
న్యూఢిల్లీ: హ్యాండ్ బ్యాగ్‌లు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా వస్త్రాలు రూ.10 లక్షలు మించినవి మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిపై ఒక శాతం మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) చేయనున్నారు. ప్రస్తుతం ఒక శాతం టీసీఎస్ రూ.10 లక్షలు మించిన మోటారు వాహనాలపైనే అమలవుతోంది. ఒక శాతం టీసీఎస్ వర్తించే విలాస వస్తువుల జాబితాను ఆదాయపన్ను శాఖ తాజాగా విడుదల చేసింది.
పెయింటింగ్‌లు, శిల్పాలు, పురాతన వస్తువులు, కాయిన్లు, స్టాంప్‌లు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు, కళ్లద్దాలు, పాదరక్షలు, క్రీడావస్త్రాలు, క్రీడా పరికరాలు, హోమ్ థియేటర్ సిస్టమ్‌లు, రేసింగ్ కోసం ఉద్దేశించిన గుర్రాల విక్రయ ధరపై ఒక శాతం టీసీఎస్ అమలవుతుంది. కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి ధరపై ఒక శాతం అదనంగా టీసీఎస్‌ను విక్రయదారులే వసూలు చేస్తారు. వారి పాన్ వివరాలు కూడా తీసుకుని, ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. కొనుగోలుదారులు ఆదాయపన్ను రిటర్నులు వేయడం ద్వారా తమ పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసుకోవచ్చు.
పన్ను చెల్లించే బాధ్యత లేకపోతే రిఫండ్ కోరొచ్చు. టీసీఎస్ రూపంలో ఆదాయపన్ను శాఖకు అదనంగా ఎలాంటి పన్ను ఆదాయం రాదు. కాకపోతే అధిక కొనుగోళ్ల వివరాలను పాన్ నంబర్ల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అధిక విలువతో కూడిన విచక్షణారహిత కొనుగోళ్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులను పెంచుకోవడం దీని లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.