F & O
-
పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని జూన్ నెలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో (ఎఫ్ఎస్ఆర్) రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (ఎస్సీబీ) స్థూల మొండి బాకీల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 12 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.6 శాతానికి తగ్గినట్లు వివరించింది. జీఎన్‌పీఏలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2.5 శాతానికి తగ్గగలవని వివరించింది.క్రెడిట్ రిసు్కలకు సంబంధించి స్థూల స్ట్రెస్ టెస్టుల్లో ఎస్సీబీలు కనీస మూలధన అవసరాలను పాటించగలిగే స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైందని నివేదిక పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి జీఎన్‌పీఏ నిష్పత్తి 4 శాతంగాను, రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 3.3 శాతంగాను ఉన్నట్లు తెలిపింది.భౌగోళిక–రాజకీయ ఆందోళనలు, ప్రభుత్వాలపై భారీ రుణభారాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా పురోగతి మందకొడిగా సాగుతుండటం వంటి అంశాల రూపంలో అంతర్జాతీయ ఎకానమీకి సవాళ్లు పెరిగాయని వివరించింది. సవాళ్లున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నివేదిక తెలిపింది.గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి.. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా నిలదొక్కుకునేలా అసెట్ క్వాలిటీ, పటిష్టత మెరుగుపడినట్లుగా అధ్యయనాలు చూపిస్తున్న నేపథ్యంలో గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టాలంటూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.ప్రస్తుతానికి ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉందని, అయితే దాన్ని అలాగే కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చుకోవడమనేది నిజమైన సవాలుగా ఉండగలదని ఎఫ్ఎస్ఆర్ నివేదిక ముందుమాటలో ఆయన పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. టెక్నాలజీపై బ్యాంకులు తగినంత స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.నివేదికలోని మరిన్ని అంశాలు..బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 2023–24 ప్రథమార్ధంలో జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా 76 శాతం మేర తగ్గింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) మెరుగుపడింది.అర్థ సంవత్సరంలో కొత్త ఎన్పీఏలు కూడా వివిధ బ్యాంకు గ్రూపుల్లో తగ్గాయి. పూర్తి సంవత్సరంలో మొండి బాకీల రైటాఫ్‌లు దిగివచి్చనప్పటికీ రైటాఫ్ నిష్పత్తి మాత్రం క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది.2023–24 ద్వితీయార్ధంలో పీఎస్‌బీలు, ఫారిన్ బ్యాంకుల్లో రుణాల మంజూరు పెరగ్గా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కాస్త నెమ్మదించింది.మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో సర్వీ సుల రంగానికి ఇచ్చిన రుణాలు, వ్యక్తిగత రుణాల వాటా పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధిలో వ్యక్తిగత రుణాల వాటా సగానికి పైగా ఉంది.ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) వాల్యూమ్స్ గణనీయంగా పెరగడమనేది రిటైల్ ఇన్వెస్టర్లకు సవాలుగా మారొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు సరైన రిస్కు మేనేజ్మెంట్ విధానాలను పాటించకపోతుండటమే ఇందుకు కారణం. కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కీలకం. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో 2022–23లో 65 లక్షలుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2023–24లో ఏకంగా 95.7 లక్షలకు పెరిగింది. -
రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
న్యూఢిల్లీ: సత్వర లాభాలపై ఆశలు, స్పెక్యులేటివ్ ధోరణులే రిటైల్ ఇన్వెస్టర్లను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు రిస్క్ ల గురించి ఆలోచించకుండా ట్రేడింగ్‌లోకి దూకి, చేతులు కాల్చుకుంటున్నారు. అలా జరగకుండా ఎఫ్‌అండ్‌వోపై పూర్తి అవగాహన పెంచుకుని, రిస్క్ లను ఎలా ఎదుర్కొనాలనేది తెలుసుకుని మాత్రమే ఇందులోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ లతో కూడుకున్న ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేస్తుండటంపై కొన్నాళ్ల క్రితం ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ మాధవిపురి బచ్ తదితరులు ఈ సాధనం విషయంలో జాగ్రత్త వహించాలని కూడా సూచించారు. అయినప్పటికీ ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ భారీగా పెరుగుతూనే ఉంది. 2019లో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్ నెలవారీ టర్నోవరు 8,740 లక్షల కోట్లుగా ఉండేది. ఇది 2024 మార్చి నాటికి ఏకంగా రూ. 217 లక్షల కోట్లకు ఎగిసింది. సెబీ అధ్యయనం ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టపోయారు. నష్టాలు సగటున రూ. 1.1 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అనేది హెడ్జింగ్, స్పెక్యులేషన్ కోసం ఉపయోగకరంగా ఉంటుందని, కానీ అధిక స్థాయిలో మార్జిన్లు అవసరమవుతాయి కాబట్టి రిస్క్ లు కూడా ఎక్కువగా ఉంటాయని ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఫైయర్స్ సహ–వ్యవస్థాపకుడు తేజస్ ఖోడే చెప్పారు. వీటి వల్ల చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ సాధనాలు, వాటిలో ఉండే రిసు్కల గురించి రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయడం మంచిదని సూచించారు. ‘ఈ సాధనాలకు అవసరమైన పెట్టుబడి తక్కువగానే ఉండటం, వివిధ సూచీల్లో వీక్లీ ఎక్స్‌పైరీలు కూడా అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు భారీగా పెరిగారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లకు రిస్క్ లు కూడా పెరిగాయి‘ అని ఆనంద్ రాఠీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా చెప్పారు. -
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
ఎఫ్‌అండ్‌వోలో బ్రోకరేజీల జోరు..
ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజీలను మించి పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలు ఇటీవల రిటైల్ డెరివేటివ్ విభాగంలో జోరు చూపుతున్నాయి. ఫ్యూచర్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో ఏంజెల్‌వన్, మోతీలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకరేజీలను మించుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. రిటైల్ విభాగంలో ఏంజెల్‌వన్ 82 శాతం, మోతీలాల్ ఓస్వాల్ 54 శాతం ఆదాయ వాటాను పొందినట్లు ఒక నివేదిక పేర్కొంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేపట్టిన ఒక పరిశీలన ప్రకారం డిస్కౌంట్ బ్రోకర్స్ ఎన్ఎస్ఈలో అత్యధికంగా జరిగే ఎఫ్‌అండ్‌వో లావాదేవీల జోరుకు కారణమవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో పరిమాణంలో 2022లోనూ ఎన్ఎస్ఈ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్సే్ఛంజీగా నిలిచిన సంగతి తెలిసిందే. రిటైలర్లకు నష్టాలు గత కేలండర్ ఏడాది(2022)లో రిటైల్ ట్రేడర్లు నిర్వహించిన 10 ఎఫ్‌అండ్‌వో ట్రేడ్లలో 9 నష్టాలతోనే ముగిసినట్లు గత నెలలో సెబీ పేర్కొంది. సుమారు రూ. 1.1 లక్షల కోట్ల నష్టాలు నమోదైనట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే డెరివేటివ్ విభాగంలో రిటైల్ ట్రేడర్ల సంఖ్య 500 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వెరసి ఇన్వెస్టర్ల కోసం బ్రోకర్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలు రూపొందించే అదనపు రిస్క్ మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలియజేసింది. టెక్నాలజీపై దృష్టిపెట్టిన ఏంజెల్‌వన్ అతితక్కువ కాలంలోనే 12.89 మిలియన్ కస్టమర్లను పొందడం ద్వారా 2023 జనవరికల్లా అతిపెద్ద బ్రోకరేజీగా ఆవిర్భవించింది. 2022 అక్టోబర్–డిసెంబర్(క్యూ3) కాలంలో సాధించిన రూ. 800 కోట్ల ఆదాయంలో 82 శాతం వాటాను ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారానే పొందింది. ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వరుసగా గత రెండు సంవత్సరాలలో ఎఫ్‌అండ్‌వో వాటా 72 శాతం, 52 శాతంగా నమోదైంది. ఇక ఈ క్యూ3లో మోతీలాల్ ఆర్జించిన రూ. 688 కోట్ల ఆదాయంలో 54 శాతం వాటా ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచే లభించింది. 2019లో 39 శాతంగా నమోదైన ఈ వాటా తదుపరి ఇదేస్థాయిలో కొనసాగుతూ తాజాగా 54 శాతానికి ఎగసింది. మరోవైపు బ్రోకింగ్ రంగంలో రెండో ర్యాంకులో ఉన్న జిరోధా డెరివేటివ్ విభాగం నుంచి 20 శాతమే పొందింది. ఈ సంస్థ 7 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోకింగ్‌లో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి 75 శాతం పరిమాణాన్ని సాధిస్తోంది. అప్‌స్టాక్స్, 5పైసా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితరాలు సైతం డిస్కౌంట్ బ్రోకింగ్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. కాగా.. పూర్తిస్థాయి బ్రోకింగ్ సేవలందించే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌అండ్‌వో నుంచి 20 శాతం ఆదాయాన్ని అందుకుంది. ఈ బాటలో 8.7 మిలియన్ కస్టమర్లను కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్‌నుంచి 20 శాతం ఆదాయాన్నే పొందింది. డెరివేటివ్స్‌లో రిటైలర్లు సెబీ పరిశీలన ప్రకారం గతేడాది(2022)లో టాప్–10 బ్రోకర్ల ద్వారా 45 లక్షలకుపైగా రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించారు. 2019లో నమోదైన 7.1 లక్షమందితో పోలిస్తే ఈ సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. ఇటీవల కొత్త ఇన్వెస్టర్లు, యువత అత్యధికంగా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేపడుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో 36 శాతం 20–30 మధ్య వయసువారు కావడం గమనార్హం! 2019లో వీరి సంఖ్య 11 శాతమే. -
జూలై సీరీస్‌లో ఈ 4షేర్లపై ట్రేడర్ల ఆసక్తి..!
జూలై డెరివేటివ్ సీరీస్ తొలిరోజైన శుక్రవారం టెలికాం, ఐటీ, ఫార్మా, హాస్పిటల్ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. రానున్న రోజుల్లో నిఫ్టీ లాభాలు పరిమితం అవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు వృద్ధి కలిగిన కంపెనీల షేర్లపై దృష్టిని సారించారు. యాక్చెంచర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావవడంతో శుక్రవారం టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్స్ విభాగపు విశ్లేషకుడు చందన్ తపారియా జూలై సీరిస్‌లో ట్రేడర్లు ఈ 4షేర్లపై అధిక దృష్టి నిలిపినట్లు పేర్కోంటూ సూచనలు ఇచ్చారు. ఇప్పుడు 4 షేర్లను గురించి తెలుసుకుందాం... 1. షేరు పేరు: వోడాఫోన్ ఐడియా ప్రస్తుత ధర: రూ.10.50(29-6-2020 నాటికి) విశ్లేషణ: గడచిన కొద్దిరోజులుగా ఇతర టెలికాం రంగ షేర్లలో నెలకొన్న ర్యాలీలో భాగంగా ఈ షేరు పెరిగింది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ వోడాఫోన్ ఐడియా కంపెనీలో వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలతో ఈ కౌంటర్లో సెంటిమెంట్ మెరుగుపడింది. అలాగే ఏజీఆర్ బకాయిల నుంచి ఉపమశమనం లభించవచ్చనే ఆశావహ అంచనాలతో ఈ షేరు మార్చి నుంచి ఏకంగా 218శాతం ర్యాలీ చేసింది. శుక్రవారం షేరు సగటు వ్యాల్యూమ్స్ కంటే అధిక ట్రేడింగ్ పరిమాణంతో 6శాతం లాభంతో ముగిసింది. 2. షేరు పేరు: మైండ్ ట్రీ ప్రస్తుత షేరు ధర: రూ. 941 (29-6-2020 నాటికి) విశ్లేషణ: యాక్చెంచర్ క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐటీ షేర్లు లాభపడ్డాయి. అందులో భాగంగా ఈ మైండ్ ట్రీ షేరు కూడా పెరిగింది. ఈ షేరు ప్రస్తుత ధర(రూ.941) నుండి ఈ జూలై సీరీస్‌లో రూ. 1,000- రూ.1,020కి ర్యాలీ చేయవచ్చు. అలాగే డౌన్‌ట్రెండ్‌లో రూ.910 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. 3. షేరు పేరు: యూనైటెడ్ బేవరేజెస్ ప్రస్తుత షేరు ధర: రూ.1,011 (29-6-2020 నాటికి) విశ్లేషణ: కోవిడ్-19 లాక్‌డౌన్‌తో ఏర్పడిన అంతరాయాలతో మార్చి క్వార్టర్లో కంపెనీ నికరలాభం 39శాతం క్షీణించింది. ఫలితంగా షేరులో బేరిష్ పొజిషన్లు ఏర్పడ్డాయి. స్వల్పకాలం పాటు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., బలమైన బ్యాలెన్స్ షీట్‌తో రానున్న రోజుల్లో రాణించవచ్చు. షేరు పతనమైన ప్రతిసారి పొజిషన్లను తీసుకోవచ్చు. 4. షేరు పేరు: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత షేరు ధర: రూ.560 (29-6-2020 నాటికి) విశ్లేషణ: యాక్చెంచర్ క్యూ4 లాభాల ప్రకటన ఈ షేరుకు కూడా కలిసొచ్చింది. గత ఐదు సెషన్లలో ఈ షేరు 50రోజుల మూవింగ్ యావరేజ్ వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ షేరుకు రూ.545 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. ఈ జూలైలో సీరీస్‌లో రూ.600 వరకు లాభపడవచ్చు. -
పెరిగిన బుల్లిష్ రోలోవర్లు!
ఈ వారంలో బ్యాంకింగ్ స్టాకులకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు మంచి ర్యాలీ జరిపాయి. దీంతో నిఫ్టీ మరోమారు 9400 పాయింట్లను చేరింది. ఇదే జోరు జూన్ సీరిస్‌లో కొనసాగుతుందనేందుకు నిదర్శనంగా మంత్లీ బుల్లిష్ రోలోవర్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రమంగా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభం కానుండడంతో ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. గురువారం గణాంకాలు పరిశీలిస్తే నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ రోలోవర్లు 76 శాతం, స్టాక్ రోలోవర్లు 94 శాతంగా నమోదయ్యాయి. గత నెలలతో పోలిస్తే ఇది అధికమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆటో, ఇన్ఫ్రా, మీడియా, ఫార్మా రంగాల సూచీలు మేలో పాజిటివ్‌గా ముగిశాయి. బ్యాంకు సూచీ మాత్రం 15 శాతం పతనమైంది. 9000 పాయింట్ల వద్ద నిఫ్టీలో లాంగ్స్ పోగయ్యాయని, వీటిలో అధికభాగం జూన్ సీరిస్‌లోకి రోలోవర్ అయ్యాయని ఐసీఐసీఐ డైరెక్ట్ వెల్లడించింది. సూచీల్లో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ఇంకా పూర్తిగా పరిస్థితులు మెరుగుపడలేదని, కొత్తగా ఇండోచైనా టెన్షన్, మిడతల దండయాత్రవంటి రిస్కులు పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఇండెక్స్‌లో ఇంకా షార్ట్స్ ఉన్నందున మరో షార్ట్‌కవరింగ్ ఉండొచ్చని ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. నిఫ్టీకి 9600-9800 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని, 9000 పాయింట్లు గట్టి మద్దతుగా ఉంటుందని నిపుణుల అంచనా ఆప్షన్ డేటా పరిశీలిస్తే 10వేల పాయింట్ల వద్ద కాల్స్ అధికంగా ఉండగా, 9000 పాయింట్ల వద్ద పుట్స్ ఎక్కువగా ఉన్నాయి. కనుక జూన్ సీరిస్‌కు ఈ రెండు స్థాయిల మధ్య నిఫ్టీ కదలికలుండే అవకాశాలున్నాయి. -
ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నాయ్!
దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు అమ్మకాలకు దిగాయి. దీంతో సూచీలు భారీగా అమ్మకాల ఒత్తిడి చవిచూస్తున్నాయి. కాస్త పెరిగిన ప్రతిసారి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షోభ సమయంలో ఎక్కువమంది ‘‘సెల్ ఆన్ రైజ్’’ సూత్రం పాటిస్తున్నారు. దీంతో చిన్నపాటి పుల్‌బ్యాక్స్‌కూడా నిలబడట్లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బేర్ పుట్ స్ప్రెడ్ వ్యూహం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో మార్కెట్ పెరిగినప్పుడు ఏటీఎం పుట్ కొనుగోలు చేసి ఓటీఎం పుట్‌ను విక్రయిస్తారు. నిఫ్టీలో షార్ట్ పొజిషన్లు పరిశీలిస్తే ఎఫ్ఐఐలు కొత్త షార్ట్స్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. సోమవారం విదేశీ మదుపరులు ఒకపక్క షేర్లను విక్రయిస్తూ మరోపక్క షార్ట్పొజిషన్లు పెంచుకున్నారు. సోమవారానికి నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల ఉమ్మడి షార్ట్ ఇండెక్స్ ఫ్యూచర్లు పెరుగుదల నమోదు చేశాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుట్‌బేర్ వ్యూహం బెటరని, చిన్నపాటి బౌన్సులను ఈ వ్యూహంతో క్యాష్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
మార్కెట్లపై సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఫిబ్రవరి నెల ఎఫ్‌అండ్‌వో సిరీస్ గడువు ముగిసే రోజు కావడం, భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై చూపించింది. దీంతో ఉదయం ఆశాజనకంగా ప్రారంభమై లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య స్వల్ప శ్రేణి పరిధిలో కదలాడుతూ... చివరికి బీఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 35,829 వద్ద క్లోజ్ అవగా, అటు నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టపోయి 10,792 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,865–10,785 మధ్య ట్రేడ్ అయింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, యూరోప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ‘‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కారణంగా మార్కెట్ ఓ శ్రేణికి పరిమితమైంది. మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువ రోజుల పాటు కొనసాగవని ఇన్వెస్టర్లు భావించారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనికి అదనంగా ఆర్థిక గణాంకాలు, ఎన్నికల ముందుస్తు ర్యాలీ, ఎఫ్ఐఐల నిధుల రాక పెరగడం, రూపాయి బలోపేతం వంటి వాటిపైకి దృష్టి మళ్లిందన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్చి సిరీస్‌కు పొజిషన్లను క్యారీ ఫార్వార్డ్ చేసుకోకుండా, వాటిని క్లోజ్ చేసేందుకు మొగ్గు చూపించినట్టు బ్రోకర్లు తెలిపారు. మూడో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వినోద్ నాయర్ చెప్పారు. ఆర్ఈసీ రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 11 రూపాయలను మధ్యంతర డివిడెండ్‌గా ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణాల సమీకరణ పరిమితిని రూ.60,000 కోట్ల నుంచి రూ.85,000 కోట్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ‘కిరణ్’ ఇన్ఫోసిస్ షేర్ల అమ్మకం... ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్ మంజుందార్ షా నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు సంబంధించి 1,600 షేర్లను విక్రయించిన విషయం వెలుగు చూసింది. బయోకాన్ చైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ కంపెనీ బోర్డులో లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గానూ ఉన్నారు. తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవల ద్వారా ఆమె షేర్లను ముందస్తు అనుమతి లేకుండా అనుకోకుండా విక్రయించినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ‘‘కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆడిట్ కమిటీ సమీక్ష అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ పాలసీ, ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు గుర్తించాం. కిరణ్ మజుందార్ షాపై రూ.9.5 లక్షల పెనాల్టీని విధించడం జరిగింది. కిరణ్ మజుందార్ షా ముందస్తు అనుమతి లేకుండా తన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా 1,600 షేర్లను విక్రయించినట్టు ఇన్ఫోసిస్ కాంప్లియన్స్ ఆఫీసర్ దృష్టికి ఫిబ్రవరి 13న వచ్చింది’’ అని పేర్కొంది. పోర్ట్‌ఫోలియో మేనేజర్ షాకు తెలియకుండానే ఈ పనిచేసినట్టు వివరణ ఇచ్చింది. -
సిరీస్ లాభాల బోణి : కీలక స్థాయి ఎగువకి సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్త జనవరి ఎఫ్ అండ్ ఓ సిరీస్‌కు శుభారంభాన్నిచ్చాయి. ప్రపంచ మార్కెట్ల జోష్‌తో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మొదటినుంచి 36వేల స్థాయిని నిలబెట్టుకున్న సెన్సెక్స్ ఒక దశలో 350 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి 269పాయింట్లు ఎగసి 36,076 వద్ద నిఫ్టీ సైతం 80 పాయింట్లు పెరిగి 10,859వద్ద ముగిసింది. తద్వారా 10900 దిశగా నిఫ్టీ పయనిస్తోంది. అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఫార్మా, రియల్టీ, బ్యాంకింగ్ కౌంటర్లు లాభపడ్డాయి. యూపీఎల్, యస్‌బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, టైటన్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కో, ఎల్అండ్టీ లాభాల్లో ముగియగా, కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ స్వల్ప నష్టాలతో ముగిశాయి. -
సాక్షి...‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... రిలయన్స్ ఇండస్ట్రీస్: శుక్రవారం ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) రెండు రోజుల నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత సోమవారం 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,559 వరకూ పెరిగిన తర్వాత మరుసటి రోజే రూ. 1,515 వరకూ పడిపోయింది. తిరిగి బుధవారం మార్కెట్ ముగింపు సమయంలో నాటకీయంగా కోలుకుని రూ. 1,532 వద్ద ముగిసింది. ఈ ఒడుదుడుకుల మధ్య ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా 2.57 లక్షల షేర్లు యాడ్‌కావడంతో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 2.27 శాతం మేర పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ప్రీమియం రూ.5 నుంచి రూ. 6కు పెరిగింది. ఫ్యూచర్స్ ఓఐ, ప్రీమియంలు పెరగడం ట్రేడర్ల పాజిటివ్ దృక్ప«థాన్ని సూచిస్తున్నది. షేరు పెరిగినా, రూ. 1,540, 1,560 స్ట్రయిక్స్ వద్ద కాల్ కవరింగ్ స్వల్పంగానే జరిగింది. ఈ రెండు స్ట్రయిక్స్ వద్ద 9.5 లక్షల చొప్పున కాల్ బిల్డప్ వుంది. రూ. 1,500 స్ట్రయిక్ వద్ద తాజా పుట్ రైటింగ్ కూడా పెద్దగా జరగలేదు. కేవలం 30,000 షేర్లు యాడ్‌కావడంతో ఇక్కడ పుట్ బిల్డప్ 6.26 లక్షలకు చేరింది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆప్షన్ రైటర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఈ బిల్డప్ వెల్లడిస్తున్నది. çఫలితాలు వెల్లడయ్యేలోపు మరోదఫా రూ. 1,540–1,560 శ్రేణివరకూ పెరిగే ప్రయత్నం చేయవచ్చని, నాటకీయంగా అమ్మకాలు జరిగితే రూ. 1,500 వద్ద మద్దతు పొందవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సంకేతాలిస్తున్నది. ♦ మరి ఐడియా సెల్యులర్ డేటా ఏం చెబుతోంది? ♦ వేదాంత ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ఈ వివరాలు www.sakshibusiness.com-లో -
సాక్షి... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఐటీసీ: రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసిన ఐటీసీ షేరు డెరివేటివ్ కాంట్రాక్టుల్లో ఆసక్తికరమైన బిల్డప్ జరిగింది. షేరు పతనంతోపాటు ఈ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 6% పెరిగి 5.19 కోట్ల షేర్లకు చేరింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే రూ.0.50 మేర తగ్గింది. షేరు ధర తగ్గుదలతో పాటు ఓఐ పెరగడం, ప్రీమియం తగ్గడం వంటి సంకేతాలు షార్ట్‌సెల్లింగ్‌ను సూచిస్తున్నాయి. ఆప్షన్ కాంట్రాక్టులకు సం బంధించి రూ. 300, రూ. 290 స్ట్రయిక్స్ వద్ద భారీ కాల్‌రైటింగ్ జరిగింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద మంగళవారమే 70 లక్షల షేర్లు తాజాగా యాడ్‌కాగా, ఇక్కడ కాల్ బిల్డప్ 78 లక్షలకు చేరింది. రూ.290 స్ట్రయిక్ వద్ద 42 లక్షల మేర కాల్ బిల్డప్ జరిగింది. కానీ రూ.280 వద్ద పుట్ రైటింగ్.. కాల్ రైటింగ్ అంత బలంగా లేదు. సమీప భవిష్యత్తులో ఐటీసీ రూ.300 స్థాయి దాటడం కష్టసాధ్యమని, రూ.290 దిశగా పెరిగితే అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని డేటా చెబుతోంది. ⇔ మరి బ్యాంక్ నిఫ్టీ డేటా ఏం చెబుతోంది? ⇔ ఎస్బీఐ ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ⇔ ఈ వివరాలు www.sakshibusiness.comలో -
తీవ్ర హెచ్చుతగ్గులు
♦ తొలుత భారీ ర్యాలీ... చివరకు స్వల్పలాభాలతో ముగింపు ♦ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు పెరిగిన కారణంగా గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో జోరుగా ర్యాలీ సాగించిన భారత్ సూచీలు...గరిష్టస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో ముగింపు సమయంలో నష్టాల్లోకి జారిపోయాయి. అయితే చివరకు స్వల్పలాభాలతో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 260 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,098 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. అటుతర్వాత గరిష్టం నుంచి 300 పాయింట్ల మేర పతనమై 30,795 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు 23 పాయింట్ల స్వల్ప లాభంతో 30,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,576 పాయింట్ల గరిష్టస్థాయి, 9,494 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 13 పాయింట్ల లాభంతో 9,504 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో పాటు ఎయిర్ఇండియాను డిజిన్వెస్ట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో..సంస్కరణలు కొనసాగుతాయన్న భరోసా ఏర్పడి, ట్రేడింగ్ ప్రారంభంలో ర్యాలీ జరిగిందని మార్కెట్ వర్గాలు వివరించాయి. గతరాత్రి అమెరికా మార్కెట్ 1 శాతం మేర ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా, యూరప్ ప్రాంతాల్లోని ప్రధాన సూచీలు 0.5–1 శాతం మధ్య లాభపడ్డాయి. లాభాల స్వీకరణ... కానీ జూన్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు గురువారం ముగింపురోజుకావడం, జీఎస్టీ అమలుకానున్న నేపథ్యంలో జాగురూకత వంటి అంశాలతో ట్రేడింగ్ ముగింపు సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్టీ అమలుతో రానున్న కొద్ది త్రైమాసికాల్లో సమస్యలు వుంటాయన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, దీంతో మార్కెట్ కన్సాలిడేషన్ దశలోనే వుంటుందని భావిస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ 3.48 శాతం జంప్... సెన్సెక్స్–30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అన్నింటికంటే అధికంగా 3.48 శాతం ర్యాలీ జరిపి రూ. 511 వద్ద ముగిసింది. టాటా స్టీల్ 2.85 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి రూ. 533 వద్ద క్లోజయ్యింది. సిప్లా, భారతి ఎయిర్టెల్, ఐటీసీలు 1 శాతంపైగా పెరిగాయి. మరోవైపు కొటక్ బ్యాంక్ 1.95 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ 1.40 శాతం, ఎస్బీఐ 1.39 శాతం, సన్‌ఫార్మా 1.23 శాతం చొప్పున తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 2.15 శాతం పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం లాభపడింది. -
ఒడిదుడుకుల వారం!
► ఈ వారంలోనే ఎఫ్ అండ్ ఓ ముగింపు ► స్వల్పకాలంలో ‘అంతర్జాతీయ’ ప్రభావం ► రిలయన్స్‌పై సెబీ నిషేధం ప్రతికూలం ► ఐఎండీ అంచనాలు సానుకూలం ► మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే(గురువారం–ఈ నెల 30న) ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో మార్కెట్ దిశను అంతర్జాతీయ సంకేతాలు ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోకడలు.. ఈ అంశాలన్నింటి ప్రభావం కూడా స్టాక్ సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ నిషేధం విధించడం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. ఎల్‌నినో ప్రభావం వర్షాకాలం పూర్తయిన తర్వాతనే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)గత శుక్రవారం వెల్లడించడం మార్కెట్‌కు సానుకూలాంశమని నిపుణులంటున్నారు. సుదీర్ఘ కన్సాలిడేషన్.. మొత్తం మీద మార్కెట్ సుదీర్ఘకాల కన్సాలిడేషన్లోకి వెళుతోందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఇప్పటికే సానుకూల అంశాలన్నింటినీ మార్కెట్ గ్రహించిందని, ఇక మరింత పైకో, లేక కిందకో వెళ్లడానికి ముందు దీర్ఘకాల కన్సాలిడేషన్లోకి ప్రవేశిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 12న ముగుస్తాయి. మార్చి సిరీస్ డెరివేటివ్స్ ముగియనున్నందున ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ అభ్నిష్ కుమార్ ఆధ్య చెప్పారు. ఒబామాకేర్ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన హెల్త్‌కేర్ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి తగిన ఓట్లు రావనే అంచనాలతో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారని ఈ ప్రభావం కూడా మన స్టాక్ మార్కెట్‌పై ఉండనున్నదని వివరించారు.. మరోవైపు వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడ కూడా మన మార్కెట్‌పై ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి పేర్కొన్నారు. మార్కెట్ పై స్థాయిల్లో ఎంత బలంగా నిలదొక్కు కోగలదో అన్న అంశం కూడా ప్రభావం చూపుతుందని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. మరింత ముందుకే మార్కెట్ ! అత్యంత కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నందున మార్కెట్ జోరు కొనసాగుతుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. ఈ వారంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,000–9,250 పాయింట్ల రేంజ్లో(గత శుక్రవారం నిఫ్టీ 9,108 పాయింట్ల వద్ద ముగిసింది) కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా స్టాక్ సూచీలు గత వారంలో నష్టాలపాలయ్యాయి. గత మూడు వారాల్లో స్టాక్ సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. బీఎస్ఈ సెన్సెక్స్228 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. విదేశీ పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ మన క్యాపిటల్ మార్కెట్లో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీగా విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ.22,268 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.16,177 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో వీరి ఇన్వెస్ట్మెంట్స్ ఈ నెలలో ఇప్పటివరకూ రూ.38,445 కోట్లుగా(584 కోట్ల డాలర్లు) ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.30,994 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.19,818 కోట్లు, వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.50,811 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని బజాజ్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాలా చెప్పారు. గత నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి. -
26,000 దిగువకు సెన్సెక్స్
వరుసగా రెండో రోజు మార్కెట్లు నష్టపోయాయి. వారం రోజుల తరువాత మళ్లీ సెన్సెక్స్ 26,000 పాయింట్ల దిగువకు చేరింది. 136 పాయింట్లు క్షీణించి 25,991 వద్ద ముగిసింది. ఒక దశలో కనిష్టంగా 25,900ను తాకింది. ఇక నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 7,749 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆయిల్ రంగాలు 3-1.5% మధ్య నీర సించాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకావడం, గురువారం ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలినుంచీ అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారని నిపుణులు పేర్కొన్నారు. కాగా, వరుసగా రెండు రోజుల్లో సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌యూఎల్ జోష్: క్యూ1 ఫలితాల కారణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ దాదాపు 4% పుంజుకోగా, గత మూడు వారాల్లోలేని విధంగా కోల్ ఇండియా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, హీరోమోటో, ఆర్ఐఎల్, ఓఎన్ జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్, ఫీనిక్స్, డీబీ, శోభా, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, యూనిటెక్ 5-2% మధ్య పడ్డాయి. నేడు మార్కెట్లకు సెలవు ముంబై: ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) ఎన్ఎస్ఈ, బీఎస్ఈలతోపాటు, ఫారెక్స్, మనీ, మెటల్, ఆయిల్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్, చక్కెర మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. నేటి బోర్డ్ మీటింగ్స్ ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ర్యాన్‌బాక్సీ, సెసాస్టెరిలైట్, ఐడీఎఫ్సీ, డీసీఎం శ్రీరామ్, ఎస్కార్ట్స్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, వీగార్డ్ ఇండస్ట్రీస్, వీఐపీ ఇండస్ట్రీస్.