
నమ్మకమైన భాగస్వామిగా అన్ని దేశాలు మనల్ని గుర్తిస్తున్నాయి
ఈ అవకాశాలను అందిపుచ్చుకోండి...
పారిశ్రామిక రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణలు, పెట్టుబడులు, సులభతరమైన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణలపై బడ్జెట్ తదనంతర వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు.
ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలిగేలా భారత్‌లో తయారు చేయగల కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘దీన్ని సాకారం చేసే సత్తా మన దేశానికి, మీకు (పరిశ్రమలు) ఉంది. ఇదొకొ గొప్ప అవకాశం. ప్రపంచ ఆకాంక్షల విషయంలో మన పరిశ్రమలు ప్రేక్షక పాత్ర వహించకుండా, అందులో కీలకపాత్ర పోషించాలి. మీకు మీరే అవకాశాలను అందింపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ సూచించారు.
‘భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తోంది. అందుకే ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మన తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈలకు చౌక రుణాలివ్వాలి...
దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు సకాలంలో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులను అందించే దుకు కొత్త తరహా రుణ పంపిణీ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. 5 లక్షల మంది ఎస్‌సీ, ఎస్‌టీ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తొలిసారిగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు కేవలం రుణాలివ్వడమే కాకుండా, మార్గనిర్దేశం, తోడ్పాటు అందించేలా మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలన్నారు.
ఏ దేశ ప్రగతికైనా మెరుగైన వ్యాపార పరిస్థితులు చాలా కీలకమని, అందుకే తమ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా నిబంధనల అమలు అడ్డంకులను తొలగించిందన్నారు. జనవిశ్వాస్ 2.0 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈ రుణాలపై గ్యారంటీ కవరేజీని రెట్టింపు స్థాయిలో రూ.20 కోట్లకు పెంచామని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ.5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment