తీవ్ర హెచ్చుతగ్గులు
♦ తొలుత భారీ ర్యాలీ... చివరకు స్వల్పలాభాలతో ముగింపు
♦ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు పెరిగిన కారణంగా గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో జోరుగా ర్యాలీ సాగించిన భారత్ సూచీలు...గరిష్టస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో ముగింపు సమయంలో నష్టాల్లోకి జారిపోయాయి. అయితే చివరకు స్వల్పలాభాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలుత 260 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,098 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. అటుతర్వాత గరిష్టం నుంచి 300 పాయింట్ల మేర పతనమై 30,795 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు 23 పాయింట్ల స్వల్ప లాభంతో 30,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,576 పాయింట్ల గరిష్టస్థాయి, 9,494 పాయింట్ల కనిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 13 పాయింట్ల లాభంతో 9,504 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో పాటు ఎయిర్‌ఇండియాను డిజిన్వెస్ట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో..సంస్కరణలు కొనసాగుతాయన్న భరోసా ఏర్పడి, ట్రేడింగ్ ప్రారంభంలో ర్యాలీ జరిగిందని మార్కెట్ వర్గాలు వివరించాయి. గతరాత్రి అమెరికా మార్కెట్ 1 శాతం మేర ర్యాలీ జరిపిన ప్రభావంతో ఆసియా, యూరప్ ప్రాంతాల్లోని ప్రధాన సూచీలు 0.5–1 శాతం మధ్య లాభపడ్డాయి.
లాభాల స్వీకరణ...
కానీ జూన్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులకు గురువారం ముగింపురోజుకావడం, జీఎస్‌టీ అమలుకానున్న నేపథ్యంలో జాగురూకత వంటి అంశాలతో ట్రేడింగ్ ముగింపు సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్‌టీ అమలుతో రానున్న కొద్ది త్రైమాసికాల్లో సమస్యలు వుంటాయన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, దీంతో మార్కెట్ కన్సాలిడేషన్ దశలోనే వుంటుందని భావిస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
యాక్సిస్ బ్యాంక్ 3.48 శాతం జంప్...
సెన్సెక్స్–30 షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అన్నింటికంటే అధికంగా 3.48 శాతం ర్యాలీ జరిపి రూ. 511 వద్ద ముగిసింది. టాటా స్టీల్ 2.85 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి రూ. 533 వద్ద క్లోజయ్యింది. సిప్లా, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీలు 1 శాతంపైగా పెరిగాయి. మరోవైపు కొటక్ బ్యాంక్ 1.95 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ 1.40 శాతం, ఎస్‌బీఐ 1.39 శాతం, సన్‌ఫార్మా 1.23 శాతం చొప్పున తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ 2.15 శాతం పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం లాభపడింది.