వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష | Diversification is the key to investments special story | Sakshi
Sakshi News home page

వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష

Published Mon, Mar 13 2023 1:38 AM | Last Updated on Mon, Mar 13 2023 1:38 AM

Diversification is the key to investments special story - Sakshi

రిటైల్‌ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్‌. తాబేలు అంటే డెట్, గోల్డ్‌ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం.

కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది...

ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్‌ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్‌ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్‌ అలోకేషన్‌. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది.

కనుక అస్సెట్‌ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే.

పనితీరు ఇలా..
2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది.  2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్‌ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్‌ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది.

2011లో యూరోజోన్‌ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్‌ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్‌ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది.

అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్‌ షార్ట్‌ టర్మ్‌ ఇండెక్స్‌ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

పెట్టుబడుల మిశ్రమం
వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల (డెట్‌) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్‌ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్‌ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది.

అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్‌ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్‌ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్‌ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్‌ పథకాలు, అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ లేదా డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ మెరుగైన పనితీరు చూపించాయి.

ఎంత చొప్పున..
అస్సెట్‌ అలోకేషన్‌ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్‌ రిస్క్‌ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి.

రిటైర్మెంట్‌ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్‌ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్‌ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం.

దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు (డెట్‌) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్‌ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి.

2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్‌ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్‌ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్‌ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్‌ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు.

బంగారం కోసం సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్‌ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్‌ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్‌ అలోకేషన్, హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అస్సెట్, ఎస్‌బీఐ మల్టీ అస్సెట్‌ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement