regulator
-
స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్
న్యూఢిల్లీ: స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) నిబంధనలను కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని పెంచడంతోపాటు.. ఆప్షన్స్ ప్రీమియంల ముందస్తు వసూళ్లను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల పరిరక్షణార్ధం పొజిషన్ లిమిట్స్‌పై ఇంట్రాడే పర్యవేక్షణ, ఎక్స్పైరీ రోజున కేలండర్ స్ప్రెడ్ లబ్ధి రద్దు, వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను క్రమబద్ధీకరించడం, టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు తదితర పలు ఇతర చర్యలను సైతం తీసుకుంది.ఈ చర్యలన్నీ వచ్చే నెల (నవంబర్) 20 నుంచి దశలవారీగా అమల్లోకిరానున్నట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇటీవల పరిశీలన ప్రకారం ఎఫ్‌అండ్‌వో విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు 2022–24 మధ్య కాలంలో సగటున రూ. 2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. కోటిమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93% మందికి నష్టాలు వాటిల్లినట్లు ఇప్పటికే రిటైలర్లను హెచ్చరించింది. ఈ కాలంలో వ్యక్తిగత ట్రేడర్లకు ఉమ్మడిగా రూ. 1.8 లక్షల కోట్లమేర నష్టాలు నమోదైనట్లు పేర్కొనడం తెలిసిందే. నిబంధనల తీరిదీ... తాజా సర్క్యులర్‌లో సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనల సవరణలను వెల్లడించింది. వీటి ప్రకారం ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని 2015లో నిర్ణయించిన రూ. 5–10 లక్షల నుంచి రూ. 15–20 లక్షలకు పెంచింది. ఇందుకు అనుగుణంగానే లాట్ సైజ్‌ను కూడా నిర్ధారిస్తారు. వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను ఒకేఒక ప్రామాణిక ఇండెక్స్‌కు పరిమితం చేస్తారు. షార్ట్ ఆప్షన్స్ కాంట్రాక్టులపై ఎక్స్పైరీ రోజున 2 శాతం అదనపు మార్జిన్ (ఈఎల్ఎం)ను విధిస్తారు. ఆప్షన్ కొనుగోలుదారులు ముందస్తుగా పూర్తి ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. దీంతో అధిక లెవరేజ్‌ను నివారిస్తారు. మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు మౌలిక రంగ అభివృద్ధికి వినియోగించగల నిధుల సమీకరణకు వీలుగా మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు ప్రకటించాలని సెబీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. వీటి సబ్‌్రస్కయిబర్లకు పన్ను మినహాయింపులను అందించాలని అభ్యర్థించింది. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
ఎయిర్‌టెల్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్టెల్ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేస్తోంది. -
డా.రెడ్డీస్ ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్లాంట్ లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలు మొదలుకానున్నాయి. సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ నెలాఖరున తనిఖీలు చేపట్టనుంది. మార్చి 27 న ఈ తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అమెరికా డ్రగ్ రె గ్యులేటరీ మీడియా కు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ప్లాంట్ సక్రియాత్మక ఔషధ అంశాల (API) సరఫరా పరంగా చాలా కీలకం. ఫిబ్రవరి- మార్చి 2017లో మిర్యాల గూడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్ఎఫ్డీఏ 3 లోపాలు(అబ్జర్వేషన్స్) నమోదు చేసింది. ఇక విశాఖకు దగ్గర్లోగల దువ్వాడ ప్లాంటు తనిఖీల్లో భాగంగా 13 అబ్జర్వేషన్స్ నోట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలుచేపట్టనుంది. నవంబర్ 2015 లో ఈ మూడు ప్లాంట్లపైనా యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ డ్రగ్‌మేకర్ చిక్కుల్లోపడింది. కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా ఉంది. -
రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్
న్యూఢిల్లీ : టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ల మాదిరిగా తమకు ఓ రెగ్యులేటరీ బాడీ కావాలంటున్నారు ఆన్ లైన్ సెల్లర్స్. ఆన్ లైన్ మార్కెట్ ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న నిర్వహణ లోపాలను ఈ రెగ్యులేటరీతో అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కు రెగ్యులేటరీ బాడీ ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఆల్ ఇండియా ఆన్ వెండర్స్ అసోసియేషన్(ఏఐఓవీఏ) ఓ వినతి పత్రం సమర్పించింది. ఈ రెగ్యులేటరీ ఏర్పాటుతో పన్నుల పరంగా వచ్చే ఇబ్బందులను కూడా తొలగించాలని అభ్యర్థించారు. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఆఫర్ చేసే కమిషన్ చార్జీలపై కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుందని, దాంతో పాటు వాల్యు యాడెడ్ టాక్స్, సర్వీసు టాక్స్ ల కింద కొరియర్ చార్జీలను వసూలుచేస్తున్నారని, వీటినుంచి ఉపశమనం కలిగించాలని సెల్లర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. అమ్మకాల వాల్యుమ్ పైనా, ఖర్చులపైనా వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నామని, అవి అమ్మక ధరల్లో దాదాపు 25 నుంచి 30 శాతం ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం ఈ పన్నులను తగ్గిస్తే, ఉత్పత్తులపై కూడా ధరలు తగ్గుతాయని ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్ ఓ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 1000 మధ్యస్త, ఎగువస్థాయి అమ్మకపు ప్రతినిధులు ఈ విషయంపై జయంత్ సిన్హాకు ఫిర్యాదుచేశారు. మార్కెట్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహణపూరితంగా ఉందని, పరస్పర సంప్రదింపులతో తమకు న్యాయం జరగడం లేదని చెప్పారు. టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్ కు ఉన్నట్టు తమకు కూడా ఓ ఆన్ లైన్ రెగ్యులేటరీ కావాలని కోరారు. -
ఆహార భద్రతకోసం కొత్త యాప్!
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆహార భద్రతను నియంత్రించే ఈ మొబైల్ అనువర్తనాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్తగా ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు... వాటి నాణ్యతకు, భద్రతకు సంబంధించిన వివరాలను ఈ కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించింది. వినియోగదారుల ఆహార భద్రతకు కావలసిన ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు... ఆహార భద్రత చట్టానికి సంబంధించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది. కొత్తగా ప్రారంభించిన ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా వినియోగ దారులు ఆహార భద్రతను గూర్చి తెలుసుకోవడమే కాక, భద్రతాసంబంధమైన సిఫార్సులు చేసేందుకు, సమస్యలను తెలిపేందుకు కూడ అవకాశం కల్పించింది. ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులంతా వినియోగించుకునే అవకాశం ఉంది. తినేంఉదకు సిద్ధంగా ఉన్న, ప్యాక్ చేసిన ఆహారం అమ్మకందారుల వివరాలతోపాటు, యాప్ ద్వారా వివరణ అడిగే అధికారం కూడ కల్పించింది. యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ కొత్త యాప్ ద్వారా ఆయా వ్యాపారస్తుల అడ్రస్ తో పాటు, వారికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫొటోలవంటి సాక్ష్యాలతో సహా సమర్పించేందుకు వీలుగా ఈ కొత్త యాప్ ను రూపొందించారు. అంతేకాక ప్రతి ఆహార పదార్థాన్ని కొనే ముందు వినియోగదారులు దాని భద్రత గురించి తెలుసుకునే మరెన్నో వివరాలు ఈ యాప్ లో పొందుపరిచారు.