స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు చెక్‌ | F and O addiction: Sebi tightens Futures and Options trading rules effective Nov 20 | Sakshi

స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు చెక్‌

Published Wed, Oct 2 2024 1:01 AM | Last Updated on Wed, Oct 2 2024 1:01 AM

F and O addiction: Sebi tightens Futures and Options trading rules effective Nov 20

ఎఫ్‌అండ్‌వో నిబంధనలు కఠినతరం 

తాజాగా సర్క్యులర్‌ జారీ చేసిన సెబీ

న్యూఢిల్లీ: స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టే బాటలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌అండ్‌వో) నిబంధనలను కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్‌ పరిమాణాన్ని పెంచడంతోపాటు.. ఆప్షన్స్‌ ప్రీమియంల ముందస్తు వసూళ్లను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల పరిరక్షణార్ధం పొజిషన్‌ లిమిట్స్‌పై ఇంట్రాడే పర్యవేక్షణ, ఎక్స్‌పైరీ రోజున కేలండర్‌ స్ప్రెడ్‌ లబ్ధి రద్దు, వీక్లీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ను క్రమబద్ధీకరించడం, టెయిల్‌ రిస్క్‌ కవరేజీ పెంపు తదితర పలు ఇతర చర్యలను సైతం తీసుకుంది.

ఈ చర్యలన్నీ వచ్చే నెల (నవంబర్‌) 20 నుంచి దశలవారీగా అమల్లోకిరానున్నట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇటీవల పరిశీలన ప్రకారం ఎఫ్‌అండ్‌వో విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు 2022–24 మధ్య కాలంలో సగటున రూ. 2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. కోటిమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93% మందికి నష్టాలు వాటిల్లినట్లు ఇప్పటికే రిటైలర్లను హెచ్చరించింది. ఈ కాలంలో వ్యక్తిగత ట్రేడర్లకు ఉమ్మడిగా రూ. 1.8 లక్షల కోట్లమేర నష్టాలు నమోదైనట్లు పేర్కొనడం తెలిసిందే.  

నిబంధనల తీరిదీ... 
తాజా సర్క్యులర్‌లో సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనల సవరణలను వెల్లడించింది. వీటి ప్రకారం ఇండెక్స్‌ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్‌ పరిమాణాన్ని 2015లో నిర్ణయించిన రూ. 5–10 లక్షల నుంచి రూ. 15–20 లక్షలకు పెంచింది. ఇందుకు అనుగుణంగానే లాట్‌ సైజ్‌ను కూడా నిర్ధారిస్తారు. వీక్లీ ఇండెక్స్‌ డెరివేటివ్స్‌ను ఒకేఒక ప్రామాణిక ఇండెక్స్‌కు పరిమితం చేస్తారు. షార్ట్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులపై ఎక్స్‌పైరీ రోజున 2 శాతం అదనపు మార్జిన్‌ (ఈఎల్‌ఎం)ను విధిస్తారు. ఆప్షన్‌ కొనుగోలుదారులు ముందస్తుగా పూర్తి ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. దీంతో అధిక లెవరేజ్‌ను నివారిస్తారు.   

మునిసిపల్‌ బాండ్లకు పన్ను రాయితీలు 
మౌలిక రంగ అభివృద్ధికి వినియోగించగల నిధుల సమీకరణకు వీలుగా మునిసిపల్‌ బాండ్లకు పన్ను రాయితీలు ప్రకటించాలని సెబీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. వీటి సబ్‌్రస్కయిబర్లకు పన్ను మినహాయింపులను అందించాలని అభ్యర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement