
బ్లూ కాలర్ ఉద్యోగాల్లో 20 శాతమే
వేతనాల్లో వ్యత్యాసంతో నిరుత్సాహం
మహిళా కార్మికులకు ప్రతికూల పని పరిస్థితులు
జాబ్ పోర్టల్ ఇండీడ్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: చేతివృత్తులు, నైపుణ్యాలతో కూడిన కార్మికశక్తిలో (బ్లూకాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం ప్రతి ఐదుగురిలో ఒకరిగానే (20 శాతం) ఉన్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా వేతనాల్లో తీవ్ర అంతరాలు, పనిచేసే చోటు పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉండడం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుండడం మహిళలను పనులకు దూరం చేస్తోంది. టైర్ 1, 2 పట్టణాల్లో 14 రంగాల్లోని 4,000 కంపెనీలు, ఉద్యోగులను ఇండీడ్ సర్వే చేసింది.
సర్వే అంశాలు..
⇒ 2024లో 73 శాతం కంపెనీలు బ్లూ కాలర్ ఉద్యోగాల్లోకి మహిళలను నియమించుకున్నట్టు తెలిపాయి. బ్లూకాలర్ ఉద్యోగాలన్నీ శ్రామికశక్తితో కూడినవే.
⇒ రిటైల్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్య పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం సగటున 30 శాతం స్థాయిలో ఉంది.
⇒ అదే టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువగా ఉంది.
⇒ ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు బ్లూకాలర్ ఉద్యోగాలు కోరుకుంటున్నారు. కానీ, పరి పరిస్థితులు కఠినంగా ఉంటున్నట్టు చెబుతున్నారు.
⇒ ఉద్యోగ వేళలు (షిఫ్ట్‌లు) అనుకూలంగా లేవని సగం మందికి పైగా తెలిపారు. కఠినమైన పనివేళల కారణంగా మహిళలు ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోతున్నారు.
⇒ పురుషులతో పోల్చితే 42 శాతం మంది మహిళలు తమకు తక్కువ వేతనం చెల్లిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు కెరీర్‌లో పురోగతి (పదోన్నతులు తదితర) ఉండడం లేదని భావిస్తున్నారు.
⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు నైపుణ్యాలను పెంచుకుంటామని ఆసక్తి చూపించారు. అయితే, నైపుణ్య శిక్షణ తమకు సవాలుగా పేర్కొన్నారు. నేర్చుకునేందుకు సరైన మార్గాలు లేకపోవడం కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు అడ్డంకిగా పేర్కొన్నారు.
⇒ 78% కంపెనీలు 2025లో మహిళలను నియమించుకుంటామని చెప్పాయి. గతేడాదితో పోల్చితే నియామకాల ఉద్దేశ్యం 5% పెరిగింది.
⇒ అయితే సరిపడా నైపుణ్యాలు కలిగిన వారు లభించడం లేదని, దీనికితోడు వలసలు తమ కు సమస్యాత్మమని కంపెనీలు పేర్కొన్నాయి.
⇒ ఇన్సూరెన్స్, పెయిడ్ మెడికల్ లీవ్‌ను మహిళలు కోరుకుంటుండగా, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోవడం తమకు సవాలుగా కంపెనీలు తెలిపాయి.
మెరుగైన విధానాలతోనే..
‘‘మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వ్యాపార సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ నిజమైన ప్రగతి అన్నది వారిని కాపాడుకునేందుకు మెరుగైన విధానాలు అమలు చేయడం, కెరీర్‌లో పురోగతికి వీలు కల్పించడం, ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా విధానాలు అమలు చేయడం కీలకం’’అని ఇండీస్ సర్వే సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment