ఐపీవోకు 8 కంపెనీలు రెడీ | IPO: SEBI Approved 6 Companies to Float IPO and Ivalue Infosolutions and Ather Energy and Oswal Pumps and More | Sakshi
Sakshi News home page

ఐపీవోకు 8 కంపెనీలు రెడీ

Published Wed, Jan 1 2025 1:08 AM | Last Updated on Wed, Jan 1 2025 1:08 AM

IPO: SEBI Approved 6 Companies to Float IPO and Ivalue Infosolutions and Ather Energy and Oswal Pumps and More

ఏడు ఆఫర్లకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఎనిమిది కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జాబితాలో లీలా ప్యాలస్‌ మాతృ సంస్థ ష్లాస్‌ బెంగళూరు, ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ ఏథర్‌ ఎనర్జీ, మోనోబ్లాక్‌ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్‌ పంప్స్‌ తదితరాలున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్‌ 10–23 మధ్య కాలంలో ఇవి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఈ నెలాఖరుకల్లా అనుమతులు పొందాయి. ఐపీవోకు అనుమతి లభించిన ఇతర కంపెనీలలో ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్, క్వాలిటీ పవర్‌ ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్స్, ఫ్యాబ్‌టెక్‌ టెక్నాలజీస్‌ సైతం చేరాయి. వివరాలు చూద్దాం..

ఏథర్‌ ఎనర్జీ 
ద్విచక్ర ఈవీ తయారీ కంపెనీ ఏథర్‌ ఎనర్జీ ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో ఈవీ ప్లాంటు ఏర్పాటుకు, ఆర్‌అండ్‌డీకి, రుణ చెల్లింపులకు, మార్కెటింగ్‌ వ్యయాలకు వెచ్చించనుంది. ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తదుపరి రెండో ఈవీ కంపెనీగా లిస్ట్‌కానుంది.

హోటల్‌ లీలా
లీలా ప్యాలసెస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ నిర్వాహక కంపెనీ ష్లాస్‌ బెంగళూరు ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ ప్రాజెక్ట్‌ బాలెట్‌ బెంగళూరు హోల్డింగ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఆఫర్‌ చేయనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య రంగ ఐపీవోగా నిలవనుంది. బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు పెట్టుబడులున్న కంపెనీ ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 10 ప్రాంతాలలోని 12 హోటళ్ల ద్వారా 3,382 గదులను నిర్వహిస్తోంది.  

ఓస్వాల్‌ పంప్స్‌ 
తక్కువ, అధిక వేగంగల(లోస్పీడ్, హైస్పీడ్‌) మోనోబ్లాక్‌ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్‌ పంప్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్‌ వివేక్‌ గుప్తా ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు, సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్‌ సోలార్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. ఈ బాటలో హర్యానాలోని కర్ణాల్‌లో కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు, రుణ చెల్లింపులకు సైతం వెచ్చించనుంది.

ఫ్యాబ్‌ టెక్నాలజీస్‌ 
ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్‌ పరిశ్రమలలో టర్న్‌కీ ఇంజినీరింగ్‌ సొల్యూషన్లు అందించే ఫ్యాబ్‌ టెక్నాలజీస్‌ ఐపీవోలో భాగంగా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆయా విభాగాలలో కంపెనీ సమీకృత సొల్యూషన్లు సమకూర్చుతోంది. వీటిలో డిజైనింగ్, ప్రొక్యూర్‌మెంట్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్‌ తదితర సేవలున్నాయి.  

ఐవేల్యూ ఇన్ఫో 
పీఈ సంస్థ క్రియేడర్‌కు పెట్టుబడులున్న ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్‌ ఐపీవోలో భాగంగా 1.87 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ చేయనున్నారు. క్రియేడర్‌ 1.11 కోట్ల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్‌ అప్లికేషన్ల మేనేజింగ్, డేటా నిర్వహణలో సమీకృత ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తోంది.  

జనవరి 6న స్టాండర్డ్‌ గ్లాస్‌ ఆఫర్‌
ఫార్మా రంగానికి ప్రత్యేక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభం కానుంది. జనవరి 8న ఆఫర్‌ ముగియనుంది. ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 133–140గా నిర్ణయించారు. కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. అలాగే రూ.350 కోట్ల వరకు వి లువైన 1.84 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ చేస్తారు. ఈ ఆఫర్‌తో తమ హోల్డింగ్స్‌ లో కొంత భాగాన్ని కంపెనీ ప్రమోటర్లు ఎస్‌2 ఇంజనీరింగ్, కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్‌ రావు కందుల విక్రయించనున్నారు.

క్వాలిటీ పవర్‌ 
ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, పవర్‌ టెక్నాలజీల కంపెనీ క్వాలిటీ పవర్‌ ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 225 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్‌ చిత్రా పాండ్యన్‌ ఆఫర్‌ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో పాండ్యన్‌ కుటుంబానికి 100 శాతం వాటా ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement