సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురి వెల్లడి
ముంబై: చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురి పేర్కొన్నారు. కొంతమంది అసహజ లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించామని తెలియజేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్‌ఎంఈలు) విభాగంలో కృత్రిమంగా ధరల పెంపును చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్‌ఎంఈ విభాగం ఐపీవోలతోపాటు.. సెకండరీ మార్కెట్లోనూ అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు.
వెరసి రిసు్కలు అధికంగాగల విభాగంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచించారు. ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా మహిళా పాత్రికేయులతో ముచ్చటించిన పురి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన విభాగంతో పోలిస్తే ఎస్‌ఎంఈ విభాగం ప్రత్యేకమైనదని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవలసి ఉన్నట్లు పురి పేర్కొన్నారు. ప్రధాన విభాగంలోని కంపెనీలు తప్పనిసరిగా సమాచారాన్ని వెల్లడించవలసి ఉంటుందని, అయితే ఎస్‌ఎంఈ విభాగం రిసు్కలు విభిన్నంగా ఉంటాయని ఇన్వెస్టర్లను హెచ్చరించారు.
28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో టీ+0 సెటిల్‌మెంట్
సెక్యూరిటీల టీ+0 సెటిల్‌మెంట్‌ను మార్చి 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నట్లు పురి తెలియజేశారు. గత కొద్ది నెలల్లో భారీగా దూసుకెళుతున్న స్మాల్, మిడ్ క్యాప్ విభాగం షేర్ల విలువలపై స్పందిస్తూ కొన్ని కౌంటర్లలో అసహజ లావాదేవీలు నమోదవుతున్న సంకేతాలున్నట్లు వెల్లడించారు. ధరలను మ్యానిప్యులేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి బుడగలవంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి బుడగలు తలెత్తేందుకు అనుమతించకూడదని, ఇవి పగలిపోతే ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఇది మార్కెట్లకు మంచిదికాదని అభిప్రాయపడ్డారు.
స్టాక్ బ్రోకర్లకు కఠిన నిబంధనలు
కాగా, అర్హతగల స్టాక్ బ్రోకర్(క్యూఎస్‌బీ)గా గుర్తించే మార్గదర్శకాలను సెబీ తాజాగా విస్తృతం చేసింది. తద్వారా మరింతమంది బ్రోకర్లను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాజా చర్యలకు తెరతీసింది. యాజమాన్య సంబంధ లావాదేవీల పరిమాణం, నిబంధనలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను స్టాక్ బ్రోకర్లను క్యూఎస్‌బీలుగా గుర్తించడంలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఒక సర్క్యులర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment