ఒడిదుడుకుల వారం!
► ఈ వారంలోనే ఎఫ్ అండ్ ఓ ముగింపు
► స్వల్పకాలంలో ‘అంతర్జాతీయ’ ప్రభావం
► రిలయన్స్‌పై సెబీ నిషేధం ప్రతికూలం
► ఐఎండీ అంచనాలు సానుకూలం
► మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారమే(గురువారం–ఈ నెల 30న) ముగియనున్నందున స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో మార్కెట్ దిశను అంతర్జాతీయ సంకేతాలు ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పోకడలు.. ఈ అంశాలన్నింటి ప్రభావం కూడా స్టాక్ సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
రిలయన్స్ డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో పాల్గొనకుండా మార్కెట్ నియం త్రణ సంస్థ సెబీ నిషేధం విధించడం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది. ఎల్‌నినో ప్రభావం వర్షాకాలం పూర్తయిన తర్వాతనే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)గత శుక్రవారం వెల్లడించడం మార్కెట్‌కు సానుకూలాంశమని నిపుణులంటున్నారు.
సుదీర్ఘ కన్సాలిడేషన్..
మొత్తం మీద మార్కెట్ సుదీర్ఘకాల కన్సాలిడేషన్‌లోకి వెళుతోందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఇప్పటికే సానుకూల అంశాలన్నింటినీ మార్కెట్ గ్రహించిందని, ఇక మరింత పైకో, లేక కిందకో వెళ్లడానికి ముందు దీర్ఘకాల కన్సాలిడేషన్‌లోకి ప్రవేశిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని పేర్కొన్నారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 12న ముగుస్తాయి.
మార్చి సిరీస్ డెరివేటివ్స్ ముగియనున్నందున ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ అభ్నిష్ కుమార్ ఆధ్య చెప్పారు. ఒబామాకేర్ స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన హెల్త్‌కేర్ బిల్లును ఉపసంహరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి తగిన ఓట్లు రావనే అంచనాలతో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారని ఈ ప్రభావం కూడా మన స్టాక్ మార్కెట్‌పై ఉండనున్నదని వివరించారు.. మరోవైపు వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడ కూడా మన మార్కెట్‌పై ఉంటుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి పేర్కొన్నారు. మార్కెట్ పై స్థాయిల్లో ఎంత బలంగా నిలదొక్కు కోగలదో అన్న అంశం కూడా ప్రభావం చూపుతుందని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు.
మరింత ముందుకే మార్కెట్ !
అత్యంత కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నందున మార్కెట్ జోరు కొనసాగుతుందని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. ఈ వారంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,000–9,250 పాయింట్ల రేంజ్‌లో(గత శుక్రవారం నిఫ్టీ 9,108 పాయింట్ల వద్ద ముగిసింది) కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా స్టాక్ సూచీలు గత వారంలో నష్టాలపాలయ్యాయి. గత మూడు వారాల్లో స్టాక్ సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. బీఎస్‌ఈ సెన్సెక్స్228 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.
విదేశీ పెట్టుబడుల జోరు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ మన క్యాపిటల్ మార్కెట్లో 600 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ భారీగా విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ.22,268 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.16,177 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశారు.
మొత్తం మన క్యాపిటల్ మార్కెట్లో వీరి ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ నెలలో ఇప్పటివరకూ రూ.38,445 కోట్లుగా(584 కోట్ల డాలర్లు) ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.30,994 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.19,818 కోట్లు, వెరసి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.50,811 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మరిన్ని సంస్కరణలు వస్తాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారని బజాజ్ క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ అగర్వాలా చెప్పారు. గత నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.15,862 కోట్లుగా ఉన్నాయి.