అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలని సెక్యూరిటీ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్‌పర్సన్ మాధబి పుర్ బచ్‌ను అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లోక్‌పాల్ ఆదేశించింది. ఈ విచారణకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా ఫిర్యాదుదారులు కూడా హాజరుకావాలని తెలిపింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) మాధబిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి 2025 జనవరిలో విచారణకు హాజరుకావాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది.
మహువా మొయిత్రా, మరో ఇద్దరు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దాంతో నవంబరు 8న సెబీ చీఫ్‌ను లోక్‌పాల్ వివరణ అడిగింది. అందుకు ఆమె నాలుగు వారాల సమయం కోరారు. డిసెంబరు 7న ఫిర్యాదులో పేర్కొన్న విధంగా అఫిడవిట్ రూపంలో లోక్‌పాల్(Lokpal)కు వివరణ ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపేందుకు వచ్చే నెల 28న ఫిజికల్‌గా హాజరుకావాల్సిందిగా బచ్‌తోపాలు ఫిర్యాదుదారులను లోక్‌పాల్ ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది.
ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వేతనం
ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: ఆడిట్‌లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా
సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment