
ట్రేడింగ్‌కు ప్రోత్సాహం, రిస్క్ ల పర్యవేక్షణకు చర్యలు
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో సరళతర లావాదేవీల నిర్వహణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రిస్క్ పర్యవేక్షణను పటిష్టపరచడం ద్వారా సమర్థవంత లావాదేవీలకు తెరతీయనుంది. దీనిలో భాగంగా ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) ఓపెన్ ఇంటరెస్ట్(ఓఐ)పై రియల్‌టైమ్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై మార్చి 17వరకూ ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ప్రతిపాదనలను అమలు చేస్తే మరింతగా సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు ఏర్పడుతుంది. తద్వారా రిస్కులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశమేర్పడుతుంది.
రియల్‌టైమ్‌లో
సెబీ రూపొందించిన తాజా ప్రతిపాదనల ప్రకారం మార్కెట్ పార్టిసిపెంట్లు ఇంట్రాడే స్నాప్‌చాట్స్ ద్వారా రియల్‌టైమ్ ఎఫ్‌అండ్‌వో ఓఐ సంబంధిత సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది రిస్క్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సహకరించడంతోపాటు.. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు దారి చూపిస్తుంది. సెబీ సిద్ధం చేసిన కన్సల్టేషన్ పేపర్ ప్రకారం డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్), ఆల్టర్నేటివ్ పండ్స్(ఏఐఎఫ్) చేపట్టే లావాదేవీల(ఎక్స్‌పోజర్) పరిమితులలో సవరణలకు తెరలేవనుంది. ఫ్యూచర్స్ ఎక్స్‌పోజర్ మదింపులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆప్షన్స్(లాంగ్ అండ్ షార్ట్) ఎక్స్‌పోజర్‌లో సవరణలు చోటు చేసుకోనున్నాయి. వీటి ప్రకారం ఫ్యూచర్ ఈక్వివాలెంట్ లేదా డెల్టా ప్రాతిపదికన వీటిని మదింపు చేస్తారు. తద్వారా ఇవి మార్కెట్ కదలికల(సెన్సిటివిటీ)ను సమర్ధవంతంగా ప్రతిఫలిస్తాయి.
సవరణల బాటలో
ప్రస్తుతం విభిన్న పద్ధతుల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పోజర్‌లను మదింపు చేస్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ల ఆధారంగా, షార్ట్ అప్షన్స్‌ను నోషనల్ విలువ ద్వారా, లాంగ్ ఆప్షన్స్ అయితే ప్రీమియం చెల్లింపు ద్వారా మదింపు చేస్తున్నారు. కాగా.. మార్కెట్ రిస్క్ లను మరింతగా ప్రతిఫలించేలా ఇండెక్స్ డెరివేటివ్స్‌కు సెబీ కొత్త పొజిషన్ పరిమితులను ప్రతిపాదించింది. ఇండెక్స్ ఆప్షన్స్‌కు రోజువారీ ముగింపులో నికర విలువ రూ. 500 కోట్లు, స్థూలంగా రూ. 1,500 కోట్లవరకూ అనుమతించనుండగా.. ఇంట్రాడేకు నికరంగా రూ. 1,000 కోట్లు, స్థూలంగా రూ. 2,500 కోట్లు చొప్పున పరిమితులు అమలుకానున్నాయి.
ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు రోజువారీ ముగింపు పరిమితి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెరగనుంది. రూ. 2,500 కోట్ల ఇంట్రాడే పరిమితి ఇందుకు అమలుకానుంది. తాజా ప్రతిపాదనలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), ఎంఎఫ్‌లు, ట్రేడర్లు, క్లయింట్లతోపాటు మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ అమలుకానున్నాయి. అయితే నిజంగా హోల్డింగ్స్ కలిగిన పొజిషన్లకు మినహాయింపులు లభించనున్నాయి. స్టాక్స్ కలిగిన షార్ట్ పొజిషన్లు, నగదు కలిగిన లాంగ్ పొజిషన్లకు మినహాయింపులు వర్తించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment