిస్తోంది. రెండు నెలల్లోనే 12 శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,900 డాలర్లను దాటిపోయింది. దేశీయంగా 10 గ్రాముల ధర రూ.89,000 మార్క్‌పైకి చేరుకుంది. జనవరి 1న రూ.79,000 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి చూస్తే రూపాయి మారకంలోనూ 13 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రాబడుల్లో బంగారమే ముందుంది. టారిఫ్‌ల విషయంలో ఏ దేశాన్ని విడిచి పెట్టేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలు, వాణిజ్య యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయాలు, సెంట్రల్ బ్యాంకుల రెండు చేతులా కొనుగోళ్లు.. వెరసి బంగారం ధరలు ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు.
ఎన్నో అంశాలు..
ఎక్కడైనా ధరలను నిర్ణయించేది డిమాండ్–సరఫరా అన్న విషయం తెలిసిందే. బంగారం ఉత్పత్తి గడిచిన కొన్నేళ్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కానీ, అదే సమయంలో డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఆభరణాలు, పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల రూపంలో పసిడికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్త డిమాండ్‌లో 50 శాతం ఆభరణాల రూపంలోనే ఉంది. టెక్నాలజీ, పారిశ్రామిక రంగం వినియోగం 5 శాతంగా ఉంది. 25 శాతం పెట్టుబడుల రూపంలో, మరో 20 శాతం సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు రూపంలో డిమాండ్ నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఆభరణాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఆభరణాల డిమాండ్‌లో చైనా, భారత్ బలమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఎందుకంత డిమాండ్?
కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరిగేదే కానీ (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) తరిగేది కాదు. ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి దీర్ఘకాలంలో తన విలువను పెంచుకుంటుందని చరిత్ర చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు తమ విదేశీ మారకం ఆస్తుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి ప్రాతినిధ్యాన్ని పెంచడం ఇందు వల్లే. 20 ఏళ్ల క్రితం ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోతగిన వస్తువులను.. నేడు కూడా ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోవచ్చు. కరెన్సీ విషయంలో అది అసాధ్యం. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో కరెన్సీ విలువ తగ్గుతుంటుంది. దీనికి విరుద్ధంగా పసిడి విలువ పెరుగుతుంది. అందుకే దీన్ని హెడ్జింగ్ సాధనంగా, ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. 2001 సెపె్టంబర్ 11 ఉగ్రదాడి, 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయాల్లో ఇన్వెస్టర్లు స్టాక్స్, ఇతర సాధనాల కంటే బంగారంలో పెట్టుబడులకే మొగ్గు చూపించారు. కానీ, ఇలాంటి అనిశ్చితుల్లో బంగారం ధరలు తాత్కాలికంగా ర్యాలీ చేసి, పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న సంకేతాలు కనిపించగానే మళ్లీ చల్లబడుతుంటాయి.
ఈ విడత పరిస్థితులు భిన్నం..
కానీ, కరోనా విపత్తు తర్వాత నుంచి చూస్తే.. పసిడి ధరలు పెద్దగా పడిపోకుండా స్వల్ప విరామంతో ర్యాలీ చేస్తుండడాన్ని గమనించొచ్చు. కరోనా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం పరిస్థితులను మార్చేసింది. రష్యా చర్యను వ్యతిరేకిస్తూ విదేశాల్లో రష్యాకు ఉన్న ఫారీన్ గవర్నమెంట్ బాండ్ హోల్డింగ్స్‌ను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి. అంటే రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారకం ఆస్తుల్లో ఈ మేరకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది భారత్, చైనా సహా పలు సెంట్రల్ బ్యాంక్‌లకు కనువిప్పు కలిగించింది. దీంతో బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2022లో 1,082 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌లు కొనుగోలు చేశాయి. అంతటితో ఆగలేదు. 2023లోనూ మరో 1,051 టన్నులు, 2024లో 1,041 టన్నుల చొప్పున బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌లు అదనంగా సమకూర్చుకున్నాయి. యూఎస్ డాలర్లకు ఇంతకాలం అధిక ప్రాధాన్యం ఇచి్చన సెంట్రల్ బ్యాంక్‌లు, ప్రస్తుతం బంగారానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. ఇంతకుముందుతో పోల్చితే కరెన్సీ విలువల్లో ఆటుపోట్లు పెరిగాయి. కరెన్సీ అస్థితరలకు హెడ్జింగ్‌గా బంగారాన్ని పరిగణిస్తుంటారు. ఈ పరిణామాలన్నీ సెంట్రల్ బ్యాంకులు బంగారానికి వెయిటేజీ పెంచడానికి దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment