Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది.
దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్‌మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది.
ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది.
ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment