న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు.
ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు.
ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్‌పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment